పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/574

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీన్‌లాండ్

సంగ్రహ ఆంధ్ర

లైట్' (cryolite) అను ఖనిజపదార్థము లభించు గని యొక్కటి కలదు. తక్కువరకమునకుచెందిన బొగ్గు అనేక స్థలములలో లభింపగలదు. కాని పిట్ అను పదార్థము బొగ్గు కన్న ఎక్కువ మితవ్యయమునకు తోడ్పడుటవలన, బొగ్గు చాలా తక్కువగా వాడబడును.

వర్తకము, వాణిజ్యము : దిగుమతులన్నియు గ్రీన్‌లాండ్ ప్రభుత్వము యొక్క అదుపులోనుండును. ఈ దిగుమతులు 'అవసర పదార్థములు', 'భోగపదార్థములు' అని రెండు తరగతులుగా విభజింపబడినవి. అవసరవస్తువులను స్వదేశీయులకు సాధ్యమైనంత తక్కువధరలకు - ఒక్కొక్కప్పుడు నష్టమునకు లోబడికూడా - అమ్ముదురు. కాఫీ, పంచదార, పొగాకువంటి భోగపదార్థముల ఖరీదు ఎక్కువగా నుండును.

గ్రీన్‌లాండునుండి ఎగుమతి చేయబడు వస్తువులలో,– ఉప్పులో ఊరవేసిన చేపలు, డబ్బాలలో నిలువ చేసిన చేపలు, మంచులో పెట్టబడిన చేపలు, ఎండుచేపలు ; 'షార్క్ ' చేపలయొక్కయు, తదితరములైన చేపల యొక్కయు కారిజమునుండి తీయబడిన నూనెలు; క్రియొలైట్ అను ఖనిజములు; నల్లసీసపురాయి ; గొఱ్ఱెల మాంసము, చర్మములు, ఉన్ని, పోలార్ ఎలుగుబంట్ల చర్మములు, నీలపురంగు, తెలుపురంగు గల నక్కల చర్మములు, వాల్‌రస్ చర్మములు, తెల్ల తిమింగలముల చర్మములు, షార్క్ మొదలగు జలచరములు చర్మములు, సముద్రపు బాతుల రగ్గులు, సముద్రపు బాతుల ఈకలు, పక్షుల ఈకలు, వాల్ రస్ దంతములు పేర్కొన దగినవి. డిస్కో, నుగ్ స్సాక్‌ల చుట్టుపట్టులలో బొగ్గు సేకరింపబడియుండును. కాని రవాణా సౌకర్యములు తక్కువ యగుటవలన ఈ బొగ్గు ఎగుమతి అగుటలేదు.

జనాభా : 1950వ సంవత్సరపు జనాభా లెక్కలనుబట్టి గ్రీన్‌లాండ్ జనాభా షుమారు 23,000 వీరిలో వేయి మంది ఐరోపియనులున్నారు. (ఎక్కువమంది డెన్మార్క్ వారు) పశ్చిమ సముద్రతీరమున జనాభా కేంద్రీకరించి యున్నది. అచ్చటి ఆదిమవాసులను నేడు ఎస్కిమోలనుట కంటె గ్రీసులాండు దేశీయు లనుటయే ఉచితము. కారణ మేమన, పరంపరాగతులైన ఎస్కిమోలకంటె గ్రీన్‌లాండు దేశీయులు మిక్కిలి అధికతరమైన సంస్కృతి కలవారై యున్నారు. 'ధూల్'కు పరిసర ప్రాంతముల యందు నివసించుచున్న కొలదివందల ఎస్కిమోలుతప్ప ఎక్కువమంది జనులు పురాతనపు 'నార్సీ' వలసప్రజల సంతతికి చెందుటవలనను, ఐరోపియనులతో ముఖ్యముగా డేనులతో గడచిన కొన్ని తరములనుండి అంతర్వివాహ సంబంధములు కలిగియుండుట వలనను, ఐరోపియను రక్తస్పర్శయే వారిలో కలదని చెప్పవలసి యున్నది. 'స్కోర్స్ బీసౌండ్' అను వలసప్రాంతము ఇటీవల అనగా 1925 సం: లో నూతనముగా ఏర్పడ్డది.

చరిత్ర ; నూతన స్థలాన్వేషణ : పదవ శతాబ్దారంభము నందు 'గున్‌లిజార్న్' (gunalijorn) అను ఒక నార్వే దేశీయుడు ఐస్‌లాండునకు పశ్చిమదిశగా కొన్ని ద్వీపములను కనుగొనెనని చెప్పుదురు. బహుళముగా అతడు గ్రీన్‌లాండుయొక్క ఆగ్నేయ సముద్రతీర ప్రాంతమును చూచియుండవచ్చును. 982 వ సంవత్సరములో 'ఎరిక్ ది రెడ్ ' (Eric the Red) అను మరియొక నార్వే జాతీయుడు ఐస్‌లాండునుండి బయలుదేరి 'గున్‌లిజార్న్' చూచిన భూభాగమును కనుగొనుటకై మూడు సంవత్సరముల కాలము అన్వేషణ కావించెను. ఆతడు 985 వ సంవత్సరములో ఐస్‌లాండ్‌కు తిరిగివచ్చెను. ప్రజలకు ఆ దేశమునకు పోవుటకు ఎక్కువగా ఇష్టమును కలిగించుటకై దానికి గ్రీన్‌లాండు అని నామకరణ మొనర్చెను. మరల ఆతడు 986 వ సంవత్సరములో 25 ఓడలను వెంట నిడుకొని గ్రీన్‌లాండునకు బయలుదేరెను. వాటిలో 14 ఓడలు మాత్రము గ్రీన్‌లాండ్ చేరుకొనెను. ఆతడు నైరృతి సముద్ర తీరమునందు ఒక వలసను స్థాపించెను.

ఆధునిక యుగమున ప్రప్రథమముగా గ్రీన్‌లాండ్‌ను గూర్చి 1721 మేనెల 12 వ తేదీన అన్వేషణ ప్రారంభమైనది. హాన్స్ ఈగేడ్ అనునతడు తన భార్యతో, బిడ్డలతో డెన్మార్క్‌నుండి బయలుదేరి గ్రీన్‌లాండ్ పశ్చిమతీరమున నున్న గాడ్ తాబ్ అను ప్రదేశమునకు చేరుకొనెను. ఆతడక్కడ 1736 వ. సంవత్సరము వరకు నివసించి, ఆ ద్వీపమును గూర్చి విశేషాంశములను సేకరించెను. ఇతడే గ్రీన్‌లాండునందు ఆధునిక మైన వలసను (colonization) ప్రవేశపెట్టెను. పశ్చిమతీరమునందు ఆ శతాబ్దాంతమున పది వలసలు ఏర్పడినవి. 19 వ శతాబ్దములో

520