పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/425

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుజరాతీ భాషాసాహిత్యములు

సంగ్రహ ఆంధ్ర

బడుచున్నాడు. ఆకాలమున గుజరాతీ భాషలో ఆత్మాశ్రయ కవిత్వమునకు ప్రాముఖ్యము హెచ్చెను. ప్రహసనములు, చారిత్రక నవలలు, వ్యాసములు, స్వీయచరితములు మొదలైన నూతన సాహిత్యప్రక్రియ లేర్పడెను.

క్రమముగా మన దేశస్థులకు మొదట పాశ్చాత్య సభ్యతపై ఏర్పడిన వ్యామోహము గళితమయ్యెను. వారి దృష్టి భారతీయ సంస్కృతి మీదికి మరలెను. బొంబాయి విశ్వవిద్యాలయము 1857 లో స్థాపింపబడెను. అచ్చటి పట్టభద్రులలో కొందరు ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతులలోని మేలి గుణములను గ్రహించి సాహిత్యములో క్రొత్త విలువలను కల్పించిరి. యూరప్ ఖండమును 19 వ శతాబ్దములో ఆవరించిన మానవత్వవాదము వారి నాకర్షించెను. షెల్లీ, కీట్సు వంటి ధ్యేయ కవుల ప్రభావమునకు వారు లోనైరి. నరసింహారావు దివేటియా చేసిన కృషి మూలమున గుజరాతీలో అపుడు భావగీతరచనకు ప్రాముఖ్య మేర్పడెను. ప్రకృతితో మానవునకుగల సన్నిహిత సంబంధమును చిత్రించుటలో “కలాపి" అను కవి వర్డ్స్‌వర్త్ మార్గము ననుసరించెను. బాలశంకర్, మణిలాల్ ప్రభృతులు పర్షియన్ భాషలోని “ఘజల్" వంటి గేయములను గుజరాతీలో అతి నిపుణతతో రచించిరి.

నాటి రచయితల యందు అగ్రగణ్యుడై వరలినవాడు గోవర్ధనరామ్ త్రిపాఠీ అను నతడు. అతడు భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన విశేషములను విపులముగ చిత్రించు “సరస్వతీ చంద్ర" అను పెద్ద నవలను నాలుగు భాగములుగా రచించెను. అది గుజరాతీ భాషలో సర్వోత్కృష్టమైన గ్రంథమని విమర్శకుల అభిప్రాయము. జీవకళ తొణకాడు పాత్రలను సృష్టించుటలో అతడు అద్వితీయుడు. ఆతడు సృజించిన కుసుమ, కుముద, గుణ సుందరి, చంద్రావతి ఇత్యాది పాత్రలు సాహిత్యప్రపంచమున కలకాలము నిలచియుందురు. అసహజము, క్లిష్టము నగు కృతకభాషలో ఆ గ్రంథము రచింపబడుట మాత్ర మొక లోపమని చెప్పవలెను.

డాక్టర్ ఆనందశంకర్ ధ్రువ ప్రాచీన భారతీయ సంస్కృతిని గూర్చి లలితమయిన శైలిలో వ్రాసిన గ్రంథములు విశేషముగా పాఠకుల మెప్పును పొందినవి. ప్రార్థన సమాజమునకు చెందిన రమణభాయ్ నీలకాంత్ అను రచయిత ఆ సమయముననే “భద్రం భద్ర" అను తనహాస్య విలసితమయిన నవలలో, సనాతనాచారపరా యణతను పరిహసించెను. ఆ కాలపు కవులలో ప్రముఖుడైన నానాలాల్ అనునతడు పద్య రచనా విషయమున సంస్కృత వృత్తములను వాడుటను మాని శ్రావ్యమైన వచనమును ఉపయోగించి క్రొత్తదారి త్రొక్కెను. అతడే పెక్కు గేయనాటికలనుగూడ వ్రాసెను. సుకుమారమైన భావన అతని సొత్తు. అపుడే గుజరాతు దేశచరిత్రమునందలి విశిష్ట ఘట్టములను ఆధారముగచేసికొని కే. యం. మున్షీ సుహాశయుడు “పృథ్వీవల్లభ్" వంటి చార్రితక నవలలను వ్రాసెను. మున్షీ పండితుని నవలలకు అమితముగా ప్రజాదరణము లభించినది. ఆతని హాస్యనాటికలుగూడ జన రంజకత్వమునకు పేరు వడసినవి.

గాంధీ మహాత్ముడు 1914 లో భారతదేశమునకు మరలివచ్చెను. వచ్చిన కొలదికాలమునకే తన ప్రభావ పూర్ణమైన వాక్కుచే దేశమును ఉత్తేజితమొనర్చెను. ఆత్మకథ, హింద్ స్వరాజ్ మొదలైన గాంధీజీ గ్రంథములన్నియు మొదట గుజరాతీ భాషలో రచింపబడినవే. ఆయన వచన శైలి చాలా సరళమైనది. గాంధీజీ స్థాపించిన గుజరాతు విద్యాపీఠము అచటి ప్రజల సాంస్కృతిక జీవనమునకు నూతన చైతన్యము నొసగెను. గాంధీజీ అనుచరులలో కాకా కాలేల్కర్, కిశోరీలాల్ మష్రూ వాలా, మహాదేవదేశాయ్ మున్నగువారుకూడ చారిత్రక ప్రాముఖ్యము, ప్రబోధాత్మకత గల రచనలతో గుజరాతీ సాహిత్యమును సుసంపన్నము గావించిరి.

"ధూమ కేతు”, “రామనారాయణ్ పాఠక్"అనురచయితలు రసవంతమైన కథానికలను సృష్టించుటలో అనితరసాధ్యమైన నేర్పును ప్రదర్శించిరి. ధూమకేతు అనుకవి సృష్టించిన చిన్న కథలలో గ్రామీణ జీవితము, అనామకులును, నిర్భాగ్యులు నగు వారి దీనస్థితి సహజముగా చిత్రింపబడినది. నాడు దేశమంతటను వ్యాపించిన స్వాతంత్ర్య పిపాస గుజరాతీ భాషయందు అనేక కావ్యముల యందు ఇతివృత్తముగా గ్రహింపబడెను. ఆచార్య ఠాకూర్ పాశ్చాత్య భాషా చ్ఛందోరీతులతో గుజరాతీ భాష యందలి నూతన పద ప్రయోగములతో కవిత్వ

376