విజ్ఞానకోశము - 3
చతురంగబలములు - 2
విశ్వామిత్రుడు పేర్కొన్నాడు. హస్తిక, శూల, వరాహ కర్ణ, గోప్పణ పాషాణ, ముష్టి పాషాణ, రోచని అను వాటిని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఇంద్రుని వజ్రా యుధము, యముని కాలపాశము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, పాశుపతాస్త్రము అనునవి మనకు పరిచయమైన పేర్లే. వీటిని మంత్రించి వదలుచుండిరి.
యంత్ర ముక్తాయుధములు : ఆయుధములలో నాల్గవ తరగతికి చెందిన యంత్ర ముక్తాయుధములు పందొమ్మిది కలవు. కాని యిది పూర్తిసంఖ్యకాదు. సర్వతోభద్ర, జమదగ్న్య. బహుముఖ, విశ్వాసఘాటి, పర్జన్యక, బాహు, అర్ధబాహు, పాంచాలిక, దేవదండ, సుకారిక, యష్టి, హస్తివారక, తాళవృంత, స్పృక్తల, కుద్దాల, స్పాఠిమ, ఔదఘాటిమ, మహేంద్ర, బ్రహ్మదత్త - అని యంత్ర ముక్తాయుధములలో కొన్నింటిపేర్లు. సర్వతోభద్రము ఒక చిన్నబండి; అన్నివైపులకు రాళ్ళు విసరుచుండును. జమదగ్న్యము బాణములను విజేపింపజేసే గొప్ప యంత్రము. బాహుముఖము ధనుర్ధరులకడ నుండునది. విశ్వాసఘాటి శత్రువు ప్రవేశించునపుడు వానిమీద పడునట్లుగా అమర్చిన పెద్దదూలము, పర్జన్యక అగ్నిమాపక నీటి యంత్రము; ఔదఘాటిమ కోటబురుజులను కూలద్రోయు యంత్రము.
వ్యూహములు : యుద్ధరంగములో సేనలను నిలుపుట యందును విధానము లుండెను. సేనలను నిలుపు విధానమునకు వ్యూహములని పేరు. ఈ వ్యూహములు అయిదు విధములుగా నున్నట్లు కనబడుచున్నది. దండ, మండల, భోగ, అసంహత, విషమ అని వ్యూహముల పేర్లు. ఇవి గాక, సమ, విషమ, హస్తి, రధి, అశ్వ, పత్తి వ్యూహములను కౌటిల్యుడు చెప్పియున్నాడు. భూమి స్వభావమును బట్టి యీ వ్యూహ నిర్మాణము లుండును. ఈ వ్యూహముల ప్రకారము చతురంగ బలములను నిలుపుచుండిరి.
కవచములు : యోధులకు దెబ్బలు తగిలి గాయములు కాకుండ కవచము లుండెను. ఈ కవచములు నాలుగు విధములు : 1. చేతులతోసహా ఆపాద మస్తకము కప్పి యుంచునవి. 2. శిరస్సు, వక్షస్థలమును కప్పునవి. 3. హస్తముల నావరించునవి. 4. నడుమునకు కొల్లాయ గుడ్డవలె చుట్టుకొని యుండునవి. శిరస్త్రాణము, కంఠ స్త్రాణము, కింపన, కంచుకము, వారవాణ, పట్ట, నాగోదార్క, పేతి, చర్మ, తాళమూల, భమనిక, కవాట, కిటిక, అప్రతిహత, వలాహకాంట అనునవి కవచముల పేర్లు. గజములకును, గుఱ్ఱములకును కవచములుండెను. కవచములు ఉక్కుతోను, చర్మముతోను, కఱ్ఱతోను, గడ్డితోను నిర్మించుచుండిరి.
వాద్యములు : యుద్ధమునకు సంబంధించిన వాద్యము లుండెను. దుందుభి, బకుర, భేరి, పణవ, క్రకచ, ఆనక, మహానక, కాహళ, పటాహ, పుష్కర, గోవిష్ణక, శంఖము - అనునవి రణవాద్యములు. వీటిధ్వనులు వేర్వేరుగా నుండును. వేర్వేరు అర్థముల నిచ్చును. గోవిష్ణికలు కొమ్ములతో చేయబడినట్టివి. శంఖములు చిన్నవి. పెద్దవి పెక్కు పరిమాణములలో నుండును. ధ్వనుల భేదముకూడ ఉండును. ప్రతి సేనానాయకునకు ఒక శంఖ ముండుచుండెను. ఆ శంఖధ్వనినిబట్టి నాయకుని గుర్తించుచుండిరి. శంఖముల పేర్లును వేర్వేరుగా నుండెను. శ్రీకృష్ణునిది పాంచజన్యము, అర్జునునిది దేవదత్తము, యుధిష్ఠిరునిది అనంతవిజయము, భీమునిది పౌండ్రకము, నకులునిది సుఘోషము, సహదేవునిది మణిపుష్పకము.
పతాకలు : యుద్ధ తంత్రములో పతాకలుకూడ ఒక అంగముగా నేర్పడి యుండెను. ఋగ్వేద సంహితలో అక్ర, కృతధ్వజ, కేతు, బృహత్కేతు, సహస్రకేతు, అని ధ్వజములపేర్లు కనబడుచున్నవి. అధర్వవేదములో సూర్య ధ్వజ ప్రశంసకలదు. ధ్వజములలో చిన్నవి. పెద్దవి ఉండెను. ప్రతి సేనానాయకునకు ప్రత్యేకమయిన ధ్వజ ముండెను. ఈ ధ్వజములనుబట్టి దళములను గుర్తించు చుండెడివారు. ధ్వజములమీద ఎక్కువగా జంతువుల చిహ్నము లుండును. శ్రీకృష్ణునకు గరుడధ్వజము, అర్జునునకు కపిధ్వజము, దుర్యోధనునకు నాగధ్వజము, శల్యునకు సీతధ్వజము, భీష్మునకు తాలధ్వజము, ద్రోణునకు కమండల ధ్వజము, ఘటోత్కచునకు చక్రధ్వజము, భీమసేనునకు సింహధ్వజము, యుధిష్ఠిరునకు చంద్రధ్వజము, నకులునకు శరభధ్వజము, సహదేవునకు హంస ధ్వజము, అభిమన్యునకు సారంగపక్షి ధ్వజము, రామాయణీయభరతునకు కోవిదార వృక్షధ్వజము, శివునకు వృషభ
601