పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/554

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రంథాలయశాస్త్రము

చేయబడి, ప్రాయశ్చిత్త సాధనములో ఉపనిషత్తులు మొ. వాని పారాయణము, మేధ్యవ్రతములు, పయోవ్ర తత్వాదులు, బ్రహ్మచర్యాది తపములు, దానధర్మములు, కృచ్ఛాతికృచ్ఛా చాంద్రాయణాదులు మొ. నవి కూర్పబడి యున్నవి. మూడవప్రశ్నపు టంతిమాధ్యాయమున దాయభాగ విచారణము చక్కగా గావింపబడినది. అందు దాయవిభాగమే ధర్మవృద్ధి కారణమని సిద్ధాంతీకరింప బడినది. పుత్రసంతానము కేవల పుత్రికా సంతానము గలవారి విషయమున దాయభాగ నిర్ణయము గావింపబడినది. అట్లే స్త్రీధనము స్త్రీధనమునకు దాయభాక్కులు మొ. అంశములును, బ్రాహ్మణుని దాయము అసవర్ణా పుత్రుల విషయమున పంచబడు రీతులును, విపులముగా విచారింపబడినవి. మరియు జడక్లీబాదుల విషయమున గమనింపదగిన విధులు, ప్రతిలోమ సుతుల దాయభాగక్రమము, విభాగసందర్భమున సందేహాదులు కల్గినప్పు డనుసరింపవలసిన విధానము మొదలగునవి యెంతో హృదయంగమముగా నిర్దేశింపబడినవి. ఇట్టి ప్రశ్న త్రయాత్మకమైన ధర్మసూత్రగ్రంథ పరిశీలనచే చారిత్రకముగా నాటి ఆర్యసంఘపు ధార్మికపుమర్యాదలు, తత్సంస్కృతి విశేషములును మనకు విశదముగా తెలియగలవు!

విశేష మేమనగా శ్రుతిమంత్ర గర్భితములగు ధర్మ విషయములు స్మృతులలో శ్లోకరూపమునుధరించి వ్యాప్తిలోనికి వచ్చి, సులభగ్రాహ్యములైనవి. కాని అందలి గహనవిషయములు సులభముగా జ్ఞప్తియం దుంచుకొనుటకు వీలుగా తత్సూచనాత్మకములైన సూత్రము లావశ్యకములైనట్లు గుర్తించి - మనకు తెలిసినంతవరకు - ప్రథమతః గౌతమమహర్షి ఈ ధర్మసూత్రములు నిర్మించి తద ధ్యేతల కెంతయు నుపకారము గావించియున్నాడు! ఈ గ్రంథముద్వారా గౌతముడు తనకు పరిపూర్ణముగా గల వైదికవిజ్ఞానమును, లౌకిక పరిజ్ఞానమును, నాటి ధర్మజ్ఞుల ధర్మవిధాన సమన్వయశక్తిని సమగ్రముగా ప్రదర్శించి యున్నాడు. అట్టి గౌతమునికి భారతదేశ మెంతయు ఋణపడి యున్నదనవచ్చును.

బి. వేం. శే


గ్రంథాలయశాస్త్రము :

శాస్త్ర మనెడి పదము ప్రథమమున భౌతికధర్మములను గూర్చిన విజ్ఞానమునకు ఉపయోగించుచు వచ్చిరి. కొంతకాలమునకు జీవజాలమును గూర్చిన విజ్ఞానమును కూడ దీనిలో చేర్చిరి. నేడీ పదము చాల విశాలమై జీవితమునకు సంబంధియైన సర్వ విషయములను తనయం దిముడ్చుకొనుచున్నది. ఈ విధముగా గ్రంథాలయ విషయముకూడ నేడు శాస్త్రముగా పరిగణింపబడుచున్నది.

గ్రంథాలయ శాస్త్రము అమెరికా, బ్రిటన్ మున్నగు పాశ్చాత్యదేశములలో బాగుగా వ్యాప్తిలోనికి వచ్చినది. చాలకాలమునుండి ఆ దేశములలో దాని బోధనలకై ప్రత్యేకము పాఠశాల లేర్పడి పనిచేయుచున్నవి. అక్కడ గ్రంథాలయ శాస్త్రములో పట్టభద్రులు తయారగు చున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రములలో పదేండ్ల క్రిందనే దాదాపు 50 మంది యువకులు గ్రంథాలయ శాస్త్రములో పండితపట్టము (డాక్టరేట్ డిగ్రీ) లను కూడ సంపాదించియున్నారు. అచ్చట వెలువడిన గ్రంథాలయ వాఙ్మయపు విలువ దరిదాపు రు. 20,000 లు ఉండవచ్చునని విజ్ఞులైనవారి అంచనాయై యున్నది. దీనికి సంబంధించిన పుస్తకములతోపాటు పత్రములుకూడ అమెరికాలో అధికముగా వెలువడుచున్నవి.

బ్రిటనులోకూడ గ్రంథాలయశాస్త్ర బోధనమునకు చక్కని యేర్పాటు లున్నవి. లండన్ యూనివర్సిటీవంటి వివిధ విశ్వవిద్యాలయములతోబాటు, బ్రిటిష్ లైబ్రరీ అసోసియేషన్ వారు కూడ గ్రంథాలయశాస్త్రములో పరీక్షల నేర్పాటుచేసి, వీనిలో నెగ్గినవారికి పట్టములను ప్రసాదించుచున్నారు.

మన దేశములో కొన్ని విశ్వవిద్యాలయములును, గ్రంథాలయ సంఘములును ఈ విషయములో కొంత కృషి చేయుచున్నవి. ఢిల్లీ విశ్వవిద్యాలయమువారు గ్రంథాలయ శాస్త్రమునందు డిగ్రీకోర్సునుకూడ ఏర్పాటుచేసి నడుపుచున్నారు. మదరాసు విశ్వవిద్యాలయములో నీ విషయమున ఆచార్యపీఠము నెలకొల్పెడి విషయమై డాక్టరు యస్. ఆర్. రంగనాథన్‌గారు లక్ష రూపాయలు విరాళ మిచ్చియున్నారు.

గ్రంథాలయ నిర్వాహకులు తమ విధి నిర్వహణములో అవలంబించెడి విధానములు, దీనికై వలయు విజ్ఞానము, ఈ కార్యక్రమమునందు వారి పాత్రయు,

501