పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/453

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుఱ్ఱపు దళము

సంగ్రహ ఆంధ్ర

బడెను. ఇది క్రీ. పూ. 14 వ శతాబ్దిలో విరచితమయి యుండునని పండితులు అభిప్రాయ పడుచున్నారు. ఈ గ్రంథములో ఐకవర్తన్న - తేరవర్తన్న - పంజవర్తన్న- సత్తవర్తన్న—నావర్తన్న అనెడి పదములు (సెమెటిక్ భాషకు సంబంధించనివి) కనిపించుచున్నవి. ఇవి అశ్వక్రీడలను తెలిపెడు ఏకవర్తనము, త్రివర్తనము, పంచవర్తనము, సప్తవర్తనము, నవవర్తనము అను సంస్కృత పదముల యొక్క అపభ్రష్టరూపములు. అనగా వేదకాలపు భారతీయులు గుఱ్ఱములకు శిక్షణనిచ్చుట మాత్రమే గాక, అశ్వక్రీడలనుగూడ అభివృద్ధి పరచియున్నారని తెలియుచున్నది. ఈ క్రీడలను తెలిపెడి పారిభాషిక పదములను ఇతర దేశములు సహితము గ్రహించినవనినచో, వాటి వ్యాప్తి ఎంతటిదో గ్రహింపవచ్చును. వేదకాలమందు అశ్వశాల లున్నవని మాత్రము అంగీకరింపవలసి యున్నది.


"వాయుశ్చ మనుశ్చ పంచవింశతి సంఖ్యాకాః
 గంధర్వా శ్చేతిమిలిత్వా సప్తవింశతి సంఖ్యాకాః
 మేపురుషాః తేసర్వే అగ్రే అస్మత్తః పూర్వం
 రద్గే సంయోజితవంతః తేపునస్సర్వే పృష్ఠ సమ్మా
 ర్జనాద్యుపచారేణ అశ్మిన్న శ్వేవేగం సంపాదితవంతః"
 (కృ. య. బ్రాహ్మణము అష్టకము 3 వ ప్రశ్నము 5 వ అనువాకము).

పైన ఉదాహరించిన శ్లోకమంత్రము వలన వేదకాలమున గుఱ్ఱములకు 'మాలీషు' చేయు విధానము కలదనియు, ఇట్లు మాలీషు చేయుటవలన గుఱ్ఱమునకు నూతనశక్తియును, నవ్యోత్సాహమును సమకూడు ననియు స్పష్టమగుచున్నది. ఇంకను, ఇరువదిఏడుమంది ఆశ్వికులకు తక్కువగాని ఆశ్వికదళములానాడు ఉపయోగింప బడెననియు ధ్రువపడుచున్నది. ఈ ఆశ్వికులు 'ఆజిందావనము' నకును (గుఱ్ఱపు పందెములకు), రాక్షసులపై యుద్ధమునకు వెడలుటకును ఉపయోగపడు చుండిరని పై మంత్రార్థమును బట్టి ఊహించుకొన వచ్చును.

భారతయుద్ధమందు చతురంగబలములలో ఒకటిగా ఆశ్వికదళమునకు ప్రాముఖ్యమున్నట్లు భారత ఇతిహాసము వలన బోధపడగలదు. ఒక అక్షౌహిణీ సైన్యములో 65,610 గుఱ్ఱములుండెను. నకులుడు అశ్వశిషయందు కుశలుడై యుండెను. అయితే రథ, గజ, పదాతి బలములతో పాటుగా, ఆశ్వికదళములకు సమాన ప్రతిపత్తి యున్నట్లు తోచదు. ఈనాడు వ్యూహరచనయందు, శత్రువును తునుమాడుటలో కౌశల్యమును ప్రదర్శించుట యందు, క్లిష్టమైన పెక్కు ఇతర బాధ్యతలను నిర్వర్తించుట యందు, సుశిక్షణము అలవరచు కొనుటయందు ఉన్నతమైన ప్రజ్ఞావిశేషమును, అభివృద్ధిని ఆశ్వికులు సాధించినంతగా, ఆనాటి కౌరవ పాండవుల ఆశ్వికులు సాధించియుండలేదేమో! ఈ విషయమందు ఇంతకంటె అధికముగా సమాచారమును సేకరించుటకు చారిత్రకాధారములు కానరావు.

క్రీ. పూ. 4 వ శతాబ్దిలో కౌటిల్యునిచే రచింపబడిన "అర్థశాస్త్రము" అను గ్రంథమందు అశ్వికదళమును గూర్చిన ప్రశంసకలదు. అశ్వములలోగల అనేకరకములను గూర్చియు, వాటి స్వరూప స్వభావాది లక్షణములను గూర్చియు, ఆహార విహారాది. నియమములను గూర్చియు, పెంపకమును గూర్చియు కౌటిల్యుడు వివరముగా పేర్కొని యున్నాడు. పలు తరగతులకు చెందిన అశ్వములు యుద్ధకలాపములకు అనుపయోగ కరములనియు, శౌర్య, పౌరుష, పరాక్రమములు, చలన శక్తి, నైపుణ్యము మొదలైన విశిష్ట లక్షణములతో అలరారు ఉత్తమాశ్వములే సమరమందు వాటి పాత్రను జయప్రదముగ నిర్వహింపగలవనియు కౌటిల్యుడు వాక్రుచ్చియున్నాడు. యుద్ధ ప్రక్రియలందు ఉపయోగ పడని అశ్వములను పౌర, జానపదుల కొరకు వినియోగింపవచ్చునని అతడు చెప్పియున్నాడు.

సమరోపయోగకరములగు అశ్వములలో కాంభోజ, సైంధవ, ఆరట్టజ, వనాయుజములు ఉత్తమములనియు, బాహ్లిక, పా పేయక, సౌవీరక, తైతలములు మధ్యమము లనియు కౌటిల్యుడు అభివర్ణించియున్నాడు. వీటియొక్క తీక్ష్ణ, భద్ర, మందగతుల ననుసరించి కొన్నిటిని సన్నాహ్యములుగను, మరికొన్నిటిని ఔపవాహ్యములుగను విభజించియున్నాడు. గుఱ్ఱములకు సంక్రమించు వ్యాధులను చికిత్సచేయుటకై కౌటిల్యుడు అమూల్యములగు ఔషధ విధానములను గూడ నిర్దేశించియున్నాడు.

కౌటిల్యుని కాలమున అమలునందున్న యుద్ధవ్యూహ

404