విజ్ఞానకోశము - 3
గొప్ప గ్రంథాలయములు
డగు నెల్యూస్ ఆ గ్రంథాలయమును పెప్సిన్ అనుచోట భూమిలో పాతి భద్రపరచెను. ఈ గ్రంథాలయమునే టాలమీ ఫిలడెల్ఫస్ అనునతడు కొనెను. 'స్ట్రాబో' అంచనా ప్రకారము గ్రంథాలయ స్థాపనకు అరిస్టాటిల్ ప్రథముడు. అతడే ఈజిప్టు ప్రభువులకు అట్టి అభిరుచిని కలిగించెను. గ్రంథ సేకరణమును ప్రారంభించుటలో టాలమీ సోటర్ ప్రథముడై యున్నను, టాలమీ ఫిలడెల్ఫసు యొక్క గ్రంథాలయములు సువ్యవస్థితములై వేర్వేరు భవనములయం దుండెను. రాజధాని యగు అలెగ్జాండ్రియాకు పండితులు, శాస్త్రజ్ఞులు ఆకర్షింపబడిరి. ఉత్తమ గ్రంథ సేకరణకై టాలమీ ఫిలడెల్ఫసు గ్రీసు, ఆసియాలలోని ప్రతి మారుమూలకును తగినవారిని పంపెను. ఆతని తరువాతివాడగు టాలమీ యూర్గటెస్ ఈజిప్టునకు వచ్చిన విదేశీయుల పుస్తకములను లాగికొని, వాటి ప్రతులను మాత్రమే తిరిగి యొసంగుచుండెనట. ఆతడు గ్రంథాలయోద్ధరణ కృషి విషయమున పాపమునకును, సాహసమునకును జంకక, ఉత్సాహమును పెంచెను. ఆనాటి పండితుల కృషివలన హీబ్రూ, ఈజిప్టు వాఙ్మయములు గ్రీకు భాషలోనికి అనువదింపబడెను.
అలెగ్జాండ్రియాలో రెండు గొప్ప గ్రంథాలయము లుండెను. అందు మొదటిదాని యందు 7 లక్షల పుస్తకములును, రెండవదానియందు 4 లక్షల పుస్తకములును ఉండెను. పుస్తకములపట్టిక తయారుచేయుపద్ధతి అప్పుడే ప్రారంభమైనది. సుఖాంత, విషాదాంత నాటకముల విభజనము జరిగినది. జూలియస్ సీజరు (క్రీ. పూ. 100-44) అలెగ్జాండ్రియాకు నిప్పు పెట్టిన సందర్భమున అచటి పెద్ద గ్రంథాలయము బూడిద అయ్యెను. అందువలననే పెర్గమమ్ నుండి ఆంటోనీ గ్రంథాలయమును సీజరు తెప్పించి క్లియోపాట్రాకు బహూకరించెనట !
పెర్గమమ్ ప్రభువులు టాలమీలతో కీర్తికై స్పర్ధించి గ్రంథాలయమును అభివృద్ధి పరిచిరి. పెర్గమమ్ గ్రంథాలయము ఈజిప్టు చేరుసరికి అందు 2 లక్షల గ్రంథములు కలవట. క్రీ. పూ. 221 లో ఘనుడగు ఆంటియోకసు ; కవియు, వ్యాకరణవేత్తయు, కాల్సిస్ నివాసియు నగు యూఫరన్ అనునాతనిని తన గ్రంథాలయాధికారిగా నుండ నాహ్వానించెను.
రోమ్ : రోమనులు సహజముగా యుద్ధప్రియులు. వారి కీగ్రంథాలయములు, యుద్ధమున చెడిపోయిన సామగ్రిగా కనిపించినవి. వారు వాటిని ధనరాసులతో పాటు రోమ్‌నగరమునకు చేర్చిరి. అచ్చటి ధనికులు వాటిని సేకరించుకొని, ధనముతోపాటు గ్రంథసంఖ్యనుకూడ పెంచుకొనిరి. సెరనస్ సమ్మోనికస్ అనునతడు 62 వేల గ్రంథములను తన శిష్యున కిచ్చి పోయెనట. రోములో జనతాగ్రంథాలయస్థాపన మనునది జూలియస్‌సీజరు పథకములలో నొకటి. పుస్తక సేకరణకు, తద్వ్యవస్థకు 'వారో' అను నతడు నియమింపబడెను. ఇతడు గ్రంథాలయముపై నొక పుస్తకము సైతము రచించెను. ఎవంటైన్ పర్వతముపై పోలియో అనునతడు మొదటి జనతా గ్రంథాలయమును స్థాపించెను. తరువాత అగస్టస్ పెక్కు జనతా గ్రంథాలయములను నెలకొల్పెను. అతడు ఆక్టేవియస్ గ్రంథాలయమును తన సోదరి గౌరవార్థము స్థాపించెను. అతడు స్థాపించిన పాలటైన్ గ్రంథాలయము అనంతరము టైటస్ కాలమున దగ్ధమాయెను. అగస్టస్ తరువాతి ప్రభువులు అతనితోసములు కాకపోయినను, గ్రంథాలయములను స్థాపించుటలోను, వాటిని సువ్యవస్థీకరించుటలోను ఆతనికి తగినవారసు లనిపించుకొనిరి. ఆతని తరువాతివాడగు టైబీరియస్ 'టైబీరియన్ ' గ్రంథాలయమును స్థాపించెను. నీరోకాలమున రోమ్‌నగరము దగ్దమైన పిదప, డొమిషియన్ అనునతడు అలెగ్జాండ్రియా నుండి ప్రతులు వ్రాయించి తెప్పించి గ్రంథాలయమును పునరుద్ధరించెను. ప్రభుత్వ గ్రంథాలయములలో ప్రసిద్ధిచెందిన ఉల్ఫియస్ గ్రంథాలయమును ఉల్ఫియస్ ట్రోజనస్ అను ప్రభువు స్థాపించెను. రోమ్‌లోనే కాక ఇటలీదేశ మంతటను 24 ప్రదేశములలో గ్రంథాలయములు స్థాపింప బడినవనుటకు ఆధారములు కలవు. గ్రంథాలయములకు తోడు పఠనాలయములుకూడ నుండెడివి. అవి అర్థచంద్రాకారమున గాని లేదా, దీర్ఘచతురస్రాకారమున గాని ఉండెడివట, పెర్గమమ్‌దేశములోని గ్రంథాలయములలో మినర్వా దేవతాశిల్పముండెడిది. అట్లే ఇటలీలోని గ్రంథాలయములలో దేవతాశిల్పములను నిల్పెడివారు. పఠనాలయములు ప్రముఖ రచయితల పటములతో అలంకరింప బడెడివి. పుస్తకములు గ్రహించుటకు వీలుగా కేటలాగు
435