పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/505

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోదావరిజిల్లా (తూర్పు)

సంగ్రహ ఆంధ్ర

కాకినాడ తాలూకాలగుండా ప్రవహించి సముద్రములో చేరును. ఈ నదిని సేద్యమున కుపయుక్తముగా చేయ వలెనన్న ప్రయత్నములు సాగుచున్నవి. అవి ఫలించినచో మెట్టతాలూకాల కెక్కుడు లాభించగలదు.

అరణ్యములు : ఈ జిల్లాలో 1,880.48 చ. మైళ్ళ రిజర్వుడు అడవులు, 85.33 చ. మైళ్ళ తీసికొనబడిన ఎస్టేటు అడవులు, 23.30 తీసికొనబడని ఎస్టేటు అడవులు మొత్తము 1,989.11 చ. మైళ్ళ అడవులు కలవు.

శీతోష్ణస్థితి, వర్షపాతము : జిల్లాకంతకు ఏప్రిల్, మే, జూన్ నెలలు వేసవిగను; జులై, ఆగస్టు, సెప్టెంబరునెలలు నైరృతి ఋతుపవనములచే వర్షముకురియు వర్షాకాలముగను; అక్టోబరు, నవంబరు నెలలు ఈశాన్య ఋతుపవనములచే వర్షములు కురియు ఋతువుగను; మిగిలిన డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు శీత కాలముగను ఉండును. సాధారణముగా వాయవ్య ఋతుపవనములవలననే అధిక వర్షము కురియుచున్నను, తూర్పుతీరమందు ఈశాన్య ఋతుపవనములు కూడ ఎక్కువ వర్షము నిచ్చుచున్నవి. ఈ రెండవ వర్ష ఋతువునందు అప్పుడప్పుడు గాలివానలు వచ్చుచు, తీరప్రాంతమందు విస్తారమగు నష్టమును కలిగించుచుండును. జిల్లా యందలి సగటు వర్షపాతము 45.24 అంగుళములు, వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత భద్రాచల ప్రాంతమందుండును. అచట సుమారు 50°C వరకు ఉష్ణాధిక్యము కనబడుచుండును. జిల్లాలోని తీరప్రాంతమందు సముద్రప్రభావ మధికముగా నుండుటచే వేసవి యందు అధికమగు ఉష్ణముగాని, శీతకాలమందు మిక్కిలి చలిగాని లేకుండ సమశీతోష్ణమై మంచి వాసయోగ్యముగా నుండును. సతత హరితములగు ఫలవృక్షముల తోటలు, పైరులు, అడవులు కూడ ఇందుకు తోడ్పడుచున్నవి.

నేలలో నధిక భాగము డెల్టాకు సంబంధించిన సారవంతమగు ఒండ్రుమట్టితో నిండియున్నది. మన్యపు ప్రాంత మందును, మెట్టతాలూకాలలోను రేగడి నేలలు కలవు. ఇవియు సారవంతమైన భూములే.

నేలల రకముల వివరము: డెల్టాభూమి 3,60,000 ఎకరములు, అభివృద్ధికి తేబడిన భూమి 700 ఎకరములు, నల్ల రేగడిభూమి 63,000 ఎకరములు, ఎఱ్ఱరేగడినేల 2,51,500 ఎకరములు, ఇసుక నేల 46,200 ఎకరములు .

నీటిపారుదల : ధవళేశ్వరము వద్ద 1852 లో సర్ ఆర్థర్ కాటన్ అను మహాశయునిచే ఆనకట్ట నిర్మింపబడెను. దానినుండి అనేకములగు కాలువలు ఇరువైపుల త్రవ్వబడెను. ఎడమవైపు కాలువ లి జిల్లాకు పుష్కలముగా నీటిని అందజేయు చున్నవి. వాటి ద్వారమున రాజమహేంద్రవరము, కాకినాడ, రామచంద్రపురము, అమలాపురము, రాజోలు తాలూకాల భూములు సేవ్యము చేయబడుచున్నవి. రాజోలు తాలూకా గన్నవరము వద్ద గోదావరి కాలువను వైనతేయనది మీదుగా దాటించుటకై గొప్ప అక్విడక్టు నిర్మింపబడెను. గోదావరి కాలువలక్రింద సుమారు 9 లక్షల యెకరముల భూమి సేవ్యము చేయబడుచున్నది. ఈ కాలువలలో సంవత్సర మంతయు నీరుండుటచే రెండవ పంటకుకూడ నీరు లభించి ఎల్లప్పుడును భూములు పైరులతో నిండియుండును. ఇదియే యీ జిల్లాలోని ప్రధానమగు నీటి సౌకర్యము. రెండవది ఏలేరునది. దీని క్రింద 17 వేల ఎకరములకు పైగా సేవ్యమగుచున్నది. ఈ నదికి సరియైన జలాశయము నిర్మించి యింకెక్కువ నీటివనరును మెట్టతాలూకాలకు కల్పించవలెనను పథకములు ప్రభుత్వ దృష్టిలో కలవు. ఇవిగాక చెరువులు, వాగులు, బుగ్గబావులుకూడ సేవ్యమునకై ఉపయోగపడుచున్నవి. జిల్లాలలో మొత్తము 1052 చిన్న నీటి వనర్లు కలవు. వాటి క్రింద 37,260 ఎకరములు భూమి సాగు అగుచున్నది. పెద్ద నీటి వనరుల క్రింద 4,28,673 ఎకరములు భూమి సాగు అగు చున్నది.

పంటలు : తూర్పు గోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ మందలి అన్నిజిల్లాలలోను పంటల విషయమున అగ్రస్థానమును వహించుచున్నదనవచ్చును. గోదావరీమతల్లి చలువ వలన నదియొక్క డెల్డా భాగమంతయు సారవంతమగు భూమి కలిగియుండుటయేగాక సంవత్సరము పొడుగున నీటి కొరతలేని కారణమున రెండు ఋతువులలో వరి, చెఱకు విస్తారముగా పండును. చోడులు, రాగులు, వేరుసెనగ, నువ్వులు, ప్రత్తి, పొగాకు — ఇతర పంటలు. ఇవిగాక మామిడితోటలు, కొబ్బరితోటలు, అరటితోటలు, పోకతోటలు, జీడిమామిడి తోటలు ఈ జిల్లాయం దధికముగా నున్నవి.

456