పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/645

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చంపూకావ్యములు (సంస్కృతము)

రాయల (క్రీ. శ. 1540) పట్టమహిషి. తన భర్తయగు అచ్యుతదేవరాయలు మహావైభవముతో వరదాంబికను పెండిలియైన వృత్తాంతమును సరసముగ ఈ చంపువునందు వర్ణించిన ఉదారశీల ఈ తిరుమలాంబ. వేదాధినాథ కృత 'గోదాపరిణయము'ను, శ్రీనివాస దీక్షిత ప్రణీత 'భైష్మీపరిణయ చంపువు'ను, చక్రకవి (1650) గ్రథిత 'ద్రౌపదీ పరిణయము'ను, గంగాధర కవి రచిత 'మద్ర కన్యా పరిణయము'ను, కందుకూరి నాగనాథసూరి నిర్మిత 'మీనాక్షి కల్యాణము' ను, 'ఉషాపరిణయ - పాంచాలీ స్వయంవరము'లును సంస్కృత వాఙ్మయమున వెలసిన పరిణయకథాత్మక చంపూ కావ్యములకు చక్కని ఉదాహరణములు.

మతప్రచారోదిష్టచంపువులు : సంస్కృత చంపూవాఙ్మయ పాదపమును స్వీయ రచనాదోహదములచే సుపుష్టమును సుసంపన్నము నొనర్చిన కవితల్లజులలో జైనకవి హరిచంద్రు డొకడు. ఇతడు 'జీవంధర చంపువు'ను సంతరించెను. క్రీ. శ. 850 వ సంవత్సరమున గుణభద్రుడు పూర్తి యొనర్చిన ఉత్తర పురాణ మాధారముగ నిది రచింపబడినది, కావున ఈ కవి క్రీ. శ. 900 సంవత్సరములకు పిమ్మట నున్న వాడని నిశ్చయింపబడినది ఈ కావ్యమందలి పదునొకండు లంబకములలో, జీవంధరుడను నొక జైన సిద్ధపురుషుని చరితము వర్ణింపబడినది. నేమిదేవుని శిష్యుడగు సోమదేవుడు క్రీ. శ. 959 వ సంవత్సరమున నిర్మించిన 'యశస్తిలక చంపువు' లోక విఖ్యాతమైనది. ఇది ఎనిమిది ఆశ్వాసములు కావ్యము. ఈ కవికి పోషకుడు కృష్ణరాజదేవుడు. కృష్ణరాజదేవుడు రాష్ట్రకూట రాజగు మూడవ కృష్ణుడే. హరిదత్తు డను రాజు యజ్ఞదీక్షితు డయ్యెను. ఆ యజ్ఞమునందు ఒక బాలకుని ఒక బాలికను ఆ రాజు తన కులదేవతకు బలిగా నర్పింప దలచెను. ఆ సమయమున కవలలయిన ఆ పిల్లలు, ఆశ్చర్యకరముగ తమ పూర్వజన్మ వృత్తాంతమును, నృపుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించిరి. అంతలో సుదత్తుడను ఋషి యజ్ఞ నిర్వహణము నిష్ఫల మని ఆ రాజునకు బోధించెను. రాజంతట జైనుడుగా మారెను. అని అవగతమగుచున్నది. అవతారికా శ్లోకములందు భారవిని, బాణుని, మయూరుని, నారాయణుని, మాఘుని, రాజ శేఖరుని, ఇతర కవులను కవి పేర్కొని యున్నాడు. ఈ చంపువునందు తుది మూడాశ్వాసములలో జైనమత సిద్ధాంతములు ప్రతిపాదింపబడినవి. 'జీవంధర యశస్తిలక చంపు' వులు యజ్ఞమతనిరసనము, జైనమతప్రచారము దృష్టియం దిడుకొని రచింపఁ బడిన కావ్యములు.

సంస్కృత చంపూరచయితల దృష్టి రామాయణ కథపై ప్రసరించెను. భోజుడు 'చంపూరామాయణము'ను రచించెను. దీనికి 'భోజచంపు' వనియు వ్యవహారము కలదు. ఇది చంపూకావ్యమణిహారమున నాయకమణిగా నెన్నబడినది. ముద్రితమయిన మూలగ్రంథమున ఈచంపువును రచించిన కవి విదర్భరాజని యున్నది. కాని గ్రంథకర్తపే రందు నిర్దిష్టము కాలేదు. జనశ్రుతినిబట్టి, ధారానగరము రాజధానిగా మాళవదేశము నేలిన భోజమహారాజు ఈ కావ్యమును రచించినట్లు విదితమగుచున్నది. విదర్భయు, మాల్వయు భిన్నదేశములు. వాటి నేలిన రాజులును భిన్నులై యుండవలెను. నేడు లభించు ప్రమాణములనుబట్టి భోజునకు విదర్భరాజను వ్యవహారము సమర్థనీయ మగుటలేదు అని యొకరు వ్రాసిరి. భోజుడు క్రీ. శ. 1005 – 1054 సంవత్సరముల మధ్యకాలమున రాజ్యము నేలినవాడు. అందుచే నితడు 11 వ శతాబ్ది యందు చంపూరామాయణమును రచించి యుండెనని చెప్పబడుచున్నది. ధారారాజ్యమునొకవంక, కవితారాజ్యమును మరియొకవంక, అనంత వైభవోపేతముగ పాలించిన మహారాజుగా, విద్వత్కవిగా, విద్వత్కవిపోషకుడుగా, భోజుడు విఖ్యాతుడయ్యెను. సరస్వతీ కంఠాభరణము, శృంగారప్రకాశము, పాతంజలసూత్రవృత్తి మున్నగు గ్రంథరాజములను సంతరించి అఖండయశో విరాజితుడయిన మహాపండితు డీతడు. ఇతని జిహ్వాగ్ర రంగమున వాగ్దేవి నాట్య మొనర్చు చుండెడి దనియు, ఇతని దర్శన మాత్రమున విద్యావిహీనులకు సయితము సత్కావ్యనిర్మాణచాతురి, సర్వకలాకౌశలము, వాక్పటుత్వము లభించుచుండెడిదనియు చెప్పబడినది.

రామాయణ చంపువు భోజుని సర్వంకష ప్రజ్ఞాధురీణతకు నికషోపలము. ఇతని కీర్తి ప్రతిష్ఠల కిది జయపతాక. గుణోత్కర్షమును పురస్కరించుకొనియే పండితు లీ చంపువునకు పట్టము గట్టిరి.

585