పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/556

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రంథిస్రుతములు (హార్మోనులు)

చున్నది. ఈ గ్రంధులకు హార్మోనులను ఉత్పత్తిచేయు బాధ్యతతప్ప వేరొకపని యేదియులేదని భావింపవచ్చును. కాని, నిర్వాహికలుకాని గ్రంధులనుండి కూడ కొన్ని హార్మోనులు శరీరములో లభ్యమగుచున్నవి. వృక్యము లేక క్లోమము (pancreas) నుండి జనించు ఇన్స్యులిన్, వీర్యస్థానములనుండి (gonads) ఉద్భవించు లింగాధార హార్మోనులు (Sex hormones) ఇందుకు ఉదాహరణములు : ఒక జంతువు యొక్క శరీరమునుండి ఒక అవ యవము కోసివేయబడినపుడు, అట్టి అవయవజనితమగు పదార్థములు ఆ జంతువునకు అందజేసినచో, ఆ జంతువు తిరిగి తన ఎప్పటి ఆరోగ్యమును పొందగలిగినయెడల, అట్టి పదార్థము హార్మోనుల తరగతికి చెందిన దని చెప్పవచ్చును. ఈ హార్మోనులన్నియు జీవ రాసాయనిక పదార్థములే. కాని, వేరువేరు హార్మోనుల నిర్మాణాకృతిలో అనేకవిధములగు భేదములు కానవచ్చును. పైన తెలుపబడిన జంతు సంబంధమగు హార్మోనులవలెనే, వృక్షజాతి కూడ కొన్ని హార్మోనులను ఉత్పత్తిచేయును. ఉదా : “ఆక్సిన్” అను పదార్థము.

కొన్ని ముఖ్యమగు హార్మోనులు :

I ఎడ్రినల్ గ్రంధి హార్మోనులు : ఎడ్రినల్‌గ్రంధి, అనునది “ మెడ్యుల్లా”, “కార్టెక్సు" అను రెండు భాగములను కలిగియుండును. "మెడ్యుల్లా" నుండి స్రవించు హార్మోనునకు ఎడ్రెనలీన్ అని పేరు 'కార్టెక్సు' నుండి లభించు హార్మోనులకు ఎడ్రెనల్ కార్టెకల్ హార్మోను అని పేరు.

1. ఎడ్రెనలీన్ : ఈ హార్మోనునకు ఎపినెఫ్రిన్, సుప్రా రెనిన్ అనునవి నామాంతరములు. వధింపబడిన జంతువుల ఎడ్రెనల్ గ్రంధులనుండి ఈ హార్మోను తయారు చేయబడుచున్నది. ఈ హార్మోను మూలముగా రక్తపు పోటు, రక్తములోని చక్కెర ప్రమాణము హెచ్చును. అందువలన ఈ హార్మోను, ఇన్స్యులిన్ అను హార్మోనునకు వ్యతిరిక్తముగా పనిచేయును. శరీరమునందలి ఏభాగమైనను తెగినచో ఏర్పడు రక్తస్రావమును అరికట్టునట్టి శక్తి ఈ హార్మోనునకు కలదు. ఈ కారణముచేత ఎడ్రెనలీన్ హార్మోను శస్త్ర చికిత్సలో ఉపయోగపడుచున్నది. శరీరమునందలి సిరల (Veins) లోనికి సూదులద్వారమున హార్మోను ఎక్కించబడును. ఎడ్రెనలీన్ అనునది నత్రజనితో కూడుకొనిన క్షార సంబంధమగు ఒక జీవ రాసాయనిక పదార్థము.

2. ఎడ్రెనల్ కార్టెకల్ హార్మోనులు: ఎడ్రెనల్ గ్రంథి తొలగింపబడినచో, జంతువుల జీవితమును ఎడ్రెనల్ కార్టెక్సునుండి తీయబడిన మందుల ద్వారమున పొడిగింప వచ్చునని 1929 లో కనుగొనబడినది. దీని నాధారముగా గొని స్విట్జర్లాండులో రైచ్‌స్టైన్ అను శాస్త్రజ్ఞుడును, అమెరికాలో కెండాలును, అతని అనుయాయులును, కార్టెక్సులోగల రాసాయనిక పదార్థముల విషయమున తీవ్రమైన పరిశోధనములను సాగించిరి. ఈ పరిశోధనముల ఫలితముగా 29 క్రొత్త జీవరాసాయనిక పదార్థములు కనుగొనబడినవి. వీటిలో 7 మాత్రమే హార్మోనులుగా పనిచేయగల వని తెలియుచున్నది. కార్టెక్సోన్, ఆల్డోస్టెరోన్ అను రెండును ఈ ఏడింటిలో అత్యంత శక్తిమంతమైన హార్మోనులై యున్నవి. ఈ తరగతికి చెందిన హార్మోనులు శరీరమున తక్కువైనచో, రక్తములో నుండవలసిన నీరు, సోడియమ్, పొటాషియమ్ అనువాటియొక్క నిష్పత్తి క్రమము తప్పుటయు, క్రొవ్వుపదార్థములను, పిండిపదార్థములను శరీరము సరిగా ఇముడ్చుకొనలేక పోవుటయు సంభవించును. ఈ హార్మోనులు క్లిష్టతరమైన నిర్మాణాకృతిని కలిగియున్నవి. ఈ విషయమై రైచ్‌స్టైన్, అతని బృందము అత్యంత ముఖ్యమగు పరిశోధనములు చేసియున్నారు.

II. మాంసకృత్తు సంబంధమగు హార్మోనులు : శరీరములోని అనేక హార్మోనులు మాంసకృత్తు మయమగు క్లిష్టమైన నిర్మాణమును కలిగియున్నవి. ఈ క్రింద తెలుపబడిన నాలుగును ఇందు ముఖ్యములు.

1. థైరోగ్లాబ్యులిన్ : ఈ హార్మోను థైరాయిడ్ గ్రంధినుండి జనించును. ఇది శరీరముయొక్క క్రమమైన అభివృద్ధికి తోడ్పడును. చర్మము ఎండిపోవుటయు, బుద్ధి మాంద్యము కలుగుటయు, సంధాయక ధాతువులు (connective tissues) ఉబ్బుటయు ఈ హార్మోను లోపించుటచే కలుగు చిహ్నములు. ఈ హార్మోనును కలిగియున్న నాళములనుండి క్షారముల సహాయముతో థై రాక్సిన్ అను పదార్థమును, కెండాల్ అనునాతడు 1915 లో వేరు చేయ కలిగెను. థైరోగ్లాబ్యులిన్‌లో గల

503