పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/508

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోదావరిజిల్లా (పశ్చిమ)

ర్భమున రాజమహేంద్రవరములో 12 సంవత్సరముల కొకతూరి గోదావరీ పుష్కరము పేరిట బ్రహ్మాండమగు ఉత్సవము 12 దినములు జరుగును. రాజోలు తాలూకాలోని ఆదుఱ్ఱు గ్రామమున బౌద్ధస్తూపములు కలవు.

ఇతరములు: గోదావరి నాశ్రయించుకొని యున్న దగుటచే నీ జిల్లా అన్నివిధముల యభివృద్ధిగాంచియున్నది. పాడిపంటలకు లోటులేనిదైయుండుటయేగాక సాంస్కృతికముగా కూడ ముందంజవేసినది. నన్నయ, పండిత రాయలు, వీరేశలింగము మొదలగు విద్వదవతంసులకును, వేద వేదాంగ పండిత ప్రకాండులకును ఈ జిల్లా నెలవై యున్నది.

భాషలు: జిల్లాలో తెనుగే ప్రధానముగా మాట్లాడు భాష. అయినను ఇతర భాషలు మాట్లాడువారు కూడ నీ దిగువ విధముగా కలరు:

ఈ జిల్లాలో 35 మాతృభాషలు గలవారున్నారు.

తెలుగు మాతృభాషగా కలవారు 23,38,459 మంది
కోయభాష మాతృభాషగా కలవారు 44,749 మంది
ఉర్దూభాష మాతృభాషగా కలవారు 21,870 మంది
తమిళము మాతృభాషగా కలవారు 1,977 మంది
ఓడ్రము మాతృభాషగా కలవారు 2,011 మంది
హిందీ మాతృభాషగా కలవారు 991 మంది
హిందూస్థానీ మాతృభాషగా కలవారు 658 మంది
ఇంగ్లీషు మాతృభాషగా కలవారు 617 మంది
మలయాళము మాతృభాషగా కలవారు 508 మంది
కన్నడము మాతృభాషగా కలవారు 435 మంది
మరాటీ మాతృభాషగా కలవారు 366 మంది
ఇతర భాషలు మాతృభాషగా కలవారు (24) 2,167
మొత్తం 24,14,808 మంది

మతములు :

హిందువులు 23,33,448 మంది
జైనులు 286 మంది
బౌద్ధులు 17 మంది
మహమ్మదీయులు 33,577 మంది
క్రైస్తవులు 27,390 మంది
ఇతరులు 20,090 మంది
మొత్తం 24,14,808 మంది

చరిత్ర : ఈ జిల్లాను శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, కళింగులు, చాళుక్యులు పదునొకండవ శతాబ్దము వరకును ఏలిరి. అమలాపురము, రాజోలుతాలూకాలను కోనవంశమునకు చెందిన రాజులు పండ్రెండవ శతాబ్దము వరకు నేలియుండుటచే నీ ప్రాంతమునకు కోనసీమ యను వ్యవహార మేర్పడెను. 1300 సం. ప్రాంతమున ఓరుగంటి కాకతీయ రాజులును, అటుపిమ్మట 1450 ప్రాంతమువరకు కోరుకొండ, కొండవీటి రెడ్లును తూర్పు గోదావరి జిల్లాపై నధికారమును నెరపిరి. రెడ్డిరాజుల కవియగు శ్రీనాథుని గ్రంథములవలన ఆనాటి యచటి పరిస్థితులు కొన్ని తెలియగలవు. 1515 ప్రాంతమున శ్రీకృష్ణదేవరాయలు విశాఖపట్టణము వరకు జయించి నపుడు ఈ జిల్లాగూడ రాయల యేలుబడిలో చేరెను. విజయనగర రాజ్యపతనానంతరము 1571 లో గోదావరి జిల్లా గోలకొండసుల్తానుల పాలనములో చేరెను. 1687లో ఔరంగజేబు దక్కనును జయించుటతో నిదియు మొగలాయి పాలనములో చేరెను. గోలకొండ సుల్తానులు మొగలాయి రాజ్యపు సుబేదారులు. వీరి ఏలుబడిలో తూర్పుగోదావరి జిల్లా చాలభాగములను పెద్దాపురము, పిఠాపురము, తుని, కిర్లంపూడి మున్నగు సంస్థానములు 3 శతాబ్దములు పాలించి ఈ జిల్లా చరిత్రను తీర్చిదిద్దినవి. 1748 తరువాత నైజాము అనుమతిన తూర్పు ఇండియా కంపెనీవారు ఈ జిల్లాయందు స్థిరపడిపోయిరి. 1825 నాటికి ఫ్రెంచివారు, డచ్చివారు పూర్తిగా వెడలింపబడి జిల్లాయంతయు ఆంగ్లేయుల వశమయ్యెను.

పు. ప. శా.


గోదావరిజిల్లా (పశ్చిమ) :

ఉనికి : పశ్చిమ గోదావరిజిల్లా 16° - 15' - 17° - 30' ఉత్తర అక్షాంశరేఖల మధ్యను, 80° 51' 81° 55' తూర్పు రేఖాంశముల మధ్యను ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశమునందలి తీరప్రాంతపు జిల్లాలలో నొకటియైయున్నది. 1925 వ సంవత్సరమున ఈ జిల్లా పూర్వపు కృష్ణాజిల్లా నుండి వేరుపరుప బడినది. ఏజెన్సీ తాలూకా యగు పోలవరము 1942 లో తూర్పుగోదావరి జిల్లానుండి దీనిలోనికి చేర్చబడినది. దీనికి బంగాళాఖాతమును, కృష్ణాజిల్లా భాగ

459