పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/621

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చంద్రగిరి

నుండి ఈ నది ప్రవహించుచుండుటచే దీనిని 'సువర్ణముఖి’ యనియు పిలిచెడివా రట !

చంద్రగిరి దుర్గము క్రీ. శ. 1000 సం. లో ఇమ్మడి నరసింహ యాదవరాయలచే నిర్మింపజేయబడినది. ఈ యాదవరాయలు చంద్రగిరికి చేరువ నున్న నారాయణ వనమునకు అధిపతియై యుండెను. ఈత డొకనాడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించి నారాయణ వనమునకు మరలివచ్చుచుండెను. స్వామి వారిని ఎల్లవేళల చూచు చుండు భాగ్యము కలుగుటకు వలసిన మార్గము నన్వేషించుచు, ఇంటికేగి, ఇతడు తిరుమలకు కనుచూపుదూరమున ఒక దుర్గమును నిర్మింప తీర్మానించుకొనెను. అడ్డకొండయను చిన్నగుట్టపై మొదట ఇత డొక కోటను గట్టించెను. యాదవరాయల కింకొక విచిత్రసంఘటనము కాకతాళీయముగ తటస్థించెను. అతడు తలకు చుట్టుకొన్న ఎర్రని శిరోవేష్టనము (తలపాగా) ఒక గరుడపక్షి మాంసఖండమను భ్రమచే తన్నుకొనిపోయి అడ్డకొండకు చేరువనున్న యొక పర్వతాగ్రముపై దానిని బడవైచెను. రాజ భృత్యులు దానిని వెదకితెచ్చి యాదవనరసింహరాయల కిచ్చిరి. వారు ఆ పాగాపడిన స్థలవిశేషములను కొనియాడిరి. ఆ వర్ణనాంశములను విని యాదవరాయలు ఆ సంఘటనము నొక దైవేచ్ఛాసూచనగా గ్రహించెను. ఆ పర్వతమున నొక గిరిదుర్గమును, క్రింద నొక స్థలదుర్గమును, సువర్ణముఖీనదీ దక్షిణతీరమున నొక పట్టణమును నిర్మింపించెను. పట్టణమునకు చంద్రగిరియని పేరిడెను. చందురు కావిరంగుగల శిరోవేష్టనమునకు సంబంధించిన గాథగల ప్రదేశ మగుటచేతనో, శివానుగ్రహార్థమై చంద్రుడు తపమాచరించిన నెలవుగా దీనిని పురాణకథలు వచించుచుండుటచేతనో, ఈ స్థానమునకు 'చంద్రగిరి' యను నామకరణ మేర్పడి యుండవచ్చును. రామరాజ భూషణుడు తనవసుచరిత్రమున' తారకశైల' మనియు, తరిగొప్పుల మల్లన తన చంద్రభాను చరిత్రమున 'చంద్రగోత్ర మనియు ఈ చంద్రగిరిని చమత్కారముగా బేర్కొని యున్నారు.

లోయనుండి 600 అడుగుల ఎత్తున ఏర్పడియున్న ఒక శిలామయమైన పర్వత సమతలమున చంద్రగిరి కోట కట్టబడియున్నది. కోటకు దక్షిణ భాగమున గల విశాలమైన ప్రదేశముచుట్టును బలిష్ఠమైన గోడ కలదు. ఆ గోడ నానుకొని ఒక అగడ్త త్రవ్వబడినది. అగడ్తను తరచుగ జలముతో నింపుటకు చేరువనే ఊట యుండెడిదట. అది ఇంకిపోయి యుండుటచే నేడు అగడ్త యందుగూడ నీరు కానరాదు.

కోటలో మధ్య భాగమున రాజభవనములు గలవు. కోటలోనికి పోవుటకు తూర్పు వైపునను, పడమర వైపునను రెండు వంకదారలు గలవు. కాని నేడవి నామమాత్రావశిష్టములై యున్నవి. కోటలో రాజభవనములే గాక శిథిలములైన చిన్న చిన్న దేవళములును, మంటపములును గలవు. రాజభవనములకు మహలులని పేరు. ఈ మహలులలో నొకదానికి 'రాజమహల్ ' అనియు, వేరొకదానికి 'రాణిమహల్' అనియు పేరులుగలవు.

చిత్రము - 160

పటము - 1

రాజమహల్

563