పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/668

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చదరంగము - 1

సంగ్రహ ఆంధ్ర

ముగా పరిగణింపబడి యుండలేదు. శాస్త్రీయమైన చదరంగమునకు ఈ క్రీడలకు నడుమ పెక్కు లక్షణములలో విశేషములైన అంతరము లుండి యున్నవని చదరంగ క్రీడా నిష్ణాతులు ప్రకటించియున్నారు.

డా. థామస్‌హైడ్ అను ఆక్స్‌ఫర్డు వాస్తవ్యుడు (క్రీ. శ. 1894 సం.), సర్ విలియమ్ జోన్స్ అను మరియొక పాశ్చాత్యుడును (క్రీ. శ. 1783 సం ) చదరంగమునకు భారతదేశమే జన్మస్థానమనియు, అతి ప్రాచీన కాలమునుండి ఈ ఆట భారతదేశములో జనరంజకమైనదిగా పరిగణించబడుచు వచ్చెననియు వక్కాణించి యుండిరి. ఆదికాలములో చదరంగము 'చతురంగము' అనెడి నామముతో వ్యవహరింపబడుచు వచ్చెనని వీరు వ్రాసియుండిరి. రణభూమియందు రథ, గజ, తురగ, పదాతులు తమ పాత్రలను క్రమబద్ధముగ నిర్వర్తించినట్లే, చదరంగమునకూడ ఈ పాత్రలు వేరు రూపములలో వేరు విధముగా వ్యవహరించి యుండెననియు. భారతీయ పురాణేతిహాసములందు 'చతురంగ' (చదరంగము) క్రీడను గురించిన ప్రసక్తి మెండుగా నుండె ననియు, వీరు వాదించియున్నారు. అమరకోశము నందును, వాత్స్యాయన కామసూత్రములయందును చదరంగము ప్రశంసింపబడి యున్నది. రాధాకాంత పండితవర్యుడు చదరంగమును గూర్చిన వర్ణనము పురాతన న్యాయశాస్త్ర గ్రంథములయందు కలదని వివరించినాడు. రాముడు లంకానగరమును ముట్టడించిన తరుణములో, మండోదరి, తన భర్త రావణునికి ముదము కూర్చుటకై చదరంగ క్రీడావిశేషమును అప్పటి కప్పుడు కల్పించి యుండెనని ఇతడు వ్రాసి యున్నాడు. మరికొందరు చరిత్రకారులు నుడివినట్లు 'చతురంగ' మను పేర బరుగు చుండిన ఈ క్రీడ క్రీ. శ. 6 వ శతాబ్దిలో భారతదేశము నుండి పర్షియాకు తరలిపోయినట్లును, పర్షియనులు ఆక్రీడను 'చత్రంగ్ ' అను అపభ్రంశరూపములో ఉచ్చరించి యున్నట్లును, అటుపిమ్మట పర్షియాను ఆక్రమించిన అరబ్బులు ఆ యాటను 'షాత్రంగ్ ' అను భ్రష్టనామముతో పిలిచియున్నట్లును, చరిత్రకారుల వ్రాతలవలన విదితమగు చున్నది.

వాన్‌డర్ లిండె అను మరియొక పాశ్చాత్యుడుకూడ చదరంగము భారతదేశమునుండియే పర్షియాలో అడుగిడినట్లు క్రీ. శ. 1874 సం. లో వ్రాసియున్నాడు. క్రీ. శ. 8 వ శతాబ్దియందు ఈ క్రీడ భారతదేశములో బహుళ వ్యాప్తియం దుండినట్లును, క్రీ. శ. 3 వ శతాబ్దినుండి 9 వ శతాబ్దివరకు - భారతదేశములో బౌద్ధమతము విరివిగా వ్యాపించియున్న కాలములో చదరంగము ప్రథమముగా బౌద్ధులచే కల్పింపబడినట్లును ఇతడు తెలుపు చున్నాడు. యుద్ధము, జననాశనము ఘోరములగు హింసాకార్యములగుటచే, అట్టి దుష్కృత్యములనుండి ప్రభువులను, ప్రజలను విముఖులనుగావించుటకై బౌద్ధు లీ క్రీడను కల్పనముచేసియుండినట్లు వాన్‌డర్ లిండె వివరించి యుండెను. హెచ్. జె. ఆర్. ముర్రే అను మరియొక పాశ్చాత్య రచయితగూడ చదరంగము భారతీయ క్రీడా విశేషమేయని సాధికారముగ ధృవపరచి యున్నాడు. ఈ క్రీడ యొక్క పుట్టుపూర్వోత్తరములను గురించి ఎవరెన్ని భిన్నమార్గములలో వ్యాఖ్యానించియున్నను, అత్యధిక సంఖ్యాకులైన ప్రాక్పశ్చిమ చరిత్రకారులు ఈ చదరంగమునకు భారతదేశమే పుట్టినిల్లని నిర్ద్వంద్వముగ, నిస్సందేహముగ ఉద్ఘాటించి యున్నారు.

మధ్యయుగములో చదరంగము : చదరంగముయొక్క పుట్టుకను గూర్చిన గాధ సందిగ్ధముగను, అస్పష్టముగను ఉండుటచే ఆ క్రీడయొక్క తొలిచరిత్రగూడ అయోమయముగ నుండుట సహజము. చదరంగక్రీడ భారత పొలిమేరలనుదాటి పర్షియాలో ప్రవేశించినట్లు తెలిసికొని యున్నాము. పర్షియాలో ఈ యాట “షాత్రంగ్" అను నామముతో వ్యవహరించెడివారట. పర్షియన్ మహాకవి ఫిరదౌసి, తాను రచించిన 'షహనామ' గ్రంథమునందు 'షాత్రంగ్ అనెడి క్రీడ ఒకటవ ఛోస్రోస్ అను ప్రభువు పరిపాలనలో పర్షియాయందు కాలూనినట్లు పేర్కొని యున్నాడు. తక్కిన పర్షియను, అరేబియను రచయితలు గూడ 'షాత్రంగ్' భారతదేశమునుండియే పర్షియాలో ప్రవేశ పెట్టబడియున్నట్లు ఐక్యకంఠముతో వాక్రుచ్చి యున్నారు. అటుపిమ్మట పర్షియానుండి అరేబియాలోను అరేబియానుండి ఐరోపాఖండ దేశములలోను ఈ చదరంగ క్రీడ ప్రవేశ మొనర్చి నట్లు చరిత్రకారులు ఊహ చేసి యున్నారు.

608