పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/608

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘర్మయంత్రములు

సంగ్రహ ఆంధ్ర

చిహ్నములను కలిగియున్నవి. అందుచే వాటిని గ్రామీణ నగరములనియే (rural towns) చెప్పవలెను.

స్థూలముగా చెప్పవలెనన్న ఘనాలోని నగరములు, గ్రామీణ నగరములు, 3000 కాని, అంతకంటె ఎక్కువ జనాభాగాని కల సెటిల్ మెంటుల సముదాయములో చేరును. అంతకంటె తక్కువ జనాభాగల సెటిల్ మెంటులు మామూలు పల్లెటూరు లక్షణములు కలవిగానే భావింప బడును. మొత్తముపై అట్టి పెద్ద సెటిల్ మెంట్లు ఘనాలో 90 ఉన్నవి. వీటిలోని జనాభా 665, 990 మంది. ఈ జనాభా దేశమందలి మొత్తము జనాభాలో 16 వ శాతముగ నున్నది.

రెండవ ప్రపంచ మహా సంగ్రామమునకు పూర్వము ఆ దేశములో రవాణా సౌకర్యములు చెప్పదగినంతగా లేవు. కాని శత్రువులు మధ్యధరాసముద్రములోను, సూయజ్ కాలువ మార్గములోను ప్రవేశించుటవలన, ఉత్తర ఆఫ్రికాలోకూడ వారు దండయాత్రలు సాగించుట వలన, పశ్చిమ మిత్రమండలివారు తమ యుద్ధతంత్ర వ్యూహములను కొనసాగించుటకు పశ్చిమాఫ్రికా అనుకూలమైన ప్రాంత మయ్యెను. అందుచే యూరపును, అమెరికాను, మధ్య, దూరప్రాచ్య దేశములను, ఆఫ్రికా యందలి అనేకములైన విమానాశ్రయములను కలుపు నట్టి విమాన మార్గములకు ఆ ప్రాంతము ప్రధాన కేంద్రమయ్యెను. ఈ విమానముల రవాణా అభివృద్ధి యగుటచే ఆఫ్రికా విమానాశ్రయములకు ప్రత్యేక లాభము చేకూరెను. దాని రహదారులు పొడిగించబడి, అనేకములైన క్రొత్త మార్గము లేర్పరచబడెను.

మరియు ఆక్రా, సెకొండి, కుమాసి, టామలె అను ప్రదేశములందు కూడ విమాన మార్గము లున్నవి. అవన్నియు మధ్యగతమైన (internal) రహదారులచే కలుపబడినవి.

విమానములలో ముఖ్యముగా యాత్రికులు, తపాల సంచులు తీసికొనిపోబడును. విలువ కలిగి ఎక్కువచోటు నాక్రమింపని వజ్రములు, బంగారమువంటి వస్తువులును, శీఘ్రముగా దిగుమతి చేయబడ వలసిన తాజా ద్రాక్ష పండ్లు, గ్రుడ్లు కూడ విమానములలో కొనిపోబడును. ఇవి ఎక్కువగా దక్షిణాఫ్రికా యూనియనునుండి ఎగుమతి యగును. చాల తక్కువ పరిమాణముగల ఇతర సామగ్రులు మాత్రమే విమానముల ద్వారా కొనిపోబడును.

బి. ఎన్. చ.


ఘర్మయంత్రములు (Heat Engines) :

ఒక “పనిని” (work) సులభముగా చేయవలెనన్న, యంత్రము నుపయోగింపవచ్చును. 'పని' అనగా నేమి ? ఉదాహరణమునకు ఒక మనుష్యుడు ఒక పెద్దరాయిని తలపై పెట్టుకొని నిశ్చలముగా నిలబడినాడనుకొందము. రాయి బరువువలన అతడు అలసట చెందవచ్చును. కాని శాస్త్రరీత్యా చూచినచో, అతడేమియు 'పని' చేయలేదు. అట్లుకాక రాతిని నేలమీదినుండి ఎత్తి ఒక బల్లమీద పెట్టినచో, ఆతడు కొంత 'పని' చేసినట్లగును. రాయి బరువును బల్ల ఎత్తుచే గుణించుటవలన అతడు చేసిన 'పని' యొక్క పరిమాణము (amount) మనకు తెలియును. ఇదే 'పని'ని చేయుటకు మనుష్యుడు తన కండరశక్తిని వినియోగించుటకు బదులు ఒక యంత్రమును ఉపయోగింప వచ్చును. యంత్రము పనిచేయునట్లు చేయుశక్తిని లేదా యంత్రశక్తిని (mechanical energy) అనేక విధములుగా పొందవచ్చును. అందులో నీటిని వేడిచేయుట ఒక పద్ధతి. అనగా, ఉష్ణశక్తి వలన నీటిని ఆవిరిగామార్చి, ఆ ఆవిరియొక్క పీడనశక్తిచే యంత్రములు పనిచేయునట్లు చేయుట. ఇచ్చట ఉష్ణశక్తి యంత్రశక్తిగా మారుటచే పనిని చేయగలుగుచున్నాము. ఉష్ణశక్తికిని యంత్రశక్తికిని గల అవినాభావ సంబంధము అనేకవిధముల స్పష్టీకరింపబడినది. పదార్థములలోని అణువుల (molecules) సంచలనమువలన ఉష్ణము కలుగుచున్నట్లు చలన సిద్ధాంతము (Kinetic Theory) చే నిరూపింపబడినది. ఒక కేలోరీ (Calorie) ఉష్ణము 4.18x107 ఎర్గుల (ergs) పనికి సమానమని ప్రయోగములచే నిర్ణయింపబడినది. ఇట్లు ఉష్ణశక్తి (Heat energy) వలన పనిచేయు యంత్రములు ఘర్మ లేక ఉష్ణయంత్రములు (Heat engines) అని పిలువబడుచున్నవి. వివిధరకముల ఘర్మ యంత్రములను గూర్చి తెలిసికొనుటకు ముందు వాటి మూలసూత్రములను విశదీకరించు ఉష్ణగతిశాస్త్రము (Thermodynamics)ను గురించి కొంత తెలిసికొనవలసి యున్నది.

550