విజ్ఞానకోశము - 3
గోదావరినది -1
ఇట్లీ పదార్థములన్నింటిని పేరు పేరున బేర్కొనుటయు (ఉద్దేశము), వానిని లక్షించుటయు మొదటి అధ్యాయములో మొదటి ఆహ్నికముననైనవి. వాని పరీక్షణము, తరువాత ఆరంభింపబడినది. ఈ శాస్త్రమును, ఈ యుద్దేశ లక్షణ పరీక్షలను ఈతీరున (పృథక్ప్రస్థానమున ప్రవర్తింప జేసి కడమవానికన్న విలక్షణముగా గోతముడు రచించినాడు.
రెండవ అధ్యాయపు మొదటి ఆహ్నికములో అసలు పరీక్షకు అంగమైన సంశయము పరీక్షింపబడినది. దాని వ్యవస్థకు అనుగుణముగా విప్రతిపత్తి వాక్యమును వాదమునకు పూర్వాంగముగా గోతముడు స్థాపించెను. ప్రత్యక్షాదుల ప్రామాణ్యమును, వాని బలాబల తారతమ్యమును పరీక్షించెను. రెండవ దానిలో ప్రమాణములు నాలుగే అని (మతాంతరవాదములను ఉన్మూలించి) స్థాపించెను. అందులోని శబ్దము అనిత్యమే అని స్థాపించి, దాని శక్తినిగూర్చి ఆహ్నికము చివరవరకును గోతముడు విచారించెను.
మూడవ అధ్యాయపు మొదటి ఆహ్నికములో దర్శన, స్పర్శనములచే ఒకే వస్తువును గ్రహించుటవలన ఇంద్రియములకు అతిరిక్తుడును, క్షణభంగ మొందని వాడును ఆత్మయని గోతముడు స్థాపించెను. సాత్మకమగు శరీర దాహమున పాపము జనించుటయు, నిరాత్మకమగు శరీర దాహమున అది లేకపోవుటయు లోకవ్యవహారము కనుక శరీరాతిరిక్తుడే ఆత్మయని గోతముడు స్థిరపరచెను. కనులు చెవులు మొదలగునవి రెండేసి యయినను ఇంద్రియ మొక్క టే అనియు, సాధనమగు మనస్సుకన్న కర్తయగు ఆత్మ వేరనియు, అది నిత్యమనియు, శరీర మనిత్యము, పాంచభౌతికమనియు, ఇంద్రియములును అట్టివే అనియు గోతముడు స్థాపించెను. ఉత్పత్తి వినాశములు కలవు. ఈ జ్ఞానము అనిత్యము అది ఆత్మగుణమే కాని, శరీరగుణము కాదు. మన తనువే (శరీరము) కర్మకారితమే కాని, అకర్మ నిమిత్తము కాదు. అని రెండు ఆహ్నికములలో గోతముడు విచారించి స్థాపించెను.
నాల్గవ అధ్యాయమున మొదటి ఆహ్నికములో రాగ ద్వేష మోహములు అను మూడు కారణములవలన మూడు రకముల ప్రవృత్తి కలుగును. శూన్యమునుండి గాని, ఈశ్వరునినుండి గాని, ఆకస్మికముగా గాని ఆత్మ ఏర్పడలేదు. స్వతస్సిద్ధుడే. సర్వమును అనిత్యము కాదు. క్షణికమును కాదు. నిత్యమును కాదు. శూన్యమును కాదు. అపవర్గమున్నది. సంసారము సకల దుఃఖమయము. అందులో ఏక దేశమగు సుఖముగూడ దుఃఖము వంటిదే; ఏ విధమయిన సుఖదుఃఖములును లేశమైన లేకుండుటయే అపవర్గము అని గోతముడు నిరూపించెను.
రెండవ ఆహ్నికములోని విషయములు : దోష నిమిత్తములగు అర్థములను సరిగా తెలియుటవలన అహంకారము నివర్తించును. సావయవులు, నిరవయవులు నగు పదార్థముల స్వరూపము సరిగా తెలిసినచో, వానియందు మమత తొలగును. రాగద్వేషము లుదయింపవు. ప్రవృత్తి గలుగదు. ఇక జన్మాది ప్రసంగమే యుండదు! కనుక ఇట్లు మోక్షము సిద్ధించును. బాహ్యార్థము లేదనరాదు. ఉన్నది. ఆయా వాని పరిజ్ఞానమువలన అహంకారము తొలగును. తత్త్వజ్ఞానము వృద్ధియగును. అని గోతముడు విశదపరచెను.
అయిదవ అధ్యాయములో జాతి నిగ్రహస్థానములు విచారింపబడినవి. ఇట్లు అయిదధ్యాయము లందును, షోడశ పదార్థముల నుద్దేశించి, పరీక్షించి, న్యాయము ద్వారా తత్త్వవిజ్ఞానమున మిథ్యాజ్ఞానమును తొలగించి, ఆ క్రమమున నిశ్శ్రేయసము నధిగమింపజేయు న్యాయ దర్శనమును రచించినది అక్షపాద గోతముడే.
వే. తి.
గోదావరినది - 1
గోదావరి దక్షిణ హిందూదేశములోని నదులన్నింటి కంటె చాలా పెద్దది. భారత దేశములోనెల్ల పెద్దదైన గంగానది తరువాత ఈనదియే చెప్పదగినది. గోదావరిని కూడ గంగవలెనే ప్రజలు చాల పవిత్రమైనదానినిగా ఎంచుదురు. దీనిలో స్నానముచేయుటకు ప్రజలు అనేక ప్రాంతములనుండి వచ్చుచుందురు. గంగా యమునా సరస్వతులతో పాటు గోదావరికూడ రామాయణములో అనేకచోట్ల పేర్కొనబడినది. ఈ నదీతీరమునను, తత్పరి సరపు అడవులయందును ఘటిల్లిన అనేక విశేషములు ఆ గ్రంథమున వివరింపబడినవి.
ఈనది పడమటి కనుమలలో బొంబాయికి ఈశాన్య
447