పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/576

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీసుదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

యునుకాక, ఒకప్రక్క గ్రీన్‌లాండునకును కెనడాకును మధ్యనున్న ద్వీపములును, మరొకప్రక్క నార్వేదేశమును ఈ క్లిష్టసంఘటనమునకు దోహదమొసగినవనిగూడా వీరు ప్రకటించిరి. మరికొందరు శాస్త్రవేత్తల సిద్ధాంతము ప్రకారము పై నుదహరించిన మార్గములు, ప్రపంచపు వాతావరణము మానవజీవితమునకు అనువుగా నుండు నట్లుగా ఉపకరించుచున్నవని వీరు నుడివిరి. అనగా భూమి అత్యుష్ణముగా నున్నప్పుడు దానిని చల్లబరుచుటకును, అతి శీతలముగా నున్నప్పుడు ఉష్ణము కలిగించుటకును ఈ మార్గములు ఉపయుక్త మగుచున్నవని అర్థము. ఈ పరిణామము వలననే మన శీతోష్ణ వాతావరణ స్థితుల యందు మార్పులు కలుగు చున్నవి.

ప్రభుత్వము, పరిపాలనా విధానము: 1917 వ సంవత్సరములో గ్రీన్‌లాండ్‌లోని అన్నిప్రాంతముల మీదను అమెరికా సంయుక్తరాష్ట్రముల ప్రభుత్వము తన హక్కులను విసర్జించెను. తత్ఫలితముగా ఆ దేశముపైని డేనిష్ ప్రభుత్వముయొక్క ఆధిపత్యము సంపూర్ణమయ్యెను. ఉత్తర, దక్షిణ 'ఇన్స్ పెక్టరేట్స్' అని పిలువబడు రెండు ప్రాంతముల పరిపాలనకై డెన్మార్క్ రాజుచేత స్వయముగా ఒక్కొక్క ప్రాంతమునకు ఒక్కొక్క రాయల్ ఇన్‌స్పెక్టరు నియమితుడై నాడు,

డెన్మార్క్ అంతరంగిక శాఖామంత్రిచేత అమలు జరుపబడిన చట్ట నిబంధనలను బట్టి ఎస్కిమో జాతీయులు, స్థానిక మునిసిపల్ సంస్థల రూపములో స్థానిక స్వపరిపాలనమును అనుభవించుచుండిరి. 120 మంది స్వదేశీయులకు ఒక్కొకరు చొప్పున మతగురువు మునిసిపల్ సంఘ సమావేశములలో ప్రాతినిధ్యము వహించును. నైపుణ్యము గల వేటకాండ్రనుండి (providers) ఎస్కిమో సభ్యులు ఎన్నుకొన బడుదురు. వారు స్వల్పనేరములను విచారించి తమ తీర్పుల నిచ్చుచు, బాధితులకు, వయోవృద్ధులకు 'గ్రీన్‌లాండ్ ఫండు' (Greenland fund) నుండి ధనసాహాయ్యమిచ్చుచు తమ బాధ్యతను నెరవేర్తురు. డిస్కా ద్వీపముపైనున్న 'గాడ్ హావెన్' అను నగరము ఉత్తర గ్రీన్‌లాండు 'ఇన్‌స్పెక్టరేట్'నకు రాజధానియై యున్నది. దక్షిణ 'ఇన్స్‌స్పెక్టరేట్'నకు గాడ్‌తాబ్ యనునది రాజధానియై యున్నది.

గ్రీన్‌లాండ్ దేశీయులు ప్రప్రథమముగా 1861 వ సంవత్సరములో తమ వార్తాపత్రికను ప్రచురించుకొనిరి. అనేకములగు డేనిష్ గ్రంథములు ఇప్పుడు గ్రీన్‌లాండ్ భాషలోనికి అనువదింపబడి యున్నవి. ప్రస్తుతము పెక్కురు గ్రీన్‌లాండ్ దేశీయులు డేనిష్ భాషను చదువగలరు; వ్రాయగలరు. డెన్మార్క్ విశ్వవిద్యాలయములలో అనేకులు పట్టభద్రులు గూడ నయిరి.

గ్రీన్‌లాండ్ దేశము కేవలము ఒక్క గ్రీన్‌లాండ్ దేశీయులకొరకే ఉద్దేశింపబడలేదనియు, గ్రీన్‌లాండ్ వలస ప్రాంతమును అభివృద్ధిపరచుటకై డెన్మార్క్ దేశీయులు గూడ అచట నివాసమును ఏర్పరచుకొనుట అవసర మనియు డేనిష్ ప్రధానమంత్రి 1946 వ సంవత్సరములో ప్రకటించెను. ఈ సందర్భమున గ్రీన్‌లాండు అభివృద్ధి కొరకు ఒక ఆర్థిక విధానమును ఆతడు రూపొందించెను. ఈ విధానములోని ప్రధానాంశములు క్రింద పేర్కొన బడినవి.

(1) ప్రభుత్వమే వ్యాపారమును కొనసాగించు 'గుత్త' విధానమును ( monopoly system) విసర్జించుట. (2) గ్రీన్‌లాండు సముద్రతీరమునందు డెన్మార్క్ ప్రజలు చేపలు పట్టుకొనుటకు అనుమతి నిచ్చుట. (3) ఖనిజసంపదను, జలవిద్యుచ్ఛ క్తిని, వ్యవసాయమును అభివృద్ధి జరుపుటకు శాస్త్రపరిశోధనలు జరుపుట. (4) డేనిష్ భాషను విరివిగా బోధించి, వ్యాపింపజేయుట; గ్రంథాలయములను అభివృద్ధిచేసి, సాంస్కృతిక కార్యసంచలనమును విస్తృతపరచుట. (5) ఆరోగ్య విద్యావిషయక కార్యక్రమములను పెంపొందింప జేయుట. (6) డేనిష్ పార్లమెంటులో గ్రీన్‌లాండ్ నకు ప్రాతినిధ్యమును కల్పించుట.

1953 జూన్ మాసములో గ్రీన్‌లాండ్‌దేశము డెన్మార్క్ రాజ్యములో అంతర్భాగముగ చేయబడెను. డేనిష్ పార్లమెంటులో ఇద్దరు గ్రీన్‌లాండు సభ్యులకు ప్రాతినిధ్యము ఇయ్యబడెను.

ధ. ప్ర.


గ్రీసుదేశము (చరిత్రము) :

ప్రాచీనయుగ చరిత్ర : గ్రీసు చరిత్ర నవశిలాయుగమున (క్రీ. పూ. 4000) ప్రారంభమగుచున్నది. ఈ కాలమునాటి నాగరికత 'మైసీన్ ' నాగరికత యని పేరుగాంచినది. దీని


522