పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/582

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీసుదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 146

పటము 8

అలెగ్జాండర్ మహానీయుడు (క్రీ. పూ. 356-323)

రోమను సామ్రాజ్యములో గ్రీకు సభ్యత విస్తరించెను . కాని ఆ సామ్రాజ్యమున గ్రీకులు రాజకీయముగ పెక్కు బాధలకు లోనైరి. రోమనులయుగమందే క్రైస్తవ మతము గ్రీసుదేశమున ప్రవేశించెను. కాన్‌స్టంటైన్ అను రోమకచక్రవర్తి (క్రీ. శ. 324-337) ఈ మతమును తన ప్రజలెల్లరును అంగీకరింపదగునని శాసించెను.

మధ్యయుగపు చరిత్ర : కాన్‌స్టంటైన్ చక్రవర్తి బై జాంటియం అను ప్రాచీననగరము నెలకొనిన ప్రదేశమున, 'కాన్‌స్టాంటినోపిలు' అను నగరమును నిర్మించి, దానిని తన రాజధానిగ కావించుకొనెను. ఆతని యనంతరము రోమను సామ్రాజ్యము తూర్పుపశ్చిమ విభాగములుగ విడిపోయెను. తూర్పు సామ్రాజ్యమునకు బైజాంటైన్ సామ్రాజ్యము అను పేరు కలిగెను. గ్రీసుదేశమీ సామ్రాజ్యవిభాగమున చేరెను. ఆనాటికే క్రైస్తవ మతము ఐరోపాఖండమునం దంతటను వ్యాపించెను. కాని మతవిషయములలో తీవ్రమగు అభిప్రాయభేదములు ఉత్పన్నమై, తూర్పు ఐరోపాక్రైస్తవులును, పశ్చిమ ఐరోపాక్రైస్తవులును వేరుపడిరి. తూర్పు క్రైస్తవులు గ్రీకుక్రైస్తవు లనబరగిరి. తూర్పు రోమకసామ్రాజ్యము ప్రాచీన గ్రీకు సభ్యతకు నిలయమయ్యెను. పాశ్చాత్య క్రైస్తవులు గ్రీకు సభ్యతను నిరసనదృష్టితో చూచి దానిని విస్మరించిరి. అనాగరికజాతుల దండయాత్రల వలనను, మహమ్మదీయ మతస్థులతో జరిగిన మతయుద్ధముల (క్రూసేడ్లు) వలనను, బైజాంటియన్ సామ్రాజ్యము క్రమముగ దుర్బలమయ్యెను. క్రీ. శ. 15 వ శతాబ్దమున, అట్టోమాను తురుష్కులు 'డార్డవెల్సు' జలసంధిని దాటి మాసిడోనియా వర్బియా, బల్గేరియా లను ఆక్రమించిరి. తుదకు క్రీ. శ. 1453 వ సంవత్సరమున కాన్‌స్టాంటినోపిలు నగరము నాక్రమించిరి. అట్టోమాను వంశీయుడగు రెండవ మహమ్మదు సుల్తాను తూర్పురోమక సామ్రాజ్యమును తుదముట్టించెను.

ఆధునిక యుగపు చరిత్ర : కాన్‌స్టాంటినోపిలునగరము తురుష్కులవశమయిన తరువాత అచ్చట చిరకాలము నుండి నివసించియున్న క్రైస్తవ (గ్రీకు) పండితులు తమ ప్రాచీనగ్రంథములను తీసికొని, పశ్చిమ ఐరోపా దేశములకు వలసవచ్చిరి. 13 వ శతాబ్ది నుండియే, పాశ్చాత్య క్రైస్తవులు ప్రాచీన గ్రీకు విజ్ఞాన సంస్కృతుల యెడల అభిమానమును చూపసాగిరి. ఆ ప్రాచీన సంస్కృతితో కలిగిన పునః పరిచయము వలన పశ్చిమ ఐరోపా దేశములలో గొప్ప భావసంచలనము కలిగెను. దీనిని మానసిక వికాసోద్యమ (Renaissance) మని చరిత్రలు వర్ణించు చున్నవి. 15 వ శతాబ్దమున గ్రీకు పండితుల రాకవలన ఈ యుద్యమమునకు చాల బలిమి చేకూరెను. మానసిక వికాసోద్యమముతో, ఐరోపా ఖండమున ఆధునిక యుగము ప్రారంభమగుచున్నది. ప్రాచీన గ్రీకు సంస్కృతిచే ప్రభావితులై పాశ్చాత్య ఐరోపా జాతులవారు

528