విజ్ఞానకోశము - 3
గ్రీన్‌లాండ్
రాస్ అనునతడు 1818 వ సంవత్సరము నాటి 'బఫిన్' అఖాతపు భాగములనుగూర్చి తెలిసికొనెను. 'స్మిత్‌సౌండ్' సమీపమున 600 మైళ్ళ పొడవు గల తీరప్రాంతమునకు ఇంగిల్ ఫీల్డ్ అనునతడు సర్వేపటమును తయారుచేసెను. 'కౌన్' అను వ్యక్తి తన సర్వే పథకమును హంబోల్ట్ మంచుకొండ వరకును విస్తృతపరచెను. హాల్ అనునతడు అక్షాంశరేఖయొక్క 82°07′N డిగ్రీ వద్దకు 1871 లో చేరుకొనెను. 1876 వ సంవత్సరములో 'నారెస్స్' అన్వేషణ సంఘమువారు జరిపిన పరిశోధన ఫలితముగా 'రిపల్స్ హార్బర్ ' కు వెనుకగా నున్న తీరప్రాంతము కనుగొనబడెను. తూర్పుతీరమునందు 'స్కోర్స్‌బీ' అనునతడు 64° - 75° ఉత్తర అక్షాంశరేఖల మధ్య గల భూభాగమును 1822 వ సంవత్సరములో పటముగా చిత్రించెను. 1853 మొదలు 15 సంవత్సరముల కాలము డాక్టర్ హెచ్. రెంట్ అనునతడు దక్షిణ గ్రీన్‌లాండ్ ప్రాంతము నందు జరిపిన సుదీర్ఘమైన సంచారము ఫలితముగా ఒక మార్పు వచ్చెను. 1883 వ సంవత్సరములో నార్డెన్ స్కియోల్డ్ అనునతడు 'ఆలాట్ సిర్క్' అను ఇరుకు మూతి సముద్రశాఖనుండి దేశాంతర్భాగములో 75 మైళ్ళ దూరమువరకు చేరగలిగెను. 1886 వ సంవత్సరములో పియరీ అనునతడు పశ్చిమతీరమునుండి లోతట్టు 120 మైళ్ల దూరమునకు 69°30′N అక్షాంశరేఖ వరకు చొచ్చుకుని పోగల్గెను. ఆరు సంవత్సరముల తరువాత అతడు మరియొకసారి ప్రయాణ మొనర్చి 'ఇంగిల్ ఫీల్డ్' సింధుశాఖను పరిశోధించి దానిని ఈశాన్యదిశగా దాటి 'ఇండిపెండెన్స్ ఫియోర్డ్' కు చేరెను. ఆతని తర్వాత 1905 వ సంవత్సరములో డ్యూక్ ఆఫ్ ఆర్లియన్స్, 1912-13 లో జె. పి. కోచ్ అనువారు పరిశోధనలు జరిపిరి. 1926 వ సంవత్సరములో కేంబ్రిడ్జ్ పరిశోధన సంఘమువారు తూర్పు గ్రీన్‌లాండునకు ప్రయాణము చేసి, కొన్ని పరిశోధనలు జరిపిరి. ఇవిచాల ముఖ్యమైనవి. 1930వ సంవత్సరములో ప్రొఫెసర్ వెగ్నర్ నాయకత్వమున అంతరిక్ష పరిశోధనలకొరకు జరుపబడిన సంచార కార్యక్రమము పేర్కొనదగినది. మౌంట్ ఫోరెల్, స్కోర్స్ బీసౌండ్ లకు మధ్యగల పర్వతమయప్రాంతమును పూర్తిగా పరిశోధించుటకు లెప్టినెంట్ యం. లిండ్సే అనునతడు 1934 వ సంవత్సరములో మరల గ్రీన్‌లాండునకు వచ్చెను. పశ్చిమ దిశనుండి ఈ ప్రాంతమును చేరుటకు మిక్కిలి అనుకూలముగా నుండెను. తన పరిశోధన పరివారముతో ఇతడు జాకబ్‌షాన్ నుండి దుర్గమమైన మంచు ప్రాంతమును సునాయాసముగా దాటగల్గెను.
ఇటీవలి సిద్దాంతములు: కొలంబియా విశ్వవిద్యాలయమునకు చెందిన లేమాంట్ భూగర్భ పరిశోధనశాలకు అధిపతియైన డాక్టర్ మారిస్ యూరింగ్ చేసిన పరిశోధన వలన ఆర్కిటిక్ మంచు క్రమముగా కుంచించుకుని పోవుచున్నట్లు తేలుచున్నది. 15 సంవత్సరముల క్రిందట వ్యాపించిన ప్రాంతముకంటె, ఈనాడు నూటికి 12 వంతులు తక్కువప్రాంతమును ఇది ఆవరించియున్నది. ఇది మందమునందుకూడా ఆనాటికంటె ఈనాడు నూటికి 40 వంతులవరకు తగ్గినది. ఒకసారి ఈ మంచు విచ్ఛిన్న మగుట ప్రారంభించినయెడల, మనము ఊహించినదాని కన్న తక్కువ సమయములో ఎక్కువ వేగముగా అది కరగిపోవుట సంభవించును. కొందరు నిపుణులు తయారు చేసిన లెక్కలనుబట్టి, ప్రపంచములో భూఖండగతమైన మంచంతయు కరగినచో, ముఖ్యముగా అంటార్కిటికా, గ్రీన్‌లాండ్ దేశములలో 2 మైళ్లు మందముగల మంచు పొరలు సహితము కరగినయెడల, సముద్రజలముల పరిమాణము 100 మొదలు 200 అడుగుల ఎత్తువరకు పై కుబికి, న్యూయార్క్ నే ముంచివేయునంత నీరు ఏర్పడగలదు.
డాక్టర్ మారిస్ యూరింగ్, డాక్టర్ విలియం యల్ . డాన్ అను ప్రఖ్యాత అమెరికా భూభౌతిక శాస్త్రవేత్తలు ఇటీవల “హిమయుగముల"ను (Ice Ages) గూర్చి సంభావ్యమైన ఒక నూతనసిద్ధాంతమును ప్రచురించిరి. ఆర్కిటిక్ తీరమునందు స్థానికమైన భౌగోళిక పరివర్తనము జరుగుచున్నదని వీరు ప్రకటించిరి. గణితశాస్త్ర సంబంధమగు లెక్కలతోడను,భూగర్భశాస్త్ర సంబంధమగు సిద్ధాంతముల యొక్క ఆధారములతోడను వీరు తమ సిద్ధాంతమును బలపరచుకొనిరి. భూపరివేష్టితమైన (Land - locked) ఆర్కిటిక్ సముద్రమునకును, ఉత్తర అట్లాంటిక్ సముద్రమునుండి వచ్చెడి ఉష్ణపవనములకును నడుమ లోతులేని మార్గము లుండుటవలన ఈ భౌగోళిక పరివర్తనము జరుగుచున్నదని ఈ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడిరి. అది
521