పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/479

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గెలిలియో

సంగ్రహ ఆంధ్ర

(proportional compass) అనుదానిని తయారుచేసెను. దీనితో గుణకారభాగహారములను త్వరగా చేయవీలగును. దీనిని ఆయన 'జ్యామెట్రికల్ మిలటరీ కాంపస్ ' (Geometrical Military Compass) అనెను.

క్రీ. శ. 1609 లో గెలిలియో 'కుంభకటకము' (Convex Lens), 'పుటకటకము' (Concave Lens) లను చేర్చి, వానిని సీసపు గొట్టములో నమర్చెను. అదియే ప్రథమ దూరదర్శినియంత్రము. దీని సాయముతో ఖగోళములో ననేక అద్భుత విషయములను కనిపెట్టెను. 'పాలపుంత' (Galaxy) నిండ నక్షత్రములే కలవనియు, చంద్రుని నిండ మిట్టపల్లములు, పర్వతశ్రేణులు, లోతైన లోయలు కలవనియు, కాంతికూడ అన్ని భాగములయందు సమముగా లేదనియు కనుగొనెను. క్రీ. శ. 1610 లో బృహస్పతి గ్రహమునకుగల 11 ఉపగ్రహములలో నాల్గింటిని గెలిలియో కనుగొనెను. అవి బృహస్పతి గ్రహముచుట్టును పరిభ్రమణము చేయునని కనిపెట్టెను. శుక్ర గ్రహముయొక్క కళలు (Phases) కోపర్నికస్ ఎట్లుండునని జోస్యము చెప్పెనో, అట్లేయున్నవని ఇతడు నిరూపించెను.

గెలిలియో యొక్క గొప్పతనమును గుర్తించి 'పడువా' విశ్వవిద్యాలయమువారు ఆయనను జీవిత పర్యంతము గణితాచార్యునిగా నియమించిరి. గెలిలియో తన దూరదర్శిని యంత్రమును అభివృద్ధిచేసి, సూర్యుని పరీక్షించెను. సూర్యునియందు కొన్నిమచ్చలు కలవనియు, సూర్యుడంతయు తేజోవంతమైన గోళము కాదనియు, సూర్యునిలోని మచ్చలు క్రమముగ కదలుచుండుటచే సూర్యుడుకూడ ఒక అక్షము (Axis) మీద తిరుగుననియు నిరూపించెను. 1611లో రోములో సన్మానమును పొందుటకు వెళ్ళి అచ్చటగల పెద్దలకు తన దూరదర్శినిద్వార సూర్యునిలోని మచ్చలు మొదలైనవానిని చూపెను. కాని చాలమంది అది అంతయు ఏదో కనికట్టు విద్యక్రింద జమకట్టి ఆయనపై కత్తికట్టిరి. గెలిలియో శనిగ్రహము చుట్టును వలయములు (Rings) ఉన్నట్లు తెలిసికొనెను. 1614లో ఈయన మొదటి సూక్ష్మదర్శినినిచేసి, ఈగలు మొదలగువాని ఒంటిమీదగల రోమములను పెద్దవిగా కనిపించునట్లు చూపెను. కాంతి యొక్క వేగమును నిర్ణయించుటకు ప్రయత్నించెను కాని, ఈయన కనుగొన్న బుధ చంద్రుల సాయముతో కొలది కాలములోనే రోమర్ (Romer) కాంతివేగమును కనుగొనెను.

గెలిలియో చేయు పరిశోధనములన్నియు మతాధికారులు విశ్వసించుచున్న భావములను, అరిస్టోటిల్ సిద్ధాంతములను ఖండించుచుండుటచే రోమన్ చర్చికి ఆతనిపై ద్వేషము కలిగెను. ఆయనను పాషండుడనిరి. కోపర్నికస్ వ్రాసిన గ్రంథములను, గెలిలియో సమకాలికుడగు కెప్లర్ వ్రాసిన గ్రంథములను మతగురువులు నిషేధించిరి. 1615 లో గెలిలియోను ఎనిమిదవ పోప్ అర్బన్ (Pope urban VIII) అను నాతడు రోమ్‌లో గౌరవించెను. కాని గెలిలియో కోపర్నికస్ సిద్ధాంతములను బాహాటముగా సమర్థించుటచే మతవిరుద్ధములగు ప్రచారములను మానుకొనవలెననియు, లేనిచో అతడు కఠిన కారాగారశిక్షకును, చిత్రహింసకును గురికావలసి యుండుననియు పోప్ అర్బన్ హెచ్చరించెను.

1615 లో గెలిలియో 'పడువా' నుండి ఫ్లారెన్సుకు తిరిగివచ్చెను. 1632 లో “టోలమీ, కోపర్నికస్‌ల జగత్సిద్ధాంతముల చర్చ" ("Dialogue Concerning the two chief world systems of ptolemaic and Copernican") అను గ్రంథము ప్రకటించెను. దీనితో ఈయనకు చర్చితో తలపట్లవరకు వచ్చెను. విరోధులు పరవళ్ళు త్రొక్కిరి. మతాధికారుల నిరంకుశ ధర్మవిచారణ సభలో గెలిలియోను చిత్రహింసలకు గురిచేసి అతడు ప్రవచించిన అభిప్రాయములు మార్చుకొనుచున్నట్లుగా క్షమార్పణ ప్రమాణమును వ్రాయించి సంతకము చేయించిరి. మూఢులైన మతాధికారుల హింసలనుండి బయట పడుటకు గెలిలియో తన పరిశోధనలు తప్పని చెప్పెను. వృద్ధాప్యము, కుటుంబనష్టములు మొదలగు వానివలన గెలిలియో కృశించిపోయెను. ఆతనిని తన గృహము వదలిపోరాదని కట్టడిచేసిరి. అజ్ఞానుల దౌర్జన్యమువలన లోకసత్యములు కొంతకాలము వరకు మరుగు పడవచ్చును. కాని, సత్యము శాశ్వతముగా దాగలేదు అనుటకు గెలిలియో జీవితమునందలి ఈ ఘట్టము తార్కాణము.

గెలిలియో శారీరకముగా కృశించుచున్నను, అతని బుద్ధిసూక్ష్మత తగ్గలేదు. ఆ కాలముననే ఆయన వస్తువుల

430