పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/613

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఘర్మయంత్రములు

న్యూకామెన్ (Newcomen) అనువానిచే నిర్మింపబడిన వాతావరణ యంత్రము (atmospheric engine). ఈ యంత్రము నూతులనుండియు, గనుల నుండియు నీటిని త్రోడుటకు 50 ఏండ్లకు పైగా వాడుకలో నుండెను. పిస్టన్ (piston) వాడబడిన మొట్టమొదటి యంత్రము ఇదియే. దీనిని ఆధారముగా చేసికొని జేమ్స్ వాట్ (James Watt) 1765 వ సంవత్సరములో ఆవిరి యంత్రము నొక దానిని నిర్మించెను.

అధునాతనమైన ఆవిరియంత్రపు ముఖ్యభాగములు 1 వ పటములో చూపబడినది. S అను ఆవిరి పేటిక (steam chest) లో తయారైన నీటి ఆవిరి జారెడి వాల్వ్ V (slide valve) గుండా స్తూపము C లోనికి పంపబడును. పిస్టను P, స్తూపము C లో ఒరిపిడి (friction) లేకుండా పైకిని, క్రిందికిని కదలును. పిస్టను కడ్డీ K, మరియొక కడ్డీ L ద్వారా యంత్రముయొక్క క్రింది భాగమునకు కలుపబడినది. క్రిందిభాగములో క్రాంక్ H (crank), షాఫ్ట్ (shaft) G, ఫ్లైవీల్ (fly wheel) F, ఎక్సెంట్రిక్ (eccentric) E అనునవి వున్నవి. ఈ భాగములు విడిగా 3 వ పటములో చూపబడినవి. పిస్టను క్రిందికిని, పైకిని కదలినపుడు L అను కడ్డీ క్రాంకును ముందునకు నెట్టును. క్రాంకు, షాఫ్ట్ G ని గుండ్రముగా తిరుగునట్లు చేయును. ఎక్సెంట్రిక్ E అనునది షాఫ్ట్ పై ఎక్సెంట్రిక్ గా అమర్చబడిన గుండ్రని రేకు (disc). ఇది జారెడి వాల్వు V తెరచుకొను నట్లును, మూసికొనునట్లును చేయును. దీని

చిత్రము - 150

పటము - 3

క్రాంక్ - ఎక్సెంట్రిక్ ఫ్లైవ్వీలు

సహాయమున పిస్టను క్రిందకును పైకిని ఆడినపుడు షాఫ్ట్ గుండ్రముగా తిరుగును.

ఆవిరి యంత్రము పనిచేయు విధానము 4 వ పటము నుండి గ్రహింపవచ్చును. గొట్టము A ద్వారా ఎక్కువ ఒత్తిడిగల ఆవిరి పేటిక S లోనికి వచ్చును. ఈ ఆవిరి, ద్వారము B గుండా స్థూపములోనికి ప్రవేశించి పిస్టను Pని ముందునకు అనగా ఎడమవైపునకు నెట్టును. పిస్టను దానిముందున్న తక్కువ ఒత్తిడిగల ఆవిరిని ద్వారము E గుండా ఎఘ్జాస్టు (exhaust) D కి పంపివేయును. పిస్టను ముందునకు పోవునపుడు జారెడు వాల్వు V కుడివైపునకు కదలి, ద్వారము B ని మూసివేయును. పిస్టను ముందునకు పోయినపుడు స్తూపములోని ఆవిరి అతాపక వ్యాకోచము (adiabatic expansion) చెందును. అతాపక వ్యాకోచమువలన స్తూపములోని ఆవిరియొక్క ఉష్ణోగ్రతయు ఒత్తిడియు బాగుగా తగ్గిపోవును. అందుచే ఎడమవైపు ద్వారము E గుండా ఎక్కువ ఒత్తిడిగల ఆవిరి స్థూపములోనికి ప్రవేశించి, పిస్టను కుడివైపునకు కదలునట్లు చేయును. ఇట్లు వెనుకకు కదలుటలో (back- ward stroke) పిస్టను దాని ముందున్న తక్కువ ఒత్తిడి గల ఆవిరిని B ద్వారా ఎఘ్జాస్టు (exhaust) D కి పోవునట్లు చేయును. ఈ లోగా జారెడి వాల్వు ముందునకు జరిగి E ని మూసివేయును. మరల ఆవిరి ఎక్కువ ఒత్తిడితో B ద్వారా స్తూపములోనికి ప్రవేశించును. ఇట్లు పిస్టను నిర్విరామముగా ముందునకు వెనుకకు కదలినపుడు

చిత్రము - 151

పటము - 4

ఆవిరియంత్రము పనిచేయు మూలసూత్రము

555