పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/502

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోదావరిజిల్లా (తూర్పు)

నుండి 47 నుండి 79 మైళ్ళ దూరమునగల పంట భూములకు గూడ ఈ కాలువనీరు సరఫరా కాగలదు. ఇదియే కాక, ఈ రిజర్వాయరుక్రింద ఇదివరకే స్వతస్సిద్ధముగా నున్న జలముతో 65,000 ఎకరముల భూమి తడుపబడు చుండుటచేత, మొత్తముమీద నీటినిపొందు భూమి 1,89,000 ఎక రము లగుచున్నది.

(3) 'గోదావరి సౌత్ కెనాల్' (గోదావరి దక్షిణపు కాలువ) అను పేరుతో 251 మైళ్ళు నిడివిగల కుడి పార్శ్వపు కాలువను నిర్మించుటకుగూడ పథకము నిర్ణయింపబడెను. ఈ కాలువ నిజామాబాదు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని 18,06.000 ఎకరముల పంటభూమిని సాగు చేయుటకై 17,240 క్యూసెక్కుల నీటిని విడుదల చేయునట్లు ఏర్పాటు గావింపబడెను. ఈ కాలువకు చెందిన ముఖ్యమైనశాఖలలో నొకటి కరీంనగరముజిల్లాలో విద్యుదుత్పాదకశాఖగా నుండి మొత్తము మీద 290 అడుగుల ఎత్తుగల మూడు జలపాతములు కలిగి, 20,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని జనింపజేయునదిగా నుండగలదు. 'మోరువంచశాఖ' అను మరియొక కాలువ, గోదావరి కృష్ణా లోయలను విడదీయు గట్టుల వరుసగుండ ప్రవహించుచు, కేవలము భూమిని సాగుచేయుటకు వలసిననీటిని మాత్రమే సరఫరా చేయును. ఈ కాలువ ద్వారా 2.68,000 ఎకరముల భూమిని సేద్యము చేయుటకు చాలిన 2473 క్యూసెక్కుల నీరు విడుదల చేయబడును. మొత్తముమీద ఈ కాలువక్రింద 7,91,450 ఎకరముల భూమి సేద్యముకాగలదు.

మధ్యరకపుప్రాజెక్టు: మూడుసంవత్సరములలో పూర్తిచేసి ఫలితములను పొందగలిగిన మధ్యరకపు ప్రాజెక్టులకు గోదావరీనదీజలము ఉపయోగపడునట్లు పథకమును నిర్ణయించుట యే ఇప్పటి సూచనల యుద్దేశము. ఈ సూచన లీ క్రిందివిధముగా నుండును :

(1) 2,500 అడుగుల నిడివిగల సిమెంటు కాంక్రీటు ఆనకట్టను (masonry weir) నదీ గర్భములో నిర్మించి, నీటి ప్రవాహమును కాలువలోనికి మరలించుటకై తెరచుటకును, మూయుటకును వీలయిన 6 అడుగుల నమూనా తలుపులను (6 ft lift-type collapsible shutters) అమర్చవలెను.

(2) 'పోచంపాడు దక్షిణపు కాలువ' అను 68 మైళ్ళ నిడివిగల కుడి పార్శ్వపు కాలువను నిర్మించి నిజామాబాదు, కరీంనగరం జిల్లాలలోని 3,60,000 ఎకరముల భూమిని సాగుచేయుటకు చాలినంతగా, 4260 క్యూసెక్కుల నీటిని విడుదల చేయవలెను.

కె. సో.


గోదావరిజిల్లా (తూర్పు) :

ఉనికి : తూర్పు గోదావరిజిల్లా ఆంధ్రప్రదేశములో కోస్తా జిల్లాలు లేక సర్కారు జిల్లాలు అనబడు భాగములో చేరియున్నది. ఇది భారతదేశము యొక్క తూర్పుతీరమందు బంగాళాఖాతము నంటి 16°30' – 18°30' తూర్పు అక్షాంశముల మధ్యను, 80025' - 82035' తూర్పు రేఖాంశ వృత్తముల మధ్యను వ్యాపించి యున్నది. ఈ జిల్లాకు ఉత్తరమున విశాఖపట్టణము జిల్లాయు ఒరిస్సా, మధ్యప్రదేశ రాష్ట్రములును, తూర్పు, దక్షిణములందు బంగాళాఖాతమును, పశ్చిమమున పశ్చిమ గోదావరి జిల్లాయు ఖమ్మం మెట్టు జిల్లాయు సరిహద్దులుగా కలవు. జిల్లాకంతకు దక్షిణ పశ్చిమములందు గోదావరీనది సరిహద్దుగా నున్నది. ఆ నది వెంట నీ జిల్లా పొడవుగా నుండును. 1951 లెక్కల ననుసరించి ఈ జిల్లాకు సంబంధించిన వివరము లీ దిగువ విధముగా నుండును.

జిల్లా విస్తీర్ణము 5,682 చ. మైళ్లు; గ్రామములు 1816; పురములు 20; ఇండ్లు 4,36,570; జనాభా 2.414,808; పురుషుల సంఖ్య 12,06,483; స్త్రీల సంఖ్య 12,08, 325; జనసాంద్రత 425.

5 రెవెన్యూ డివిజనులలో 12 తాలూకాలు కలవు. (1) భద్రాచలము డివిజను దీనియందు భద్రాచలము, నూగూరు తాలూకాలు కలవు. (2) రాజమహేంద్రవరము డివిజను—దీనియందు రాజమహేంద్రవరము, రామచంద్రపురము, రంపచోడవరము తాలూకాలు కలవు. (3) పెద్దాపురము డివిజను - దీనియందు పెద్దాపురము, తుని, పిఠాపురము, ఎల్లవరము తాలూకాలు కలవు. (4) అమలాపురము డివిజను - దీనియందు అమలాపురము, రాజోలు తాలూకాలు కలవు. (5) కాకినాడ డివిజను- దీనియందు కాకినాడ తాలూకా మాత్రమే కలదు. ఈ జిల్లాయందలి 12 తాలూకాల వివరము లీ దిగువ నీయబడినవి :

453