పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/607

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఘనాదేశము

ద్వారా సంవత్సరమునకు 210,000 టన్నుల అల్యూమినియమును ఉత్పత్తి చేయుటకై ఉపయోగింపబడగలదు.

జనాభా : దాదాపు ఘనాలో నివసించు ప్రజలందరును 'సుడాను నీగ్రోలు' అను జాతికి చెందినవారు. వీరు పశ్చిమాఫ్రికాయందంతటను కలరు. ఆఫ్రికా మహాఖండమున గల అయిదు ప్రధానములైన జాతిగణములలో వీరొకరు. సుడాను నీగ్రోలలో కొందరు, ముఖ్యముగా 'రెయిన్ ఫారెస్టు జోను' (Rain Forest Zone) నందలివారు, అనేక శతాబ్దముల వరకు కలితిలేని స్వచ్ఛమగు జాతిగా పరిగణింపబడిరి. కాని పశ్చిమాఫ్రికాలో ఉత్తరప్రాంత మం దున్నవారు సహారాలోను, ఉత్తరాఫ్రికాలోను నివసించు హమెటిక్ (Hametic), సెమిటిక్ (Semitic) జాతులలో కలసిపోయిరి. వారి అవయవ నిర్మాణములో ఈ సమ్మేళన చిహ్నములు గోచరించును. వారి పెదవులు పలుచగాను, ముక్కులు కొంచెము సన్నముగను, నిడుపుగను, సూటిగను ఉండును. ఈ సంకర జాతులలో ఫులానులు అనువారు కొందరు కలరు. వీరు సాధారణముగా ఘనాదేశమునకు ఉ త్తరమున నివసించు చుందురు.

ఈ ఫులానులలో అధికసంఖ్యాకులు ఉత్తరమునుండియే వచ్చిరి. కొందరు తూర్పు నుండి గూడ వచ్చినట్లు విశ్వసింపబడుచున్నది. ఉత్తరమునుండి వచ్చినవారు ఒకప్పుడు ప్రాచీన ఘనా సామ్రాజ్యములో చేరియుండిరి. క్రీ. శ. 1000 వ ప్రాంతమున అత్యుచ్ఛ దశయం దుండిన ఘనా సామ్రాజ్యము నైగర్ నది వంపునకును (Niger bend), గాంబియా నది (Gambia River) ని నడుమ గల విస్తృతమైన ప్రాంతమును ఆక్రమించియున్నది. ఈ సంబంధమే (ఇది ఇంకను చారిత్రకులలో వివాదాంశముగనే యున్నది) స్వాతంత్ర్యము సిద్ధించినది మొదలు ఘనా దేశమునకు అంతకు పూర్వము గల 'గోల్డుకోస్టు' (gold-coast) అను పేరును మార్చి దానికి బదులుగా 'ఘనా' అను అసలు పేరును పెట్టుటకు కారణమైనది.

ఘనాలో ప్రజలు నివాసమేర్పరచుకొని జీవింప నారంభించుట ఎంతోకాలము క్రింద కాదు. ఇటీవలనే అచ్చటి ప్రజలు వివిధములైన తెగలుగా ఏర్పడియుండిరి. 19 వ శతాబ్ది చివర వరకు ఆ దేశమున నివసించు ప్రజలలో అనేకులు తమ రాజ్యములను స్థిరీకృత మొనర్చుకొనుట యందును, విస్తృతమొనర్చుకొనుటయందును నిమగ్నులై యుండిరి.

అన్ని తెగలలోను ఆకనులు (Akans) అను జాతివారు అధికసంఖ్యాకులుగా నున్నారు. ఆశాంతి అను ప్రాంత మందును, ప్రాక్పశ్చిమ భాగమందునను దాదాపు ఈ జాతివారే నివసించుచున్నారు. ఆగ్నేయ దిశాగ్రమునందు మాత్రము ఈవులు (Ewes), గా-అడాంగ్‌మీలు (Ga-Adangmes) అను జాతులవా రున్నారు. ఆకన్ జాతివారితో దగ్గిర సంబంధము గల గ్యూయనులు (Guans) అను మరియొక తెగవారు ఆకనులకు తూర్పు పార్శ్వ మందును, ఉత్తరపార్శ్వమందును విశాలమైన చంద్రవంక ఆకారమున వ్యాపించి యున్నారు.

ప్రస్తుత శతాబ్దికి పూర్వము నేటికంటె మిక్కిలి తక్కువ ప్రమాణములో జనాభా పెరుగుదల జరిగియుండెను. యుద్ధములు, బానిసత్వము, వ్యాధులు, మరణములే ఇందుకు గల కొన్ని కారణములు. 20 వ శతాబ్దిలో నేర్పడిన ప్రశాంతపరిస్థితులు, ఆరోగ్యవిషయమున చేకూరిన అభివృద్ధి, నేటి శీఘ్రజనాభివృద్ధికి విశేషముగా దోహద మొనర్చినవి.

ఆ దేశపు ప్రజలు రకరకములైన కర్రలతోడను, కొయ్యచెక్కలతోడను మొట్టమొదట గృహములను నిర్మించుకొనెడి వారు. అరటి ఆకులు, తాటియాకులు, గడ్డి, రెల్లు మొదలగు పదార్థములు ఇండ్లకప్పులకు సాధనములుగా నుండెడివి. ఈనాడు అరణ్య ప్రాంతములలో మారుమూల గ్రామముల యందలి గృహములును, సముద్రతీరమున చేపలుపట్టువారు తాత్కాలికముగ నిర్మించు గృహములును మాత్రమే ఇట్టి వస్తువులచే నిర్మింపబడుచున్నవి. కాని ఈ కాలమున కాల్చిన పెంకులును, ఇటుకలును, కాంక్రీటు బ్లాకులును, ఆస్బెస్టోస్ సిమెంటు రేకులును గృహోపకరణములుగా ఉఉపయోగింపబడుచున్నవి.

ఘనాలో క్రొత్తగా ఏర్పరచుకొనబడిన కొన్ని జనావాసములు (Settlements) మాత్రమే యధార్థములైన నగరములనబడుచున్నవి. ఈ జనావాసములలో ఎక్కువ భాగము గ్రామములు. నాగరికలక్షణములుగల ఈ జనావాసములుకూడ పెక్కులు విశేషముగా గ్రామీణ

549