పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/571

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రీన్‌లాండ్

ఆగ్నేయతీరమందున్న ఫ్రాన్జ్ జోసెఫ్, కింగ్ ఆస్కార్ అనునవి, నైరృతిదిశయందలి గాడ్ తాబ్ అనునది, వాయవ్యదిశయందు ఆర్కిటిక్ మహాసముద్రమునకు అభిముఖముగానున్న పీటర్ మాన్ అనునది ముఖ్యము లైనవి.

ఉత్తరధ్రువమండలమునకు సంబంధించిన ప్రాంతముల నుండి భూభాగము వెంబడి ఉత్తరధ్రువప్రవాహము మంచుగడ్డల సముదాయమును నైరృతిదిశగా తోడ్కొని వచ్చుచు ఈ ప్రాంతమునకు పూర్తిగా ఆర్కిటిక్ శీతోష్ణస్థితిని కల్పించుటచేత, గ్రీన్‌లాండ్ తూర్పుతీరమునం దెల్లను విస్తారముగా హిమానీనదములు ఏర్పడియున్నవి. దేశాంతర్భాగములో కొన్ని ప్రాంతములయందు ఈ హిమానీనదములు (glaciers) సముద్రతీరమునకు సమీప ప్రాంతమువరకును, మరికొన్ని ప్రాంతములయందు లోతట్టు ప్రదేశమువరకును వ్యాపించియుండును. మంచు మయమైన సముద్రతీరప్రాంతము దేశములోనికి దూరముగా వ్యాపించిన ఇరుకైన సముద్రశాఖలచే కోయబడి యున్నది. అక్కడక్కడ పెద్దపెద్ద హిమానీనదములు (glaciers) కాలువలను అడ్డగించి హిమశిలలను (icebergs) వానిలో బడవైచును. ఉదా: “స్కోర్స్‌బీసౌండ్" అనెడిశాఖ యొక్క నిడివి, తీరప్రాంతమునుండి హిమానీనదములు (glaciers) అడ్డగించు ప్రాంతమువరకు 180 మైళ్లు కలదు. “ఫ్రాన్జ్ జోసెఫ్" అనెడి శాఖకూడా ఇట్టిదే. ఈ సముద్ర శాఖలు చాలా లోతైనవి. "స్కోర్స్‌బీసౌండ్" అనెడి శాఖయొక్క లోతు 300 బారలు అని రైడర్ (Ryder) కనుగొనెను. ఈ ఇరుకు సముద్రశాఖలయందు జలాంతర్గాములు ప్రయాణింపవచ్చునని తీరప్రాంతములయందు చేసిన పరిశోధనల మూలమున నిరూపింపబడినది. కోతకోయబడిన ఫలితముగా, లోయలు సముద్రశాఖలుగా రూపముదాల్చి, సముద్రపు నీటిలో మునిగిపోయినవి. పశ్చిమతీరమున గూడా అనేక గొప్ప ఇరుకు సముద్ర శాఖలు కలవు. వీటిలో ఆదికాలమునుండియు పేరెన్నిక కన్న "గ్రేట్ గాడ్ తాబ్" అనునది ఒకటి.

తూర్పు సముద్ర తీరమున అనేక వేల హిమశిలలు (icebergs) ప్రతిసంవత్సరము ఏర్పడుచున్నవి. ఇవన్నియు “స్పిట్జ్ బెర్గెన్” ప్రవాహముల మూలమున స్థానికముగనే నిలిచిపోవుచున్నవి. ఇతరములగు హిమశిలలు ఈ బలమైన ప్రవాహములచే (currents) 'కేవ్ ఫేర్వెల్ ' చుట్టునున్న ప్రాంతములకును, అక్కడినుండి 'మెల్ విల్లి అఖాతము' లోనికిని తీసికొని పోబడుచున్నవి. చివరకు అవి అట్లాంటిక్ మహాసముద్రమున హిమక్షేత్రము (icefields) లేర్పడుటకు తోడ్పడుచున్నవి.

గ్రీన్‌లాండునందలి మంచుపొర బహిర్ముఖమైన ఒత్తిడి కలిగియుండి తీరప్రదేశము వైపునకే మ్రొగ్గియుండును. దేశాంతర్గతమైన నిలువు ఒత్తిడివలన మంచుపొరలు నిదానముగా సముద్రతీర ప్రాంతమునకు ప్రవహించును. ఈ మంచురేకుల యొక్క గతివేగమును కనిపెట్టుటకు ప్రయత్నము చేయబడినది. ఉత్తరమున 73° లో నున్న "ఉపర్నీవిక్" అను హిమానీ నదమును బట్టి రైడర్ (Ryder) అను నాతనిచే అన్ని హిమానీ నదములయొక్క అత్యుత్కటమైన గతివేగము కొలువబడినది. 24 గంటల కాలములో 125 అడుగుల గతివేగమును, అనేకదినముల వరకు సగటున 102 అడుగుల గతివేగమును అతడు కనుగొనెను. మరియు చలికాలమందును, వేసవికాలమందును హిమానీనదముల గతివేగములో గొప్పభేదము ఉన్నట్లు అతడు కనుగొనెను.

భూగర్భలక్షణములు, నిర్మాణము : గ్రీన్‌లాండ్ యొక్క ఉపరితల నిర్మాణము ఎక్కువగా 'ఆర్కియన్ వెనె ప్లెయిన్' లక్షణములు కలదై యున్నది. మరియు, ఇది 'కేంబ్రియన్ కెనెడియన్ షల్ట్' పూర్వభాగము యొక్క విస్తరణమై ఉన్నది. "ఆర్కెయన్ ఏరియా"లో విస్తార భూభాగము 'నీస్ ' (Gniss) అను ఒకవిధమగు రాయిచే నిండియున్నది. కాని ఇచ్చట 'నల్లరాయి' (Granite) చట్టులుగూడా విరివిగా లభింపగలవు. మిక్కిలి ఉత్తర ప్రాంతమంతయు 'పాలియో జోయిక్ ఇసుకరాయి' (Paleozoic sand stone) తోను, సున్నపురాయితోను ఏర్పడియున్నది. దక్షిణ ప్రాంతమున 'సిలూరియన్ సున్నపురాయి' (Silurian Lime Stones) మండలము లున్నవి.

'పాలియో జోయిక్ ' (Paleozoic Period) యుగాంతమున గ్రీన్‌లాండు ప్రాంతములో అగ్నిపర్వతములు బ్రద్దలయ్యెను. 'డిస్కా' దీవి యందలి పర్వతములందు

517