విజ్ఞానకోశము - 3
గుణాఢ్యుడు
ణుడు, అయి వాసికెక్కిన గుణగ విజయాదిత్య మహారాజు ప్రఖ్యాతులయిన తూర్పు చాళుక్యవంశ రాజులలో అగ్రగణ్యుడని, ఆంధ్రదేశమును పరిపాలించిన రాజులలో ప్రథమశ్రేణికి చెందినవాడనియు నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఆర్. న. రా.
గుణాఢ్యుడు :
గుణాఢ్యుడు అత్యంత ప్రాచీన కాలములో ప్రకాశించిన ప్రతిభాశాలి; పండిత గ్రామణి; కవివతంసుడు; కథావాఙ్మయ నిర్మాత; ఆంధ్రుడు. గుణాఢ్యుని దేశ కాలాదులనుగూర్చి పరిశోధకుల దృష్టిలో అభిప్రాయ భేదములు గన్పట్టుచున్నవి. కాశ్మీర మందును, నేపాలు నందును ఇతనినిగూర్చిన కథలు కొన్ని వ్యాపించియున్నవి. కాశ్మీరమందలి కథలకు జయద్రథ (క్రీ. శ. 1140) రచితమైన 'హరచరిత చింతామణి' యను శైవగ్రంథమును, సోమదేవ (1029 - 1064) రచితమగు 'కథా సరిత్సాగరము'ను ప్రసిద్ధ మూలములు.
ఒకప్పుడు శివుడు పార్వతికి కొన్ని యపూర్వ విచిత్ర కథలను చెప్పుచుండగా, వారి భక్తుడగు పుష్పదంతుడను సేవకుడు కీటకరూపధారియై ఆ కథలను రహస్యముగా విని ఇంటికేగి తన ప్రేయసియగు జయ అను నామెకు వాటిని వినిపించెను. పార్వతి యొకప్పుడు తన చెలికత్తెల కీకథలను క్రొత్తగాచెప్పదొడగెను. కాని జయకు అవి శ్రుత పూర్వములేయగుటను గ్రహించి, పార్వతి పుష్పదంతు డొనర్చిన అపచారమునకు గినిసి, అతడు మర్త్యుడై పుట్టునట్లు శపించెను. ఈ సందర్భముననే అతని మిత్రుడగు మాల్యవంతునిగూడ అట్లేశపించెను. అంత జయ, పార్వతి, పాదములపై బడి వారి శాపవిముక్తిని వేడుకొనెను. అంత పార్వతి “కుబేర శాపహతుడగు సుప్రతీకు డనువాడు (యక్షుడు) కాణభూతి యనుపేర వింధ్యాటవిలో చరించు చుండును వానికి నీ ప్రియుడు ఈ కథలను చెప్పుచో శాపవిముక్తుడగును. కాణభూతి మరల మాల్యవంతునికి ఈ కథలను వినిపించుచో వా రుభయులుగూడ శాప విముక్తి నొందగలరు" అని అనుగ్రహించెను. పుష్పదంతుడు ఈ శాపమువలన భూలోకములో జనించి, వరరుచి యనుపేర నందరాజునకు మంత్రి అయ్యెను. తరువాత కాణభూతికి ఆ కథలు వినిపించి వరరుచి శాపవిముక్తు డయ్యెను.
ఇంక మాల్యవంతుని వృత్తాంతము; ఈశ్వరుని నిరంతరము మాలావిభూషితునిజేసి యా దేవుని యనుగ్రహమున మాల్యవంతుడను సార్థకనాముడై రుద్రగణములో నొకడుగా పుష్పదంతునివలె ఈశ్వరుని సన్నిహిత భృత్యవర్గములో ఉండెను. కథాశ్రవణ సందర్భమున పుష్పదంతుని సమర్థించుటకు కడంగి మాల్యవంతుడుకూడ పార్వతీశాపమునకు గురియయ్యెను. మాల్యవంతుడు భూలోకములో జన్మించి గుణాఢ్యుడుగా ప్రసిద్ధిచెందెను. గుణాఢ్యుని జన్మకథ క్రిందివిధముగా నున్నది:
ప్రతిష్ఠానమను నగరమందు సోమశర్మ యను విప్రుడు కలడు. అతనికి వత్సుడు, గుల్మకుడు అను ఇరువురు పుత్రులు, శ్రుతార్థయను కన్యయు గలరు. కాలవశమున ఆ బ్రాహ్మణుడును, అతని భార్యయు కాలధర్మమునొందగా ఆ సోదరులిరువురు తమ సోదరిని కాపాడుచు కాలము గడుపుచుండిరి. కొంతకాలమునకు శ్రుతార్థ గర్భవతి యయ్యెను అన్నదమ్ములీ విపరీతమును జూచి ఒకరినొకరు అనుమానింపదొడగిరి. శ్రుతార్థ వీరి వైఖరిని కనిపెట్టి, “నాగాధిపతియగు వాసుకియొక్క సోదరుని పుత్రుడగు కీర్తి సేనుడనురాజు కలడు. నేనొకప్పుడు గోదావరికి స్నానార్థ మేగుచుండగా అతడు కామోపహతుడై నన్ను గాంధర్వమున వివాహమాడెను. కనుక మీరు కలహింప బనిలేదు" అని చెప్పెను. కాని వారీమాటలను విశ్వసించ లేకపోవుటచే ఆమె ఆ నాగరాజును స్మరించెను. అంత ఆ నాగరాజు ఆ సోదరుల నిద్దరినిగూర్చి “నేనీమెను వివాహమాడినది సత్యమే. మీరు ముగ్గురును దేవతలే ; ఈమె అప్సరస. శాపోపహతులై యిట్లు మీరు జన్మించితిరి. ఈమెకు కుమారు డుద్భవింపగలడు. అంత మీకు శాప విముక్తి యగు" నని చెప్పి యంతర్థానమయ్యెను. కొంత కాలమునకు శ్రుతార్థ ఒక పుత్రుని గనెను. అపుడు ఆకాశవాణి "రుద్రగణములోని ఒకడిట్లు జన్మించెను. ఇతడు గుణాఢ్యుడని ప్రసిద్ధినొందును" అని పలికెను. త్వరలోనే తల్లియు, మేనమామ లిద్దరును మరణింపగా, ఆ బాలుడు ధైర్యమును వీడక దక్షిణమున కేగి గురుకులములందు సకలవిద్యల నభ్యసించి స్వదేశమునకు వచ్చెను.
389