గుజరాతుదేశచరిత్రము
సంగ్రహ ఆంధ్ర
ఈ ప్రాంతమున జైన, బౌద్ధ మతములు సమాన బలముతో వ్యాపించెను. రానురాను ఈ రెండు మతములు విజృంభించి ఒకదానిని మరియొకటి అణచవలెనను పట్టుదల పెరిగెను. ఇది ఇట్లుండగా, ఆర్యవైదికమతము గూడ ఇచట పెంపొందెను. జైన, బౌద్ధ సంఘర్షణల ఫలితమే ఈ ఆర్య వైదికమత ప్రాబల్యము. ఆర్యవైదిక మతమునందు గల లోపముల కారణముగా జైన, బౌద్ధమతములు దీనిని ఖండించెను. ఇచట పారసీకులు, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో నుండిరి. విదేశీయుల హస్తగతమైన తరువాత ఈ ప్రాంతము అనేక సంఘర్షణలకు గురికావలసివచ్చెను. సోలంకీరాజుల కాలమున ఏ సంస్కృతి ఈ ప్రాంతమున వికసించినదో, అదే నేడుకూడ ప్రచారములో నున్నది. కాని క్రొత్తమార్పులు ఎక్కువగా గానరావు. రాజకీయ, సైనిక వృత్తులలో ఈ ప్రాంతము ప్రాముఖ్యత వహించుటకు మూలరాజ్, సిద్ధరాజ్, కుమారపాల్, తగేపాల్ అనువారలు ముఖ్యులు. ఈ ప్రాంతము మహమ్మదీయ పరిపాలనలోనికి వచ్చిన తరువాత, ఇచ్చటి సంస్కృతిలో కొన్ని మార్పులు కలిగెను. అక్బరు కాలమున ఈ ప్రాంతమును ఒక మహమ్మదీయుడు పరిపాలించెను. ఆతనిని అక్బరు ఓడించి అతని రాజ్యమును తన రాజ్యమున కలుపుకొనెను. అక్బరు సృష్టించిన “దీన్ ఇల్లాహి” అను మతము ఈ ప్రాంతమున కొంతవరకు ప్రబలెను. ఇచట ముస్లిములు ఎక్కువగా ఉండుటచే, అక్బరుయొక్క నూతన మతము ప్రచారమునకు వచ్చి విస్తృతి జెందుటకు కారణమయ్యెను. ఈ మతము అచటి హిందూ, ముస్లిములకు ఐక్యతను సమకూర్చెనని కూడ చెప్పుదురు. గుజరాతునందు నివసించుచుండిన మహమ్మదీయులకు అరబ్బీ, పార్సీభాషలు వచ్చినప్పటికిని, వారు గుజరాతు భాషనే తమ మాతృభాషగా అంగీకరించిరి. మహమ్మదీయ యుగముననే ఇచట భక్తిమార్గము వెల్లివిరిసెను. ఈభక్తి మార్గమును ప్రవేశపెట్టినవారు వల్లభాచార్య, చైతన్యులు. వీరిరువురు కృష్ణభక్తి ప్రధానమని శ్రీకృష్ణుని అద్భుత లీలలను తెల్పు గీతములను రచించి, పామర జనుల యందు భక్తి మార్గమును ప్రవేశ పెట్టి హిందూ సంప్రదాయమును కాపాడిరి.
గుజరాతుభాష మృదుమధుర మైనది. హేమచంద్ర నరసింహ మెహతా, భక్తమీరా మొదలగు భక్తులు ఈ ప్రాంతమున జన్మించినవారే. ప్రారంభమున ఇచ్చటి కవులు పద్యమునందే అనేక భక్తి కావ్యములను రచించిరి. ఆ తరువాత గద్యరచన, మతసంబంధమగు సాహిత్యము, కథాసాహిత్యము, రాసా, వర్ణనాత్మక వ్యాసములు, నవలలు, క్రమేణ వృద్ధిలోనికి వచ్చెను. సంగీత, నాట్యములనిన యిచ్చటి వారికి బహుప్రీతి. కావుననే సంగీతము వృద్ధిచెందినది. శ్యామలా సంగీత మనునది బహుముఖముల వృద్ధిచెందెను. రసమూర్తి యైన శ్రీకృష్ణుడు తన మురళీ నాదముచే ఈ ప్రాంతీయులకు భక్తిసారమును చవి చూపెను. శ్రీకృష్ణుడు ఇచ్చటి వారికి యిష్టదైవము. శ్రీకృష్ణుని బాల్య క్రీడలను అతని మహిమను గూర్చి పాడు పాటలు అతి శ్రావ్యములై యుండును. వీరు భక్తి గీతములు పాడుచు, పరమానందములో భక్తి సారమును గ్రోలుచు తన్మయత్వమును పొందుదురు. మీరాబాయి వ్రాసిన శ్యామలాగీతములకు తగు సంగీతమును గూర్చి వానినెంతో భక్తిశ్రద్ధలతో భజింతురు.
గుజరాతు స్త్రీల వస్త్ర, భూషణములు ఇతర ప్రాంతములకంటె భిన్నమై యుండును. వీరి వేషభూషణములు గోపికాంగనల వంటివని ప్రతీతి. వీరి ఆభరణములు కొంత మొరటుగానే యుండును. కొంతవరకు తెలంగాణ ప్రాంతమున నివసించు లంబాడివారి ఆభరణములను పోలి యుండును. లంగాలపై (పావడ) బంగారు జరీతో లతలుగా కుట్టి చూచుటకు అందముగా నుండు పనితనము కలిగి యుండును. అదే విధముగ పైటవస్త్రము పైనను ఇట్టి జరీపనియే కనపడును. సోలంకీరాజు పరిపాలనకాలమునను, తరువాతి కాలమునను కొన్ని సంగీతశాస్త్ర గ్రంథములు ఇచ్చట లభించెను. అవి ' సంగీత ప్రకాశ, 'సంగీత రత్నావళి', 'మానసోల్లాస్ ' అనునవి. సంగీత గ్రంథములను చూడ, గుజరాతీ ప్రజలు సంగీత ప్రియులని తెలియుచున్నది. ఈ ప్రాంతమున శ్రీ సంగీతాచార్య ఓంకారనాథ్ ' అను నతడు నివసించెను. అతడు సమస్త భారతదేశమున ప్రసిద్ధి కెక్కిన వాడు.
ప్రాచీన కట్టడములు నేటికిని కొన్ని గుజరాతులో కాననగును. గుజరాతీ కళాపరిచయము లోధల్ అను
380