పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/598

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘటికాస్థానములు

సంగ్రహ ఆంధ్ర

ములవలన దెలియుచున్నది. ఈ శాసనములవలన ఘటికాస్థాన మన్నది వేద విద్యాసంస్థయని, నిస్సంశయముగ తేలిపోయినది. ప్రాచీన కాలమునాటి ఘటికా స్థానములలో గొప్ప సరస్వతీ భండారము లుండెడి వని ఈ శాసనమే రుజువుచేయుచున్నది. సరస్వతీ భండారమన్నది నేటి గ్రంథాలయమునకు ప్రాచీన నామము. నాగవావి ఘటికాస్థానమందలి సరస్వతీ భండార మెంతటి గొప్పదో! దానిలో నారుగురు సరస్వతీ భండారికు లుండెడివారట!

తాలగుండ శాసనమును ప్రకటించి పరిష్కరించిన ప్రొఫెసర్. యఫ్. కీల్ హారన్ పండితుడు ఘటికయనునది బ్రహ్మపురి వంటి దాని నుడివియున్నాడు. బ్రహ్మపురి యనగా, వేదవిదులైన బ్రాహ్మణులవాడ యని మైసూరు రాష్ట్రములోని శాసనములు తెలుపుచున్నవి. కడప జిల్లాలోని నిరందనూరు (ఇప్పటి నందలూరు) బ్రహ్మపురియని యచ్చటి శాసనములలో పేర్కొనబడినది. ఘటిక బ్రహ్మపురి వంటిదే! బ్రహ్మపురి మాత్రము ఘటిక కాదు. వేలూరి పాళయము శాసనమున పల్లవ మహీపతియైన రాజసింహావరనామధేయుడు, రెండవ నరసింహవర్మ


“పునర్వ్యధాద్యో ఘటికాం ద్విజానాం
శిలామయం వేశ్మ శశాంకమౌ లేః
కైలాస కల్పంచ మహేంద్రకల్పః"

ద్విజులకు ఘటికను, కైలాసకల్పమైన శిలామయ వేశ్మమును, శివునికిని (కాంచీ కై లాసనాధాలయము) నిర్మించెనని కీర్తింపబడినాడు. ఈ నరసింహవర్మనుగూర్చి కాశాకుడి శాసనముకూడ ఇట్లు చెప్పుచున్నది —


"దేవబ్రాహ్మణ సత్కృతాత్మవిభవో
యః క్షత్రచూడామణిః
చాతుర్వేద్యమ వీవృధత్ స్వఘటికాం
భూదేవతాం భక్తితః"

నందివర్మ పల్లవ మల్లుని కాశాకుడి శాసనము బహుదోష భూయిష్ఠము. ఘటికనుగూర్చి విశేష పరిశోధన చేసిన కుమారి మీనాక్షిగారు సవరించి ఇచ్చిన దీ పైశ్లోక పాఠము. ఇదియే సరియైన పాఠము కాదగును. పై నుదా హృతములయిన శ్లోక పాఠముల వలన గూడ ఘటికా-ఘటికాస్థానము -ద్విజసంస్థ- బ్రాహ్మణసంస్థ యనియు నది చాతుర్వేద విద్యాబోధనశాల యనియు విదితమగును.

ఒక్కొక్క వేదమును చదివించుటకు ప్రత్యేక ఘటికాస్థానము లుండెడివేమో! క్రీస్తుశకము పదునైదవ శతాబ్దము నాటి యొక కర్ణాటదేశ శాసనము ఉత్తంకుడు చెప్పినట్లు సామవేద ఘటికాశ్రమము నిర్మితమైన దాని నుడువుచున్నది. ("ఉత్తం కోక్త్యా సామవేద వ్యధత్తం ఘటికాశ్రమమ్") ఈ శాసనము ననుసరించి ఘటికాశ్రమములు క్రీస్తుశకము పదునైదవ శతాబ్దము వరకు అనగా నిప్పటి కయిదువందల సంవత్సరములకు పూర్వము వరకు వేదవిద్య బోధించుచుండెనని తెలియుచున్నది.

ఘటికాస్థానములు పూర్వ మొక కాంచీపురములోనే కాక తమిళ, కర్ణాటాంధ్ర దేశములలో పెక్కుచోట్ల నుండినట్లు దక్షిణ హిందూదేశము నందలి ప్రాచీన శాసనముల వలన తెలియుచున్నది. సాధారణముగా ఘటికాస్థానమును పూర్వము మన దేశమును పరిపాలించుచు వచ్చిన మహీధవులు స్థాపించుచు వచ్చిరనుట కనేక శాసన ప్రమాణములు గలవు. పూర్వము ఘటికా స్థాన నిర్మాణము పుణ్యప్రదములైన కార్యములలో నొకటి. ప్రాచీన కాలమున ఆంధ్రదేశమును ధర్మోత్తరముగ పరిపాలించిన విష్ణుకుండి వసుమతీపతులలో నొకడైన రెండవ విక్రమేంద్ర వర్మ ('యథావిధి వినిర్యాపిత ఘటికా వాప్త పుణ్యసంచయు'డట - 'యథావిధి వినిర్యాపిత ఘటిక ' యనుట వలన ఘటికా నిర్మాణమున-మన కిపుడు తెలియరాకపోయినను - శాస్త్రోక్త పద్ధతి యొకటుండవలె నని తోచుచున్నది. భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనవల్లికి మూలకందమైన వేదవిద్య యవిచ్ఛిన్నముగ సాగుటకు సంకల్పించి ఘటికలు స్థాపించిన జగతీపతులు పుణ్యశ్లోకులైరి. వేంగీచాళుక్య భూమీశుడైన మొదటి జయసింహవల్లభుని కాలమున అసనపురమున (వేంగీ దేశములోనిదే కాని ఇదెక్కడిదో తెలియదు) ఒక ఘటిక యుండెడిది.

ఘటికా స్థానమున వేద అధ్యాపకులైన నేమి, అధ్యేతలైన నేమి ఎందరుండెడివారో తెలియదు. వారి సంఖ్య ఎక్కువే అన్న సంగతి నాగాయి శాసనముల వలననే తెలియుచున్నది. కడపటి పల్లవులలో మొదటివాడయిన నందివర్మ పల్లవమల్లుని తిరువల్లరి శాసనమునందు ఘటికకు చెందిన ఏడువేల మంది (ఘటికై ఏళాయరవర్)

540