విజ్ఞానకోశము - 3
గౌతమీ బాలశ్రీ
ఇత డొనర్చిన గ్రామదానము ఆ గుహయొక్క వసారాకు ఎడమప్రక్క నున్న గోడమీద మరియొక శాసనము కలదు. ధాన్యకటకాధీశ్వరుడైన గౌతమీపుత్ర శాతకర్ణి, జయము గాంచిన తన సేనయొక్క నివేశన స్థానమున నుండి, గోవర్ధనములోని తన సైన్యాధికారియైన విష్ణుపాలితు డనువానికి తెలియజేసిన ఉత్తరువుయొక్క భావమునుబట్టి, అప్పటివరకు ఋషభదత్తుని స్వాధీనములో నుండిన రెండు నూరుల నివర్తనముల పరిమాణము గల 'అనిలకాలకి' అను పొలమును సాధువుల ఉపయోగార్థము ఇతడు దానము చేసినట్లు తెలియుచున్నది.
ఈ విధముగా ఈ మహారాజు శత్రు దుర్నిరీక్ష్యతేజుడై, వంశగౌరవ స్థాపకుడై, రాజాధిరాజై, ధర్మపరాయణుడై, ఆశ్రిత చింతామణియై, దక్షిణాపథపతి బిరుదాంచితుడై, ఆంధ్రసామ్రాజ్యమునకు అమూల్యమైన సేవచేయుచు, తన కాలమును త్రివర్గ సాధనకై చక్కగ విభజించుకొని, అజరామరమైన కీర్తిని సంపాదించు కొనెను.
పి. య. రె
గౌతమీ బాలశ్రీ :
శాతవాహన వంశము కేవలము, పరాక్రమవంతులు, ధర్మపరాయణులైన రాజులచేతనే గాక, అహింసా niరతలు, సత్యవచస్కలు, దానక్షమాన్వితులు ఐన రాణుల చేతను గూడ పవిత్ర మొనర్పబడినది. శాతవాహన వంశమును పునీతముచేసిన రాణులలో "గౌతమీ బాలశ్రీ" మిక్కిలి ఎన్నదగినది. ఈమె శివస్వాతి మహారాజుభార్య అనితెలియుచున్నది. గౌతమీపుత్ర శాతకర్ణితల్లి, వాసిష్ఠీపుత్త్ర పులోమావి పితామహి. ఈమె జన్మము పావనతమ మైనది. రాజర్షి పత్నీపదమునకు తగిన గుణ విశేషములను కలిగిన ఈ గౌతమీ బాలశ్రీ, లోకోత్తర చరితుడైన కుమారుని పొందినది. పవిత్రము, శుభకరమునై న శీలము కారణముగా ఆమె చిరస్మరణీయ అయ్యెను. శాతవాహన చక్రవర్తులలో తలమానికముగా పరిగణింపబడినట్టి 'గౌతమీపుత్ర శాతకర్ణి' తనపేరునకు ముందు 'గౌతమీ పుత్ర'యని తన మాతృశ్రీ నామధేయమును జతపరుచుటచే శాతవాహనయుగమున అతడు వినూత్నములైన గౌరవ ప్రపత్తులను తల్లికి నొసగు ఆచారమును కల్పించినవా డయ్యెను. ఇది కేవలము శాతకర్ణియొక్క మాతృభక్తి పరాయణతను సూచించుటయేగాక గౌతమీదేవియొక్క సామర్థ్యమును, ఉదాత్తతను, శుభచారిత్రమును గూడ చాటుచున్నది. ఈమె అకుంఠితమైన మాతృ శుశ్రూషా పరాయణుడగు కుమారుని పొందుటచేతనేగాక, తన గురుతరములైన దానధర్మములచేతగూడ చిరస్థాయియైన కీర్తి నార్జించినది. ఈమె, శివస్వాతిమహారాజు కాలమున ప్రసిద్ధి వహించినది. తరువాత కుమారుడును, చక్రవర్తియునగు గౌతమీపుత్ర శాతకర్ణి కాలమునను, పౌత్రుడగు పులోమావి కాలమునను వారితోగలిసి తానుకూడ దానధర్మములను జేయుచు రాజ్యతంత్రమునందు కూడ వారికి తోడ్పడినట్లు తెలియుచున్నది. గౌతమీపుత్రశాతకర్ణి నాసిక శాసనమునుబట్టి “రాజమాతయు, జీవసుతయునగు మహాదేవియొక్క మాటలుగా గోవర్ధనమునం దమాత్యుడగు శ్యామకుని ఆరోగ్యము అడుగ బడుట, తిరణ్హు పర్వతపుగుహలో నివసించు భిక్షువులకు ఉత్తమ క్షేత్రమును దానము చేయుట గౌతమీదేవియొక్క ఉదారతను సూచించును. ఈ దానశాసనము ప్రతీహారియగు 'లోటు'ని చే వ్రాయబడినది. సుజీవిచే అమలు జరుపబడినది.
శ్రీ పులోమావి రాజుయొక్క 19వ రాజ్య సంవత్సరమున గ్రీష్మఋతువు రెండవపక్షమున చేయబడిన దాన శాసనమునందు గౌతమీ బాలశ్రీ మిక్కిలి నుతియింప బడినది. గౌతమి కోరిక పైననే ఈ దానశాసనము వ్రాయించినట్లు కనబడును. అందు "... రాజ రాజును గౌతమీపుత్రుడును, శ్రీ శాతకర్ణియొక్క తల్లియు, సత్యదాన అహింసానిరతయు, తపోదమనియ మోపవాస తత్పరయు, రాజర్షిపత్నికి గల యోగ్యత పూర్తిగ కలదియు అగు మహాదేవి గౌతమీ బాలశ్రీ కైలాస పర్వతముతో సమానమగు తిరణ్హు పర్వతాగ్రమున పవిత్రమైన ధర్మముగా కైలాస సదనమువలె యీ గుహను దొలిపించెను" అని కలదు. దీనిని ఈ మహారాణీ భద్రాయ నీయు లను భిక్షువులయొక్క సంఘము ద్వారమున బుద్ధ నికాయమునకు నిచ్చెను. కేవలము కుమారుడేకాక, పౌత్రుడుకూడ పితామహియగు నీ మహారాణి ప్రియమును, సేవను కాంక్షించి “పిసాజిక పద”మను గ్రామ
497