పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/501

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోదావరినది - 2

సంగ్రహ ఆంధ్ర

నిర్మాణమునకై వెచ్చించిన పెట్టుబడిఖర్చు సుమారు 2.20 కోట్లరూపాయలు. ఇదెంతో ప్రయోజనకరమయిన ప్రాజెక్టు. దీనివలన మొదటి పంటక్రింద 8,80,500 ఎకరముల భూమి సాగుచేయబడుచున్నది. రెండవ పంటక్రింద 2,50,000 ఎకరముల భూమిసాగగుచున్నది. దీనికితోడుగా గోదావరి కాలువలు ఏడాదిలో పదకొండు మాసములు ప్రవహించుచుండుటచే, సంవత్సరమునకు 27 కోట్ల రూపాయల విలువగల వ్యాపారము జరుగుటకు ఇవి రవాణా సౌకర్యములు కలిగించుచున్నవి.

గోదావరియొక్క ప్రధానమైన ఉపనదు లన్నిటిలో 'మంజీర' మిక్కిలి గొప్పది. ఈ మంజీర నదికి అడ్డముగ హైదరాబాదు ప్రభుత్వమువారు నిర్మించిన నిజాంసాగరు ప్రాజెక్టు ప్రప్రథమమైనదేగాక, ఆనకట్టలలో ఇది బ్రహ్మాండమైనదిగా నున్నది. ప్రస్తుతము నిర్మాణమందున్న ప్రాజెక్టుల యొక్కయు, నిర్మాణము చేయదలచిన ప్రాజెక్టుల యొక్కయు వివరములు ఈ క్రింద పేర్కొనబడినవి :

వరుస సంఖ్య ప్రాజెక్టు పేరు ఎకరములు లక్షల సంఖ్యలో వినియోగము వేల మిలియన్లలో
ఎ. నిర్మాణములోనున్న ప్రాజెక్టులు :
1. గంగాపూర్ ప్రాజెక్టు 0.50 7.00
2. పూర్ణా ప్రాజెక్టు 1.55 30.00
బి. నిర్మింపదలచుకొన్న ప్రాజెక్టులు:
1. మధ్యరకపు పోచంపాడు ప్రాజెక్టు 3.60 -
2. ప్రవరబేసిన్ :
(ఎ) మూలప్రాజెక్టు 1.30 27.00
(బి) హీరంగాన్ పికప్ వేర్ 0.10 2.00
3. పూర్ణాబేసిన్ 0.80 11.00
4. మంజీర (రెండుస్కీములు) 0.10 2.00
5. సింధుఫానా (5 స్కీములు) 0.70 10.00
6. శివానాబేసిన్ (5 స్కీములు) 0.30 5.00
7. గోదావరి జయకావాడి 4.50 70.00
మొత్తము 11.40

ఇవిగాక గోదావరి నదిమీద రామపాదసాగర్, ఇచ్చం పెల్లి ప్రాజెక్టులు నిర్మింపవలెనని ఇప్పటికిని ప్రభుత్వ మాలోచించుచున్నది.

పోచంపాడు ప్రాజెక్టు : ఆంధ్రదేశమున తెలంగాణము వెనుకబడిన ప్రాంతముగ నెంచబడుచున్నది. ఈప్రాంతము యొక్క అభివృద్ధి నిమిత్తమై పోచంపాడుగ్రామ సమీపముననున్న గోదావరి నదీజలములలో అధికభాగము వినియోగింపవచ్చును. ఈ ప్రాంతము, 'హైద రాబాదు - నాగపూరు నేషనల్ హైవే (జాతీయ రహదారి) మీద నది ఎగువన సోన్ బ్రిడ్జికి మూడుమైళ్లదూరములో నున్నది. ఈ స్థలమువరకుగల ఆరగాణి విస్తీర్ణము 35,425 చ. మైళ్లు. ఇచ్చట ఏడాదికి 500 వేల మిలియనుల ఘ. అడుగుల గోదావరీజలము లభ్యము కాగలదు. నిర్మాణదశయందున్న ఎగువప్రాజెక్టుల మూలమునను, నిర్మాణము చేయదలచిన ప్రాజెక్టుల మూలమునను, ప్రస్తుతము 269 వేల మిలియనుల ఘ. అడుగుల నీరుమాత్రము లభ్యము కాగలదు.

పూర్తి స్కీము : పోచంపాడు ప్రదేశమున ఆనకట్ట నిర్మించు నవకాశములను గూర్చియు నీటిపారుదలకును విద్యు దుత్పాదకమునకును ఇరుప్రక్కల కాలువలు త్రవ్వించు నవకాశములనుగూర్చియు ఇటీవలనే పరిశోధనలు జరుపబడినవి. పరిశోధకుల సూచన లీ క్రింద పొందు పరచబడినవి :

(1) పోచంపాడువద్ద నిర్ణీతమయిన స్థలములో గోదావరి నదీగర్భమున అదనపునీరు బయటికి పొర్లిపోయెడు కట్టడమును (మేసన్రీ స్పిల్ వే సెక్షన్) నిర్మించి, నదికి ఇరుప్రక్కల ఎత్తయిన మట్టికట్టలు నిర్మించుట; ఆనకట్టల సమీపమున నదికి ఇరువైపుల 60,000 కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల 'పవర్ హౌస్ 'ను నిర్మించుట.

(2) 'గోదావరి నార్త్ కెనాల్' (గోదావరి ఉత్తరపు కాలువ) అను పేరుతో ఒక ఎడమఒడ్డు కాల్వను త్రవ్వుట; ఈ కాలువ 27,000 కిలోవాట్లవిద్యుచ్ఛక్తిని 75 శాతము 'లోడ్ ఫాక్టరు' చొప్పున (at 75% load factor) ఉత్పత్తి చేయగలిగి, 21,000 ఎకరముల భూమిని సాగుచేయగల 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలిగి యుండగలదు. దీనికి తోడుగా అది అంత్యభాగమున (in the tail reach) 1,03,000 ఎకరముల భూమికి నీటిపారుదలను కల్పింపగలదు. అనగా, కదమ్ రిజర్వాయరుయొక్క ఎడమపార్శ్వమునుండి త్రవ్వబడిన కాలువ

452