పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/426

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుజరాతుదేశచరిత్రము

మున కొక క్రొత్త వింతదనమును కూర్చెను. 'అభ్యుదయ' పథగాములైన కవులు సూర్యచంద్రులను, తారకాపంక్తులను, వసంతఋతువును, పుంస్కోకిలాలాపములను తమకావ్య ప్రపంచము నుండి బహిష్కరించి, కాగితపు పువ్వులను, చీకి పారవేయబడిన మామిడి టెంకలను, మిల్లు కార్మికులను, పడుపువృత్తి నాశ్రయించిన పేద యువతులను తమ కావ్యవస్తువు జేసికొనిరి. కాని 1940 నాటికి ఈ నూతనోద్యమపు వేడి చల్లారగా, కవులు తిరిగి ప్రాచీనుల సౌందర్యాన్వేషణ మార్గమును అనుసరింప నారంభించిరి.

తరువాత గుజరాతీలో పలువురు సాహిత్యారాధకులు వివిధ సాహిత్య ప్రక్రియలలో చక్కని రచనలను కావించిరి. రమణలాల్ దేశాయి. చునీలాల్‌షా, గుణవంతరాయ్, మేఘానీ, పన్నాలాల్, దర్శక్ అనువారు రచించిన నవలలును ; బ్రోకర్, పన్నాలాల్, పెట్లీకర్, ఉమాశంకర్ జోషీ అనువారు వ్రాసిన చిన్నకథలును ; చంద్రవదన్ రచించిన నాటకములును; జ్యోతీంద్ర అనుకవివ్రాసిన వినోద వ్యాసములును; రామనారాయణ్ పాఠక్, విజయరాయ్ వైద్య, విశ్వనాథ భట్, విష్ణుప్రసాద్ త్రివేదీ, అనంత రాయ్ రావల్ ప్రభృతులు కావించిన సాహిత్య విమర్శలును ప్రసిద్ధికెక్కినవి. కవులలో చంద్రవదన్, సుందరమ్, మన్‌శుక్ లాల్, స్నేహరశ్మి, పూజాలాల్, రాజేంద్రషా, నిరంజన్‌భగత్, బాలముకుంద్ దావే, వేణీభాయ్ పురోహిత్, బేటాయ్ అనువారు ప్రముఖులై శోభిల్లిరి. కబర్దార్‌వంటి ఫార్సీ మతస్థులు కొందరు గుజరాతీభాషలో చక్కని సాహిత్యమును సృష్టించిరి. వినోదిని నీలకాంత్, లభుబెన్ మెహతా కుందనికా కపాడియా, ధీరూబెన్ పటేల్, గీతాపారిఖ్ మొదలైన రచయిత్రులు తమ మేలిరచనలతో సాహిత్యమునకు క్రొత్త సొగసులను సమకూర్చిరి.

నేడు అణ్వస్త్రయుగమున జీవించుచున్న మానవులకు సుందరోజ్జ్వలమైన భవిష్యత్తును గూర్చిన సుఖస్వప్నములు చెదరిపోయినవి. అంతటను నిరాశయు, నిస్పృహయు ఆవరించినవి. మానవుని భవితవ్యమును గూర్చి జిజ్ఞాసువులు తర్కించుచున్నారు. ప్రపంచమంతటను అలముకొన్న ఈ అనిశ్చిత స్థితి నేటి గుజరాతీ సాహిత్యములో గూడ ప్రతిఫలించుచున్నది.

అ. రా.

గుజరాతుదేశచరిత్రము :

భారతప్రభుత్వ ప్రాంతీయ పునర్విభజనానంతరము రెండుమూడు ప్రదేశములు కలిసి ఒక ప్రాంతముగా ఏర్పడెను. కాని వేరువేరు ప్రాంతములందలి భాష, నాగరికత కొంతవరకు వేరువేరుగా నుండును. భాష, యందును, నాగరికతయందును, మార్పులు వచ్చుటకు కారణము ఆ ప్రాంత పరిపాలనాధికారులే. అదేవిధముగ మహాగుజరాతు ప్రదేశమునందు గుజరాతు, సౌరాష్ట్రము, కచ్ఛిప్రాంతములు కలిసియున్నవి. ఈ మూడుప్రాంతములు కలిసి 'మహాగుజరాతు' అయినప్పటికిని, వీని భాషా సంస్కృతులయందు కొంత భేదమున్నది. దీనికి కారణము రాజకీయ పరిస్థితులే. మొదట కచ్, మహారాష్ట్రుల పరిపాలనయం దుండెను. సౌరాష్ట్రమున అనేక చిన్న రాజ్యములుండి, అనేకజాతులకు సంబంధించిన రాజులు రాజ్యము లేలిరి. గుజరాతు బ్రిటీషు ప్రభుత్వాధీనములో నుండెను. కాన, సామాజిక వ్యవహారములలో కొంత భేదము వచ్చినది. వీనిచరిత్ర వివిధకాలములలో వివిధ రీతులలో నడచినది. ఆ చరిత్రను పూర్తిగా పరిశీలించినచో, బహు విచిత్రముగ నుండును.

క్రీ. శ. ఆరవశతాబ్దమునందు ఈ ప్రాంతమున కొందరు విదేశప్రజలు స్థావరముల నేర్పరచుకొనిరని శాస్త్రజ్ఞుల నమ్మకము. కాని వీరు ఏ యే ప్రదేశములనుండి ఏతీరున వచ్చినదియు ఎవరికిని తెలియదు. ఆతరువాత, కొన్ని పరిశోధనల ఫలితముగా తేలినదేమన, ప్రథమమున గుజరాతుప్రాంతమున స్థావరములు ఏర్పరచుకొనినవారు "కాస్మయం" అను ప్రదేశమున నివసించియుండవచ్చు ననియు, ఈ కాస్మయం ప్రదేశమునకు వారు రష్యా, దక్షిణోత్తరములనుండి వచ్చిరనియు, వీరు ఒకే పర్యాయము పెద్ద సమూహముగా వచ్చిరనియు, ఈ సమూహమునకు ' శ్వేతసమూహ' మని పేరనియు తేలినది. ఈ సమూహము నందలి కొందరు రాజస్థానము, కచ్ ప్రాంతములలోగూడ స్థావరములు ఏర్పరచుకొనిరి.

గుజరాతుభాష 'శౌర సేని' అపభ్రంశమునుండి పుట్టినది. ఈ అపభ్రంశమును మూడుకాలములక్రింద విభజించిరి. (1) శౌర సేని అపభ్రంశభాష క్రీ. శ. 900 - 1100 వరకు ; (2) మధ్య అపభ్రంశ భాష 1100-1500 వరకు ;

377