పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/428

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుజరాతుదేశచరిత్రము

యందు మహాపండితులును, కోటీశ్వరులైన వైశ్యులును ఉండిరి. ఈ పండితులనే ఆనందపురిబ్రాహ్మణులని కూడ యందురు. వీరు భారతదేశమందు విద్వత్తులో మొదటివారని చెప్పుదురు. ఇచట నలందా విశ్వవిద్యాలయమువంటి విద్యాలయ ముండెను. ఈప్రాంతమున జైను లెక్కువగా నుండిరి. కాని విద్యాధికులు బౌద్ధులే. వలభీయందలి విద్యాలయములో మాగధీ, పాలీ అపభ్రంశ భాషలను, సంస్కృతమున బోధించు చుండెడివారు. ఇచటి జైనసిద్ధాంత సంగ్రహాలయములను వైశ్యస్త్రీలు అతిశ్రద్ధతో సంరక్షించిరని వినికిడి. కొందరు నేటికిని జైనసిద్ధాంతములనే ప్రమాణములుగా తలంతురు. మైత్రక రాజవంశజులు విద్యాభిమానులు; భగవద్భక్తులు. వీరు అనేక దేవాలయములను కట్టించిరి. వీరు కట్టించిన ఆలయములలో నేటికిని వేణుగోపాలస్వామి మందిరము వలభీనగరమం దున్నది. ఈ నగరము నౌకాయానమునకు ప్రసిద్ధి. ఈ వంశము తరువాత “ధుమలీ సైంధవ” వంశ మనునది వచ్చి సప్తసముద్రములపై యధికారము సంపాదించినదని చెప్పుదురు. సోలంకీ యను రాజు గుజరాతు సరిహద్దులను పెంపొందించెను. ఇతడు కర్నాటక, రాజస్థాన్, మాళవ రాజ్యములపై దండెత్తి వానినుండి కొంతభాగమును తన రాజ్యములో కలుపుకొనెను. ఇతడు సోమనాథుని ఆలయమును కట్టించెను. ఇది గొప్ప యాత్రాస్థలము. నేటికిని సోమనాథుని దర్శించుటకు యాత్రికులు వెళ్ళుచునే యుందురు.

సోలంకీ తరువాత కోటయాధీశు డను వాడు గుజరాతును పరిపాలించెనని కొందరు చరిత్రకారులు చెప్పుదురు కాని, ఇతనిని గూర్చిన చరిత్ర అంతగా తెలియదు. నాటి ప్రసిద్ధపట్టణములు, గ్రామములు నేటికి గూడ ఆ పేరుతో ప్రసిద్ధిచెందియున్నవి. పూర్వకాలమున ఈ దేశమందు శిల్పశాస్త్రము నానా ముఖముల వృద్ధిజెందెను. నాటి ప్రజలకు దేశాభిమానము మెండుగ నుండెడిది.

ఈ ప్రాంతము క్రీ. శ. 1300-1400 వరకు పరదేశీయుల హస్తగతమయ్యెను. క్రీ. శ. 1411 లో తిరిగి, ఇది స్వతంత్ర రాజ్యముగా మారెను. తిరిగి ఇది క్రీ. శ. 1573లో మహమ్మదీయుల అధీనమయ్యెను. భారతీయ సైన్యములో గుజరాతు సైన్యము మహమ్మదీయుల కాలములో ప్రఖ్యాతి గాంచెను. ఈ సైన్యము రాజస్థాన్, మాళవ, ఢిల్లీ రాజ్యముల ముఖ్యపట్టణములలో నుండెడిది. గుజరాతునందు “తోపుఖానా” యనునది ప్రసిద్ధిచెందినది. ఈ తోపుఖానా అహమదాబాద్, సూరత్ పట్టణములకంటె విస్తృతముగా నుండెడిది. మొగలులను ఎదుర్కొనుటకై వీరు అనేక సాహసకృత్యములుచేసిరి. మొగలులు గుజరాతును స్వాధీనపరచుకొనియు, అచ్చట చక్కని రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయిరి. ఇచటి ప్రజలు విదేశీయ పరిపాలనయందు నలిగిపోయిరి. 1734 నుండి ఈ దేశవాసులలో నవచైతన్యము పొడచూపెను. అదేసమయమున మహారాష్ట్రులు విజృంభించి మహమ్మదీయుల నిరంకుశత్వమును అణచుటకై అచ్చటచ్చట మొగలులకు వశమైన కోటలను స్వాధీనపరచుకొనిరి. ఈకాలముననే గుజరాతు, పూనానగరాధికారముక్రిందికి వచ్చెను. కొద్దికాలములోనే ఈ రాజ్యము చిన్న చిన్న రాజ్యములుగా విభజింపబడెను.

భారతదేశమును పారతంత్ర్య పంకమునుండి విడిపించిన గాంధీమహాత్ముడు ఈ రాష్ట్రమునకు చెందిన వాడే. చతుర్విధ సిద్ధాంతములతో కూడుకొనిన గాంధీ వాదము ఇచ్చటనే దృఢపడినది. క్రీ. శ. 1921 నుండి 1942 వరకు జరిగిన సత్యాగ్రహ సంగ్రామమందు గుజరాతు సంస్కృతి వికసించెను.

గుజరాతు సంస్కృతి: మానవునికి ప్రకృతి సరిహద్దు వంటిది. ఈ ప్రకృతి ననుసరించి మానవుడు తన సంస్కృతిని పెంపొందించుకొనును. ప్రాచీన కాలమున ఆర్యులు మొట్టమొదట గుజరాతునందు స్థావరముల నేర్పరచుకొనిరి. ఈ ప్రాంతము సముద్రసామీప్యమున నుండుటచే వ్యాపారమునకు అనుకూలమైనది. ఇచ్చట పూర్వకాలము నుండియు దేశీయుల, పరదేశీయుల కలయిక జరుగుచునే యున్నది. నాటినుండి నేటివరకు ఇచటి ప్రజలు ఉదారులు, ధార్మికులు. వ్యాపార విషయమున మంచి యోగ్యత గలవారు, ఈ ప్రాంతీయులకు రాజకీయ సంబంధముకంటె వ్యాపారసంబంధము ఎక్కువ. ఓడలను తయారు చేయుటయందు వీరు నిపుణులు. చాలకాలము నుండి వీరికి ముఖ్యవృత్తి ఓడలను కట్టుటయే. ఈ ప్రదేశము నౌకాశ్రయములకు అనువుగ నుండుటచే, 1920 సంవత్సరములో మొదటిసారిగా ఆంగ్లేయిలు 'సింధియా' అను కంపెనీని ఇచ్చట ప్రారంభించిరి.

379