విజ్ఞానకోశము - 3
చంపూకావ్యములు (సంస్కృతము)
శిష్టాధ్యయనపరుల అసంతుష్టిని, ధనార్జనాసక్తిని కఠినముగ విమర్శించినాడు మహాకవి. అంబికావాసుదేవుల తనయుడును, 'విద్యాపతి' యను బిరుదముచే నలంకృతుడునునగుదత్తాత్రేయశాస్త్రి స్వీయ 'గంగాగుణాదర్శ చంపువు' నందు, ఇరువురు గంధర్వుల సంవాదరూపమున గంగానది యందలి గుణదోషములను ప్రదర్శించెను.
క్షేత్ర మాహాత్మ్య ప్రతిపాదకములయిన చంపువులు కొన్ని వెలసినవి. నీలకంఠుని 'కాశికాతిలకము' నందు, అవిముక్త పురమునకు వేంచేసియున్న శివు నన్వేషించు తలంపుతో, ఇరువురు గంధర్వులు కుబేరాజ్ఞప్తులై, మనుష్య రూపములను ధరించి, వివిధ క్షేత్రములను దర్శించి, తత్తన్మహిమాభివర్ణన మొనర్చిరి. 17 వ శతాబ్ది మధ్యభాగమున నున్న సమర్పుంగదీక్షితుని 'తీర్థయాత్రా ప్రబంధము'నందు వివిధక్షేత్రముల పావిత్య్రమహిమలు కీర్తింపబడినవి. ఈ కవి ఉత్తర ఆర్కాటు మండలము (జిల్లా) నందలి తిరువలంగడునందు నివసించెను. భారద్వాజ గోత్రుడగు సూర్యనారాయణుడు రచించిన 'శ్రుతకీర్తి విలాస చంపువు' నందు శ్రుతకీర్తి అను బ్రాహ్మణునిచే దర్శింపబడిన వివిధ పుణ్యక్షేత్రముల మహిమ ఉగ్గడింప బడినది. శంకరదీక్షితుని 'గంగావతార చంపూ కావ్యము'న గంగా వృత్తాంతము పొందుపరచబడినది.
దేశాభిమానమును బ్రకటించు చంపువులు కొన్నిరచింప బడినవి. 17 వ శతాబ్ది ఉత్తరభాగమున నున్న రామచంద్రదీక్షితు డాతని 'కేరళాభరణము' నందు, వసిష్ఠ విశ్వామిత్రుల చర్చారూపమున, భరతఖండమునందలి ప్రాంతములలో నెల్ల కేరళము శ్రేష్ఠమైనదని తేల్చినాడు. ఇది యొక స్వతంత్ర రచన. 17 వ శతాబ్దాంతమున నున్న వాడును, మాయావరప్రాంతమునందలి 'కిలయూరు' అను గ్రామమున వసించినవాడును నగు అప్పాధ్వరి తన 'గౌరీ మాయూర మాహాత్మ్య'మ ను చంపువునందు మాయావర గ్రామ ప్రాశస్త్యము నభివర్ణించెను.
కృష్ణకవి ప్రణీతమయిన 'మందారమరంద చంపువు' నందు ఛందో౽లంకారములకు ఉదాహరణములు కనిపించు చున్నవి.
ఆధునికములయిన చంపూకావ్యములు అల్పసంఖ్యాకములు కలవు. 'కుమారోదయము', 'దేవి విజయము' అను రెండు ఉత్తమ చంపూకావ్యములను రచించిన మహాపండితుడు కోరాడ రామచంద్రశాస్త్రి. ఈ కవి సుప్రసిద్ధ నామధేయుడు, సంస్కృతాంధ్ర సాహిత్య నిధి. విద్వత్కవి, ఆంధ్ర బ్రాహ్మణుడు. శృంగారసుధార్ణవము, ఘనవృత్తము, ధీసౌధము (వ్యాకరణ గ్రంథము), రామచంద్రీయము, బాలచంద్రోదయము, ఉపమావళి మున్నగు పెక్కు గ్రంథములను సంస్కృతమునను, అనేక గ్రంథములను ఆంధ్రమునను రచించి విఖ్యాతుడైనవా డీ కవీశ్వరుడు.
కుమారోదయమున 27 ఉల్లాసములు కలవు. వీటిలో 9 ఉల్లాసములే ముద్రితము లయినవి. ఉల్లాసాంతములగల
“శ్రీమత్కోరాడ వంశే
సకల మునిజన శ్లాఘ్య కౌండిన్య గోత్రే,
సంజాతో లక్షణార్యః
సుగుణ మణిఖనిః సుబ్బమాంబా చ సాధ్వీ
యం పూర్వం రామచంద్రం ......
...... సుతమజన యతాం.”
అను శ్లోకమునుబట్టి ఈ మహాకవి కౌండిన్యగోత్రు డనియు సుబ్బమాంబా లక్షణార్యుల జ్యేష్ఠపుత్రు డనియు విదిత మగుచున్నది.
కావ్యారంభమున :
అన్యోన్య ప్రణయాంభోధి సుధాకిరణ విభ్రమౌ
ప్రపంచ ప్రకృతీప్రత్నౌ ప్రణౌమ్యేకాం గదంవతీ.
అను నమస్కా రాత్మక శ్లోకము కలదు.
అనాహూతయై యజ్ఞమున కేగిన పార్వతి సమక్షమున శివుని దక్షుడు దూషించిన విధ మాతని గర్వాతి రేకమును సూచించుచున్నది.
ఉదా : వ్యాళాన్న కింహరతి జాంగలికో౽స్థిజాతం
మాంసాశనో౽పి నవహ త్యథకిం నుతేన
ప్రేతాలయే న విచరంతి ను జంబుకౌఘాః
తేభ్యఃకిమంతర మభూత్ భువి భూతభర్తుః.
వరప్రదానాంతమున బ్రహ్మదేవుడు తారకాసురున కొసగిన ఉపదేశము కవికిగల రాజనీతిజ్ఞతకును, సరళవచన రచనా చాతురికిని తార్కాణము.
ఉదా : గోపయ హృదయ ఏవ విరోధవికారం, వికాసయ
ప్రేమముకులం, మా విధేహిసతాం వృత్తిభంగం,
591