పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/568

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీకుభాషా సాహిత్యములు

సంగ్రహ ఆంధ్ర

ఈస్కలస్ అనువాడు గ్రీకువిషాదాంతనాటకకర్తలలో ప్రథముడు. అతడు రంగముమీదికి రెండవనటునికూడ ప్రవేశ పెట్టి, బృందగానపు ప్రాముఖ్యమును తగ్గించి, సంభాషణలను విస్తరింపజేసెను. అతని నాటకములలో 'యగమెమ్నన్' వంశమునుగూర్చిన నాటకత్రయమును, “ప్రొమీథియస్ బౌండ్" నాటకములు ప్రధానములు. ఈస్కలస్ నాటకములు గంభీరమైన శైలికి ప్రసిద్ధములై కవి ధార్మికదృష్టిని, జీవిత పరమావధిని గూర్చిన భావ మధనము నడుగడుగున ప్రతిఫలింప జేయుచుండును. సోఫక్లీస్ కాలక్రమమున ద్వితీయుడైనను. కళాసౌందర్య మున ప్రథముడని గణుతికెక్కెను. పాత్రల మనస్తత్వ చిత్రణమునం దాతడు సిద్ధహస్తుడు మానవుల సహజో ద్రేకములు, పరస్పర విరుద్ధాశయములు విషాద పరిణామమున కెట్లు దారితీయునో సోఫక్లీస్ కడు రమ్యముగ చిత్రించును. అతని నాటకములలో "ఈడిపస్", “యాంటిగనీ”, “ఎలెక్ట్రా", "అయ్‌జాక్స్" అనునవి ప్రశస్తములు. ప్రధాన విషాదాంత నాటకకర్తలలో తృతీయుడు యూరిపిడీస్. నాటకమున కతడు పూర్వ రంగమును కూర్చెను. సమకాలీన జీవితమునందలి ధర్మసందేహము లతని నాటకములలో కాన్పించును. మానవు లెట్లుండవలెనో సోఫక్లీస్ నాటకములు సూచించగా, మానవు లెట్లుందురో యూరిపిడిస్ నాటకములు వెల్లడించును. యూరిపిడిస్ నాటకములలో "హెర్ క్లీస్", "హెక్యుబా", "హెలెనా", "ఇఫిజీనియా" అను నాటకములు ప్రఖ్యాతములు.

ఆ కాలముననే సుఖాంత నాటక రచనయు ప్రారంభమయ్యెను. పామరుల హాస్య పరిహాసములును, వినోద గీతములును దానికి బీజములు. సుఖాంత నాటకములకు కళాస్వరూపము నొసగిన నాటకకర్త అరిస్టోఫనీస్ అను వాడు. తన నాటకములం దతడు సమకాలికో దంతములను, ప్రసిద్ధ వ్యక్తులను నిర్భయముగ పరిహసించెను. “క్లౌడ్స్” అను నాటకమునందతడు సుప్రసిద్ధ వేదాంతాచార్యుడైన సోక్రటీసును, “ఫ్రాగ్స్" అను నాటక ము నందు యూరిఫిడీసును గేలిచేసెను. అటుపిమ్మట సుఖాంత నాటకములందు వ్యక్తులుగాక వివిధోద్యమములు విమర్శింప బడెను. తుదకవి దైనందిన జీవితమునందలి హాస్య ఘట్టములను ప్రదర్శించెను. అట్టి నాటకములను రచించిన వారిలో మినాండర్ ముఖ్యుడు.

క్రీ. పూ. 5 వ శతాబ్దమునందే చరిత్ర రచనయు, వచన వాఙ్మయమును పరస్పర పోషకములై వెలసెను. గ్రీకు చరిత్రకారులలో ప్రథముడుగు హెరోడటస్ సుందరమైన వచనశైలికి కూడ మార్గదర్శకుడయ్యెను. గ్రీసు, పర్షియా దేశముల నడుమ జరిగిన యుద్ధముల నతడు వర్ణించుచు అం దసమాన కథనాశ క్తిని ప్రదర్శించెను. థ్యూసిడిడీస్ విమర్శ దృష్టితో పెలపనీషియన్ యుద్ధచరిత్రమును రచించుచు అందు వ్యక్తుల శీల తారతమ్యమును అతి దక్షతతో వెల్లడించెను. ఆ కాలమునకే చెందిన వేరొక చరిత్రకారుడగు జెనఫన్ స్వయముగ సైనికుడై యుద్ధమున పాల్గొనుటయేగాక, గ్రీసుభాషలో తొలి వచన వ్యాసములను రచించి కీర్తిగాంచెను.

ఏథెన్స్ నగరమునం దపుడు వక్తృత్వమునకు ప్రజాదరణ మధికముగ లభించుచుండెను. నాటి వక్తలు తమ ఉపన్యాసములను గ్రంథరూపమున ప్రచురించుచుండిరి. వారిలో అగ్రగణ్యుడైన డెమాస్తనీస్ "ఒలింథియాక్స్", “ఫిలిప్పిక్స్” అను సంపుటములలో తన గంభీరోపన్యాసముల సంకలనము గావించెను. గ్రీకు వచన రచనయం దద్వితీయుడని పరిగణించబడుచున్న ప్రఖ్యాత తత్వజ్ఞుడు ప్లేటో కవిత్వమున కెనవచ్చు రసవంతమైన శైలిలో “డయలాగ్స్" గ్రంథమునందు తన దేశికుడైన సోక్రటీస్ ధర్మ ప్రబోధమును, 'రిపబ్లిక్ ' గ్రంథమునం దాదర్శ సమాజ స్వరూపమును చిత్రించెను. ఆతని శిష్యుడగు అరిస్టాటిల్ రచించిన “పొయటిక్స్” పాశ్చాత్య వాఙ్మయమునందలి ప్రథమ లక్షణగ్రంథము.

క్రీ. పూ. 4వ శతాబ్దము తరువాత ఏథెన్స్‌నగరపు ప్రాధాన్య మంతరించి, రాజకీయముగ నేమి, వైజ్ఞానికముగ నేమి, అలెగ్జాండ్రియా ముఖ్యకేంద్రమయ్యెను. అప్పటితో గ్రీకు సాహిత్యమున క్షీణదశ ప్రారంభమైనట్లు విమర్శకు లభిప్రాయపడుచున్నారు. అలెగ్జాండ్రియన్ యుగ కవితలో నిసర్గసౌందర్య లోపమును, పాండిత్య ప్రకర్షయు నెక్కువగా కాన్పించును. ఆనాటి కవులయం దితిహాసకావ్యములకు అపొలోనియస్ అనువాడును, స్తోత్రకావ్యములకు కాలిమాకస్ అనువాడును ప్రసిద్ధి

514