విజ్ఞానకోశము - 3
గోదావరినది -2
రాజమహేంద్రవరమునకు 20 మైళ్ళ దూరములో నదికి ఎగువన పోలవరము వద్ద 'రామపాదసాగర్' అను ఒక ఆనకట్ట నిర్మింపవలెనని సుమారు 10 సంవత్సరముల క్రిందట కొంతప్రయత్నము జరిగినది. దానిక్రింద సుమారు 10 లక్షల ఎకరముల భూమి సాగుచేయబడగలదని ఇంజనీర్లు అంచనా వేసిరి. ప్రాజెక్టు నిర్మాణమునకు ముందు కొన్ని పరిశోధనలు జరుపగా 2,000 అడుగుల లోతువరకు అడుగున రాతినేల లేదని తేలినది. అంత లోతువరకు పునాదులు తీసికట్టుటకు కోట్లకొలది రూపాయలు ఖర్చుచేయ వలసి యుండునని ఈ రామపాదసాగర్ ప్రాజెక్టును కట్టు నుద్దేశము పూర్తిగా మార్చుకొనబడినది.
క్రొత్త ప్రాజెక్టు పోలవరమువద్ద కాక ఇప్పూరు అను మరియొక చోట కట్టుటకు రెండు, మూడు సంవత్సరముల నుండి కొన్ని పరిశోధనలు జరుపుచున్నారు. ఇక్కడ రాతినేల 50-60 అడుగుల లోతుననేకలదు. ఇక్కడ ఒక ఆనకట్టయును, పోలవరమువద్ద ఒక బేరేజియు కట్టవలెనని ప్రభుత్వమువారికి సంకల్పముకలదు. పోలవరము వద్ద కట్టబోవు బేరేజినుండి కాలువలు పోవును. ఈ ప్రాజెక్టు కట్టినను నూటికి ముప్పదివంతులు నీరు మాత్రమే వినియోగింప బడును.
గోదావరీ నదీద్వారమునను, దాని కాలువల ద్వారమునను, సగటున సంవత్సరమునకు 2 కోట్లరూపాయల విలువ కలిగిన సరకులును, 2 కోట్లరూపాయల విలువ కలిగిన కలపయు రవాణా అగుచున్నవి.
గోదావరీ నదియొక్క పరివాహ ప్రాంతమున బొగ్గు విస్తారముగా దొరకుచున్నది. అదికాక యీ ప్రాంత మంతయు దట్టమైన అడవులతో నిండిఉన్నది. క్రొత్తగా నిర్మింపనున్న ప్రాజెక్టులనుండి జలవిద్యుచ్ఛక్తి లభించును. ఈ విద్యుచ్ఛక్తిని ఈ ప్రాంతమున లభ్యమగు ఖనిజములను, అటవీ సంపదను వినియోగించి అనేక పరిశ్రమలు నెలకొల్పవచ్చును. మెట్టభూములను సాగుచేయుటకును, నీటిని పంపులమూలమున సరఫరా చేయుటకును ఈ విద్యుచ్ఛక్తి ఉపయోగపడును. నూటికి 93 వంతులు వృథా అగుచున్న గోదావరి నీటిని క్రొత్త ప్రాజెక్టులు కట్టి ఎంతేని వినియోగించుకొనవచ్చును.
వి. వి.
— ఆంధ్రభూభువన మధ్యమున గోదావరినదీశాఖాతీరము నంటియున్న భీమమండలీ క్షేత్రము పరమపవిత్రము, సకల దేవతానిలయము, వివిధ సస్యారామ సమృద్ధమునగు దేశము. భీమమండల మనగా దక్షారామ భీమేశ్వరుడు నెలకొనియున్న తావునుండి చుట్టును ఇరువదినాలుగు మైళ్ళ దూరమునందున్న ప్రదేశము. ఈ మండలమునకు తూర్పున భైరవపాళెపు సముద్రము, దక్షిణమున అంత ర్వేదిపుణ్య క్షేత్రము, పశ్చిమమున రాజమహేంద్రవరము, ఉత్తరమున పిఠాపురము సీమలుగా నున్నవి. రాజమహేంద్రవరమునకు రెండుకోసులు క్రిందనుండి గోదావరీనది 'గౌతమి' 'వసిష్ఠ' యను పేళ్ళతో రెండుశాఖలుగా విడి ప్రవహింపజొచ్చినది. ఈ గౌతమీ శాఖనుండియే యిటు నటు మరియైదు శాఖలు బయలుదేరినవి. ఇవియన్నియు కాకినాడకు అంతర్వేదికి నడుమ నుండెడి తూర్పుసముద్రములో కలియుచున్నవి. ఆ శాఖలు : 1. తుల్య, 2. ఆత్రేయి, 3. భారద్వాజ, 4. గౌతమి, 5. వృద్ధగౌతమి, 6. కౌశికి, 7. వసిష్ఠ యనునవి యేడు. ప్రధానశాఖలయిన గౌతమీ వసిష్ఠల నడుమ నుండెడి ప్రదేశమును ప్రాచీనకాలమున కోనమండలమనియు, రెండేర్ల నడిమి విషయమనియు వ్యవహరించిరి. ఇపుడా ప్రదేశమును 'కోనసీమ' యని వ్యవహరించు చున్నారు. గౌతమీ శాఖలలో నొకటియగు కౌశికీనదీశాఖ ప్రధానముగ నీ కోనసీమలోని ప్రతి గ్రామమును జుట్టి ప్రవహించినది. ఈ కౌశికిశాఖకు ప్రారంభము 'పలివెల' కొక క్రోసు మేర పయిన 'మందపల్లి ' యను క్షేత్రమునుండి మొదలిడినది. ఈ శాఖాతీరమున ప్రసిద్ధములైన ఈశ్వరమూర్తులు, అగస్త్యప్రతిష్ఠితులైన మందేశ్వర కొప్పులింగేశ్వరులు, వ్యాఘ్రేశ్వరుడు, ఈ నదీశాఖ సముద్రమున గలిసిన విష్ణు సంవేద్యమున రామలింగేశ్వర లక్ష్మణేశ్వరులును గలరు.
చి. పా. శా.
గోదావరినది - 2:
నీటిపారుదల: విద్యుదుత్పాదక పాటవములు: భారత దేశముయొక్క భవిష్యదభివృద్ధికై అనుసంధింపవలసి యున్న నదీజలములు మనదేశములో ఇంకను పుష్కలముగా గలవు. నీటిపారుదలకు ఉపయోగపడు నదీ జలముల పరిమాణమును శాతరూపములో లెక్కించి ఉదహ
449