పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/517

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపాలకృష్ణగోఖలే

సంగ్రహ ఆంధ్ర

తూ. చ. తప్పక గోపమంత్రి కృతి ననుసరించినవేగాని వేరుగావు. గోపన సంస్కృత గ్రంథ వ్యాఖ్యాతగా, ఆంధ్రకవిగా, ప్రఖ్యాత దండనాయకుడుగా పేరొందెను.

ని. శి. సు.


గోపాలకృష్ణగోఖలే :

అకుంఠితమును, నిర్విరామమునైన దేశభక్తి గోపాలకృష్ణగోఖలే యొక్క ముఖ్యగుణము. ఇతడు గాంధి మహాత్మునియొక్క రాజకీయ గురువుగా పేర్కొనబడిన మహావ్యక్తి. సి. వై. చింతామణి, డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, రైట్ ఆనరబుల్ వి.ఎస్. శ్రీనివాసశాస్త్రి ప్రభృతి దేశనాయకు లనేకులు ఇతనిని తమ గురువునుగా పేర్కొని యున్నారు. గోఖలే సర్వతోముఖ ప్రతిభాశాలి. ఇతడు విద్యావేత్తగా, పండితుడుగా, శాసనసభా వ్యవహారదక్షుడుగా, పట్టువిడుపులెరిగిన రాజకీయవేత్తగా, ఆర్థికశాస్త్రవిశారదుడుగా ప్రసిద్ధి నొందెను.

చిత్రము - 121

గోపాలకృష్ణ గోఖలే

గోఖలే 1866 వ సంవత్సరము మే నెల తొమ్మిదవ తేదీయందు కొల్హాపురమునందు ఒక బీద మహారాష్ట్ర కుటుంబమున జన్మించెను. ఇతని చిన్నతనములోనే తండ్రి గతించెను. అందుచేత తన అన్నయొక్క సాహాయ్యముతో ఇతడు విద్యాభ్యాసము చేసెను. ఆరంభదశయందు వీధులందలి లాంతరుల వెలుగులో కూర్చుండి, కష్టించి ఇతడు చదువు కొనెను. బొంబాయిలోని ఎలిఫిన్‌స్టన్ కళాశాలలోను, పూనాయందలి దక్కను కళాశాలయందును, ఇతడు ఉన్నతవిద్య నభ్యసించెను. 1884 లో పట్టభద్రుడయ్యెను. ఇంజనీరింగు, న్యాయశాస్త్రము, ఐ. సి. యస్ మున్నగు పరీక్షలకై యత్నింపుమని శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలను ఇతడు సరకుచేయక ప్రజాసేవనే తన జీవిత లక్ష్యమునుగా చేసికొనెను. ఇతడు నెలకు రు. 75 ల స్వల్పవేతనముగల దక్కను విద్యాసంస్థయందలి సభ్యత్వమును అంగీకరించెను. ఆరంభమున ఉపాధ్యాయుడుగను, పిమ్మట ఫెర్గూసన్ కళాశాలలో ఉపన్యాసకుడుగను, తరువాత ఆ కళాశాలయందే ప్రధానాచార్యుడుగను గోఖలే పనిచేసెను. అపారమైన పాండిత్యమును, అనర్గళ మైన వాగ్దాటియు, ఇతనికి ఆదర్శ ఉపాధ్యాయుడుగా వెలుగొందుటకు దోడ్పడినవి. చరిత్రయు, ఆర్థికశాస్త్రమును, ఇతనికి అభిమాన విషయములు. గోఖలే ఉపాధ్యాయవృత్తియం దుండగనే రెనడేమహాశయుని శుశ్రూష ఇతనికి చేకూరెను. ద్రోణునియొద్ద అర్జునుడువలె ఇతడు మిగులశ్రద్ధతో ఈగురువు నొద్ద అర్థశాస్త్రమును పఠించెను. ప్రజాసేవోద్యమ విషయమున ఇతడు తగు శిక్షణము పొందెను.

1895 లో భారతదేశ పరిపాలనావిధానమునుగూర్చియు, ఆర్థిక సమస్యలను గూర్చియు విచారణ జరుపుటకు వెల్బీ కమీషన్ నియమింపబడినది. ఈ సందర్భమున కమీషనుముందు బొంబాయి రాష్ట్ర సమితివారి ప్రతినిధిగా సాక్ష్య మిచ్చుచు ఇతడు చూపిన తార్కిక ప్రతిభయు విషయ పరిజ్ఞానమును ఆ కమీషనునందలి అధికారులకు ఆశ్చర్యమును, స్వదేశీయులకు ఆనందమును కలుగజేసెను. అప్పటికి ఇతనిప్రాయము 31 సంవత్సరములే. పిమ్మట గోఖలే బొంబాయి రాష్ట్రశాసవసభయందును, సామ్రాజ్య శాసనసభయందును ఆదర్శసభ్యుడుగా నుండి ప్రసిద్ధి నొందెను. విషయ విజ్ఞానమునకును, తర్క ప్రౌఢిమకును మచ్చుతునుకలైన ఈతని ప్రసంగములు ఆనాటి సభ్యుల ప్రశంసలను చూరగొనెను. ఈనాడును అవి శ్రద్ధా గౌరవములతో పఠింపబడుచున్నవి. 1905 వ సం. లో ఇతడు



468