పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/638

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రుడు

సంగ్రహ ఆంధ్ర

టకును, జలపాతము పడు ప్రదేశమున స్నానమాడుటకును, ఏడాదిపొడుగునను జనులు వివిధప్రాంతముల నుండి విహారయాత్రకు విచ్చేయుచుందురు. ఈ స్థలము రామాయణీయ శబరి యను భ క్తురాలి యాశ్రమస్థాన మనియు చెప్పెదరు. అపూర్వమైన ఓషధులు ఇచ్చట లభించు నని తెలియుచున్నది. ఈ జలపాతమునుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేయుటకు అవకాశమున్నదేమో యని కొన్ని పరిశీలనలు జరిగినవి. ఈ జలపాతమునకును తాళ్ళచెర్వు గ్రామమునకును ప్రక్కగానే, నాగార్జున సాగరముయొక్క కుడికాలువ ప్రవహించును.

12 వ శతాబ్దమందు చారిత్రకముగా ప్రఖ్యాతి వహించి మాచెర్లను రాజధానిగా పల్నాడును పాలించిన బ్రహ్మనాయడు, అతని వంశీయులు పట్నాటివీరులు ఈ ఆరామప్రదేశమును తమ క్రీడావిలాసములకు ఆటపట్టుగా చేసికొని యుండిరి. పల్లెపాటలలో వీరినిగూర్చి ఇప్పటికిని గానము చేయుచున్నారు.

ఆంధ్రదేశమున సందర్శింపదగిన స్థలాలలో ఎత్తిపోతల జలపాతముగూడ ముఖ్యమైనది. ఎత్తిపోతలను గురించి శ్రీ అక్కి రాజు నిత్యానందశాస్త్రి వ్రాసిన పద్యము ఇట్లున్నది ;


"కల దొక పారిజాత
        పరికల్పితదృశ్యము పల్లెనాటిలో
జలజల శైలమస్తమున
         సల్పి ప్రయాణము “చంద్రవంక ” య
గ్గలిక వహించి మించి
         తమకంబున గ్రిందికి దూకు “ఎత్తిపో
తల" యను తావు గ్రావ
         ధ్రువతాండవ రమ్య ఝరప్రభావమై.

ఆ. వీ.


చంద్రుడు :

చంద్రుడు మన భూగోళము చుట్టును తిరుగు ఒకే ఒక ఉపగ్రహము. సూర్యకుటుంబములో చంద్రుడు ఒక గ్రహము. చంద్రగ్రహమును నవగ్రహములలో నొకటిగా మనము పరిగణించుచున్నాము. సూర్య కుటుంబములో నున్న ఉపగ్రహము లన్నిటిలో చంద్ర గ్రహము పెద్దది. అనాదినుండియు ఖగోళపదార్థములలో సూర్యుని తరువాత చంద్రగోళము మనకు చాల సుపరిచితమైనదేగాక, ఖగోళశాస్త్రజ్ఞుల దృష్టిని గూడ మిగుల నాకర్షించినది. చంద్రుడు చూపులకు ఎంత కాంతిమంతమైన గోళముగా కనబడుచున్నను, మానవచరిత్రలో ఆదినుండియు చంద్రుని గూర్చి పురాణగాథలు, మూఢ విశ్వాసములు అనేకములుగా నున్నను, నిజమునకు ఆకాశమందున్న విస్తార ఖగోళపదార్థములలో చంద్రగోళము ప్రాముఖ్యములేని ఒక చిన్న గోళము.

చంద్రుని ఉత్పత్తిని గురించి ఖగోళ శాస్త్రజ్ఞులలో రెండు విధములుగు సిద్ధాంతములున్నవి. మొదట సూర్య కుటుంబము ఏర్పడినప్పుడే 400 కోట్ల ఏండ్ల క్రిందట భూమి, చంద్రుడు వేరువేరుగా నేర్పడినవని కొందరి అభిప్రాయము. భూమినుండి ఎంతోకాలముక్రిందట చంద్రుడు ఉత్పత్తి యయ్యెనని మరికొందరి సిద్ధాంతము.

చంద్రగోళము సూర్యునికంటెను, భూమికంటెను చాల చిన్నది. దాని వ్యాసము 2160 మైళ్లు. అది భూమికి 2,38,857 మైళ్ళదూరమున నుండి తన నియమిత మార్గములలో భూమిచుట్టును తిరుగుచుండును. చంద్రుని ద్రవ్యరాశి భూమియొక్క ద్రవ్యరాశిలో సుమారు సగముండును. ఒకసారి భూమిచుట్టు ప్రదక్షిణము చేయుటకు చంద్రునకు సరిగా 27 దినముల 7 గంటల 43 నిమిషముల 14 సెకండ్లకాలము పట్టును. ఈ కాలమును బట్టి మాసములు లెక్కింపబడుచున్నవి. చంద్రునికి సహజప్రకాశము లేదు. సూర్యునికాంతి చంద్రగోళముపైబడి పరావర్తనమగుచుండుటచే మనకు వెన్నెల కలుగుచున్నది. కొన్ని సమయములలో సూర్యునికిని భూమికిని ఎంతదూర ముండునో, సూర్యునికిని చంద్రునికినిగూడ సగటున అంతే దూరము ఉండుటను బట్టి, సూర్యునినుండి భూమి ఎంత ఉష్ణమును గ్రహించునో చంద్రుడుకూడ అంతే ఉష్ణమును గ్రహించును. చంద్రుని పరావర్తనశక్తినిబట్టి, మధ్యాహ్న సమయమున చంద్రునిపై 261°F ఉష్ణోగ్రతయు, అర్ధరాత్రమున - 243°F, ఉష్ణోగ్రతయు ఉండునని శాస్త్రజ్ఞులు లెక్క వేసిరి. పరిశీలనము వలనను, లెక్కల మూలమునను చంద్రగోళముపై ఏ విధమగు వాతావరణముగూడ లేదని తెలియుచున్నది. పై రెండు ఉష్ణోగ్రతలలో నున్న దీర్ఘ వ్యత్యాసమును బట్టియు, అచట వాతావరణము శూన్య

580