విజ్ఞానకోశము - 3
చంద్రగుప్త చక్రవర్తి
నందే యుండి తగవులను విచారించుచు, ఇతర రాజ్య భాగముల వ్యవహారములను నెరవేర్చుచుండెడి వాడనియు మెగస్తనీసు వ్రాసియున్నాడు. ఒడలు పిసికించుకొను సమయము సమీపించినపుడు కూడ రాచకార్యములకు భంగము కలుగకుండె నట ! రాజు తన కురులు దువ్వించుకొని ముడులు సవరింపించుకొను సమయమున కూడ ఆతనికి విశ్రాంతి లేకుండెనట! అట్టి తరుణమున తన దర్బారులోని రాయబారులకు దర్శనమిచ్చు చుండెడివాడట !
పైన వివరించిన ప్రకారము సామ్రాజ్యము విభిన్న ప్రాంతములుగ విభజితమై ఆ ప్రాంతములను రాష్ట్రపాలకులు పాలించుచుండిరి. కేంద్రప్రాంతమును, తూర్పుప్రాంతమును చక్రవర్తియే పాలించుచుండెను. సామ్రాజ్య పాలనమందు చక్రవర్తికి సహకారిగా ఒక మంత్రిమండలి యుండెను. అతిసమర్థులయిన ఆ మంత్రులే రాష్ట్రపాలకులను, ఉపరాష్ట్రపాలకులను, రాజ్యకోశాధికారులను, సేనా నాయకులను, నావికా దళాధిపతులను, న్యాయమూర్తులను, దండ విధాయకులను, వ్యవసాయ శాఖాధ్యక్షుని వంటి ఇతర ఉన్నతాధికారులనందరను ఎన్నుచుండిరి.
చక్రవర్తి స్వయముగ అధికసంఖ్యలో గూఢచారులను నియమించి ఉపయోగించుకొనెడివాడు. వారు పట్టణమును గూర్చియు, సైన్యమును గూర్చియు వార్తలను రహస్యముగా చక్రవర్తికి నివేదించుచుండెడివారు. అత్యధిక విశ్వాస పాత్రులును, అతి సమర్థులును ఇట్టి ఉద్యోగములకు నియమితులగుచుండిరి. ఈ గూఢచారుల మీద అధికారు లుండెడివారు. వారు రాచకార్యములందు వేశ్యల సహకారమునుగూడ పొందుచుండెడివారు.
చంద్రగుప్తుని కాలములో పుర పరిపాలనా విధాన మిట్లుండెను : నగరపాలనా నిర్వహణమునం దుండువారు ఆరు సంఘములుగా విభజింపబడుచుండిరి. ఒక్కొక్క సంఘమునందు అయిదుగురు సభ్యు లుండుచుండిరి.
మొదటి సంఘమువారు పారిశ్రామిక క్షేత్ర వ్యవహారములను సవరించుచుండిరి.
రెండవ సంఘమువారు విదేశీయుల సత్కార సమాదరణములను జూచుచుండిరి. పరదేశీయులకు గృహాది వసతులను గల్పించుటయు, వారి జీవిత విధానములను కనిపెట్టు చుండుటయు, వారు వెడలిపోవునపుడు సాగనంపుటయు, ఒకవేళ వారెవరైన మరణించినచో, వారి ఆస్తి పాస్తులను బంధువులకు అందజేయుటయు వీరి కర్తవ్యములై యుండెను. వారు జబ్బు పడినచో వారికి సకలోపచారములు చేయుటయు, వారు మరణించిన యెడల ఖననము చేయుటయును రెండవసంఘము కర్తవ్యమయియుండెను.
మూడవ సంఘమువారు జనన, మరణములను గూర్చి విచారించుచుండిరి. ఈ విచారణ పన్నులు విధించు విధానమున కవసరమై యుండెను.
నాల్గవ సంఘమువారు వర్తక వాణిజ్య విషయముల విచారణ కర్తలుగ నుండిరి. ఈ సంఘమువారి యొద్దనే తూనికలు, కొలత పాత్ర లుండుచుండెను. అన్ని ధాన్యములును సకాలమునందు అమ్ముడుపోవలయును. దొంగ బేరములు చేయకూడదు. ప్రతియొక్కడు ఏదే నొక విధమయిన సరకు యమ్ముచుండవలయును. లేనిచో ద్విగుణముగా పన్ను నీయవలసియుండెను.
అయిదవ సంఘమువారు చేతిపనులపయి విచారణాధి కారులుగా నుండిరి. క్రొత్తవాటిని, పాతవాటిని విడి విడిగా అమ్మవలయును. రెండింటిని కలిపి బేరము సాగించినచో అపరాధము క్రింద ధనమును చెల్లింపవలసి యుండెను.
ఆరవ సంఘమువారు పదార్థముల ధరలలో పదవ భాగమును పన్నుగా వసూలుచేయువారు. ఈ పన్నును సమర్పించుటలో మోసముజరిగినచో మరణ శిక్ష విధింప బడుచుండెను.
ఇవి ఆయా సంఘముల యొక్క ప్రత్యేక విధులు. అయితే అన్ని సంఘములును తమ ప్రత్యేక విధులతో పాటు ప్రభుత్వ భవనములను సుస్థితిలో నుంచుట, ధర వరలను సముచిత స్థాయిలో నుంచుట, విపణి వీథులను, ఓడరేవులను, దేవాలయములను పరిరక్షణము గావించుట మొదలగు సార్వజనిక ప్రయోజనాత్మక కార్యములను సమష్టిగా నెరవేర్చుచుండవలయును.
నదుల పర్యవేక్షణము, భూముల కొలత, సస్యములకు నీటిపారుదల ఇత్యాది విషయములలో ఎట్టి అక్రమములు జరుగకుండ చూచుటకు జిల్లాలలో వేర్వేరు తరగతుల అధికారులుండిరి. వీరుగాక, వ్యవసాయాభివృద్ధి, అటవీ సంరక్షణము, కలపసామాను నిర్మాణము, లోహకర్మా
571