విజ్ఞానకోశము - 3
గౌతమీ గ్రంథాలయము
కొనుడు" అని బోధించెను. ఇవి బుద్దుని తుది వాక్యములు. ఇట్లు బోధించి అతడు కన్నులు మూసికొనెను. క్రమ క్రమముగా అతని మనస్సు గాఢసమాధి గతమయ్యెను. అనంతరము అతని ఆత్మశరీరమునువీడి ఊర్ధ్వలోకమునకు పోయెను. గౌతమబుద్ధుడు తథాగతుడై నిర్వాణము చెందెను. దీనిని మహాపరినిర్వాణ మందురు. అప్పుడు అతని వయస్సు ఎనుబది సంవత్సరములు. ఈ నిర్వాణకాలము క్రీ. పూ. 483 వ సం. అని చారిత్రకు లంగీకరించిరి. నిర్వాణానంతరము వారముదినముల పిదప బుద్ధుని శరీరమునకు అంత్య సంస్కారములు చేయబడెను. బుద్ధుని చితిభస్మము పదిభాగములుగా చేయబడెను. అది అతడు పర్యటించిన దేశములకు అందజేయబడెను. ఆ బూదిపై స్తూపములు నిర్మింపబడెను.
బుద్ధుని ఉపదేశములు : జ్ఞానోదయమైన పిదప బుద్ధుడు సారనాథమునందు ఉపదేశించిన ఈ క్రింది నాల్గు దివ్య సత్యములే బుద్ధునియొక్క మూలబోధనము లాయెను. (1) ప్రపంచము దుఃఖభూయిష్ఠము. (2) ఈ దుఃఖమునకు కారణముకలదు. (3) దీనిని నివారింపవలెను. (4) ఈ నివారణకు మార్గములు కలవు. జనన మరణములు, జరావ్యాధులు దుఃఖకారణములు. ప్రపంచమున ప్రతి విషయమునకు ఒక కారణము కలదు. ఆ కారణమునకు ఒక ఫలము కలదు. ఈ దుఃఖమునకు గూడ అట్లే కారణము కలదు. దీనికి “తన్హా” (తృష్ణ) అనునది కారణము. జీవింప వలయునను తృష్ణయే మానవుని దుఃఖమునకు కారణమగుచున్నది. ఈ తృష్ణకు అజ్ఞానము కారణము. అజ్ఞానము, తృష్ణ - ఈ రెండును జీవితమును దుఃఖముగా చేయుచున్నవి. ఈ అజ్ఞానమును నిర్మూలించుటకు శీలము, ప్రజ్ఞ అనగా సత్ప్రవర్తనము, సుబుద్ధి అవశ్యములు. దీనికై అష్టాంగసాధనా విధానము జనులు అభ్యసింపవలెను. (1) సుజ్ఞానము, (2) సద్భావన, (8) సువాక్కు, (4) సత్ప్రవర్తనము, (5) సుజీవితము, (6) సత్ప్రయత్నము, (7) సన్మనో నిగ్రహము, (8) సత్ ధ్యానము అనునవి అష్టాంగములు . దివ్యసత్యమును గూర్చిన సరియైన జ్ఞానమే సుజ్ఞానము. లోకులయందు ప్రేమ భావన, ద్వేష రాహిత్యము కలిసి రెండవ సాధనమైన సద్భావనమగుచున్నది. అనుద్వేగ కరమును, సత్యమును, ప్రియమునైన వాక్కు సువాక్కు. అహింసామయ ప్రవర్తనము, ఇంద్రియ లోలత్వ రాహిత్యము వీటి కలయిక సత్ప్రవర్తనమగు చున్నది. నిషిద్ధజీవిత విధానమును త్యజించుట సుజీవితము. దుర్వాంఛాస్థితులు లేకుండుట, ఉన్నచో అట్టివాటిని నిర్మూలించుట, సద్భావనలు కలిగియుండుట, మనస్సును సద్భావనాపూరితము చేయుటకు ప్రయత్నించుట వీటి సమాహారము సత్ప్రయత్నము. సరియైన విధమున మనస్సును నిగ్రహించుట సన్మనో నిగ్రహము. సరియైన విధమున ధ్యానము చేయుట సిద్ధ్యానము. ఈ అష్టాంగ మార్గానుష్ఠానము వలన క్రమముగా అజ్ఞానము, తృష్ణ, దుఃఖము నశించి, పిదప శాశ్వతమైన ఆనందమయమైన నిర్వాణము కలుగును. బుద్ధుడు ఈశ్వరుని గూర్చి ప్రశంస చేయలేదు. ఆత్మనుగూర్చి అచ్చటచ్చట ప్రశంస గావించెను. వేదములందలి కర్మకాండాది విశేషములను అతడు త్రోసి పుచ్చెను. జాతి, మత, వర్ణభేదరహితముగా ఎల్లరును, ఈనిర్వాణమును సాధించుటకు అర్హులని ఆతడుపదేశించెను.
స. శ్రీ. శ.
గౌతమీ గ్రంథాలయము :
గ్రంథాలయములన నెట్టివో జనసామాన్య మెరుగని కాలమది. 1898 వ సంవత్సరమున రాజమహేంద్రవరమున శ్రీ నాళము కృష్ణారావు అను ఒక సంపన్న యువకునకు గ్రంథాలయ స్థాపనోద్దేశము కలిగినది. అతడు కొన్నివందల పుస్తకములతో ఆతని కుటుంబమువారిచే కట్టింపబడిన “నాళమువారిసత్రము”న ఒక గ్రంథాలయమును నెలకొల్పెను. ఆతడును ఆతని ఈడువారును దాని అభివృద్ధికై కృషిచేయదొడగిరి. అప్పటికి దానికెట్టి పేరు పెట్టబడి యుండలేదు. తరువాత కొన్ని నెలలకు దానిని మరియొక ఇంటికి మార్చిరి. శ్రీ కృష్ణారావునకు అప్పటికి ఇరువదియేండ్ల వయస్సు. అతడు శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారికి ముఖ్యులయిన అనుచరులలో ఒకడు. పంతులుగారి ఎడల గల గౌరవము కారణముగా ఆ గ్రంథాలయమునకు 'శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము' అని పేరు పెట్టబడెను. కొంతకాలమునకు ఆ గ్రంథాలయము శ్రీ పంతులుగారిచే స్థాపింపబడిన పురమందిరములోనికి మార్చబడినది. తరువాత 1914 వ సంవత్సరము నుండి గ్రంథాలయము “సర్వజన పుస్తక
493