పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/514

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోపమంత్రి నాదిండ్ల

యున్నది. ఇది క్రీ. పూ. మూడవ శతాబ్దమున నిర్మితమైనదని చారిత్రకుల అభిప్రాయము. క్రీ.పూ. రెండవ శతాబ్దమున నీ సంఘారామమున సుయజ్ఞ నాథుడను శ్రమణకుడు బౌద్ధమత ప్రచారము గావించెనని ఇచటి శాసనములనుబట్టి తెలియుచున్నది. ఇపు డిచట ఏకశిలా నిర్మితమైన స్తూపమున్నది. స్తూపముపై నర్ధచంద్రాకారమున నొక హార్మిక, దానిపై ఛత్రాకారమున నొకకప్పు నుండెడివట. అవి ఇపుడు శిథిలమైనవి. బౌద్ధభిక్షువుల నివాసార్థము పరిసరములందు ఆరామములున్నవి. ఈ బౌద్ధ క్షేత్రము హీనయాన బౌద్ధమునకు చెందినదని చరిత్రకారుల యూహ.

7. నిడుదవోలు దుర్గము : వేంగినగరమును రాజధానిగా జేసికొని, తెలుగుదేశమును పాలించిన పూర్వ చాళుక్యరాజుల కాలమున నిడుదవోలు ఒక దుర్గముగా నుండెడిది. క్రీ. శ. 918 వ సంవత్సరమున రాష్ట్రకూటులు ఆంధ్రదేశముపై దండెత్తగా, ఆంధ్రభూపతి చాళుక్య భీముడు నిడుదవోలు దుర్గము నాధారముగా జేసికొని, రాష్ట్రకూటులను పారద్రోలెను. ఇదియే నిరవద్య పురమను నామముతో శాసనములలో కానవచ్చుచున్నది.

పుణ్య క్షేత్రములు : 1. ద్వారకా తిరుమల : ఇది ఏలూరు తాలూకాలో నున్నది. ఇచట కొండమీద వెంకటేశ్వ రాలయము కలదు. దీనికి చిన తిరుపతి యని పేరు.

2. పెనుగొండ : తణుకు తాలూకాలో నున్నది. వైశ్యులకు గొప్ప పుణ్య క్షేత్రము. వైశ్యులకు దేవతయగు కన్యకాపరమేశ్వరి పూర్వము తన్ను తా నిచటనే యగ్నికి యర్పించికొన్నట్లు ఐతిహ్యము గలదు. ఇచట కన్యకాపరమేశ్వరీ ఆలయమున్నది.

3. తడికలపూడి : ఏలూరునకు ఈశాన్యమున 14 మైళ్ల దూరమున నీ గ్రామము గలదు. ఇచ్చట ప్రాచీనకాలపు గంగేశ్వరాలయమున్నది. భీష్ముడు దీనిని నిర్మించెనని వాడుక

ఇవిగాక బలివె, కొండగనిజెర్ల, తేతలి, తీపర్రు, దువ్వ, నత్తారామేశ్వరము, ఆచంట మొదలగు పుణ్యక్షేత్రము లిచట గలవు. ఈ క్షేత్రములందు సంవత్సరమున కొకటి రెండు పర్యాయములు ఉత్సవములు జరుగుచుండును.

ఎం. కు.


గోపమంత్రి – నాదిండ్ల

శ్రీకృష్ణ దేవరాయల కాలమున ప్రఖ్యాతి చెందిన మంత్రి కుటుంబములలో 'నాదిండ్ల' వారి కుటుంబ మొకటి. వీరు ఆర్వేల నియోగిశాఖా బ్రాహ్మణులు. ఆపస్తంబ సూత్రులు, కౌశికగోత్రులు, గుంటూరు మండలమున నర్సారావుపేట కెనిమిది మైళ్ళ దూరమున నున్న 'నాదిండ్ల' అను గ్రామమున నివసించుటచే నీ వంశము వారికా యూరిపేరు ఇంటిపే రయినది.

నాదిండ్ల వంశములో చిట్టి గంగనామాత్యుడను ప్రసిద్ధ రాజకీయవేత్త జనించెను. ఈ చిట్టి గంగనామాత్యుని యొద్దనే సాళ్వ తిమ్మరుసు శుశ్రూషచేసి రాజనీతి విద్యలను గరచెను. చిట్టి గంగనామాత్యుని అన్నగారి పౌత్రుడు తిమ్మనామాత్యుడు ఈ తిమ్మనమంత్రియు, మహామంత్రి తిమ్మరుసును బావమరదు లయిరి. అనగా తిమ్మన సోదరి లక్ష్మమ్మను తిమ్మరుసు వివాహ మాడెను. తిమ్మరుసు సోదరి కృష్ణమాంబను తిమ్మనమంత్రి వివాహమాడెను. కృష్ణమాంబ యొక్క ఒక కొడుకగు అప్పనమంత్రికి (మేనల్లునకు) తిమ్మరుసు తన కూతురగు తిరుమలాంబ నిచ్చి వివాహము చేసెను. మన గోపనమంత్రి కృష్ణమాంబ యొక్క మరియొక కుమారుడు; తిమ్మరుసు మేనల్లుడు. ఈ బాంధవ్యములు ప్రబోధ చంద్రోదయ వ్యాఖ్యయందు స్పష్టముగా వివరింపబడినవి. వీ రందరు మంత్రి, దండనాయకాది పదవులను వహించి ఆంధ్రదేశ చరిత్రలో ప్రసిద్ధిగన్నవారు. సంస్కృతాంధ్ర భాషలయందు నిస్తుల పాండిత్యవిలసితులు, వితరణశీలురు.

గోపమంత్రి తొలుత క్రీ. శ.1510 ప్రాంతములో నేటి అనంతపుర మండలమున గల గుత్తిదుర్గ పరిపాలకుడుగా నుండెను. శ్రీకృష్ణదేవరాయలు కొండవీటి దుర్గమును క్రీ. శ. 1515 లో జయించి అచ్చట పాలకులుగా నున్న గజపతులను తరిమివేసెను. అప్పుడు రాజకార్య సంసిద్ధికొరకు దక్షుడైన గోపమంత్రి కొండవీటి దుర్గాధిపతిగా నియమితు డయ్యెను. గోపనమంత్రి క్రీ. శ. 1520 నుండి 1533 వరకు కొండవీటిసీమను దక్షతతో పాలించెను.

మంత్రిత్వము : ఒకప్రక్క రాచకార్యములను దిద్దుకొనుచు, మరియొకప్రక్క సాహిత్య కార్యకలాపములనుగూడ గోపనమంత్రి చూచుకొనుచుండెను. రాజ్య

465