పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/424

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుజరాతీ భాషాసాహిత్యములు

సిద్ధహస్తుడు. ప్రాచీన పౌరాణిక కథలకు అతని లేఖిని క్రొత్త సొగసులను చేకూర్చెను. అతని కృతులలో సమకాలిక సాంఘిక జీవితము చక్కగా చిత్రింపబడినది. ఆభో అను కవి నాడు సమాజములో వ్యాపించిన వంచనను, దుర్నీతిని వ్యంగ్య, హాస్యధోరణిలో అతి నిశితముగ విమర్శించెను. మతముపేర అమాయికులైన పామర జనులను పలు విధములు వంచించు కపటగురువుల రహస్యములను అతడు ప్రజలకు చాటిచెప్పెను. కావ్య రచనకు కావలసిన ప్రతిభా వ్యుత్పత్తులులేని కారణమున శ్రమపడి ఎట్లో నీరసపు మాటలను జోడించి కవిత్వమును చెప్పెడి కుకవులు రోహిణీకార్తెలోని ఉరుములవలె వ్యర్థముగా ధ్వనిచేయుచుందురని అతడు నిరసించెను.

అటుపిమ్మట 18 వ శతాబ్దములో మొగల్ సామ్రాజ్యము విచ్ఛిన్నమయిన తరువాత మహారాష్ట్రుల దండయాత్రల మూలమున గుజరాతు ప్రాంతమున ప్రజలలో శాంతిభద్రతలు లేకుండెను. ఆ అనిశ్చితస్థితిలో ప్రజలు మనశ్శాంతి సంపాదనమునకై ఆధ్యాత్మిక గ్రంథముల నాశ్రయించిరి. నాటి గుజరాతీ కాల్పనిక సాహిత్యములో నవ్యతయు, రమ్యతయు లోపించెను. కొంతకాలమునకు ఈ యరాజకస్థితిపోయి దేశములో పరిస్థితులు చక్కబడెను. రాజకీయాధికారము బ్రిటీష్ ప్రభుత్వమువారి హస్తగతమయ్యెను. ఆనాటి కవులలో దయారామ్ అను కవి చాల ప్రతిభావంతుడు. అతడు 1760 లో జన్మించెను. దయారామ్ గొప్ప విద్వాంసుడగుటచే వ్రజ భాషలో గూడ కవిత్వము చెప్పగలిగి యుండెను. ధ్యేయకవితా రచనయందు అతడు అందెవేసినచేయి అయ్యెను. "గర్భీ" అను నృత్యగీతములను అతడు అతిరసవంతముగ రచించెను. భావోచితమును, లలితమధురమును అగు పదావళిని కూర్చుటయందు అతడు అసమాన నైపుణ్యమును ప్రదర్శించెను. అతడు వల్లభాచార్య సంప్రదాయమునకు చెందిన రాగాత్మక భక్తిని అనేక మధుర గీతములలో వర్ణించెను. శ్రీకృష్ణుని అధరామృతము నాస్వాధించు వేణువును సంబోధించుచు అతడు రచించిన భావగీతము అత్యంత మనోహరమైనది. దయారామ్ 1852 లో మరణించెను. నాటితో గుజరాతీ సాహిత్యమునందలి ప్రాచీన యుగము సమాప్త మయ్యెనని చెప్పవచ్చును.

దేశములో బ్రిటిషు ప్రభుత్వము నెలకొన్న తరువాత సాంఘిక – సాంస్కృతిక రంగములలో పెక్కు మార్పులు కలిగెను. తమ మతమును విద్యను బోధించుటకు క్రైస్తవ మిషనరీలు మన దేశములో క్రొత్తగా విద్యాలయములను స్థాపించిరి. వారి కృషి మూలమున పాశ్చాత్య సభ్యతా సంస్కృతుల ప్రభావము నానాటికి విస్తరింప నారంభించెను. ఆ ప్రభావమునకు లోనైన యువకులలో సంఘ సంస్కరణాభిలాష హెచ్చెను. నిరక్షరాస్యతను, మూఢ విశ్వాసములను, బాల్యవివాహమువంటి దురాచారములను నిర్మూలించి, విధవా పునర్వివాహము మున్నగు నూతన సంస్కరణములను వ్యాప్తిలోనికి తెచ్చుటకై వారు పట్టుదలతో పనిచేసిరి. సామాజిక వ్యవస్థలో కలిగిన ఈ సంచలనము నాటి సాహిత్య క్షేత్రమును సైతము ఆవరించెను. అపుడే నర్మదా శంకర్, దల్పత్ రామ్ అను యువనాయకులు గుజరాతీ సాహిత్యములో నవయుగో దయ నాందీ గీతమును ఆలపించిరి.

నాటి సాంఘిక దురాచారములను గూర్చి ప్రజలలో ప్రబోధము గావించుటయే ముఖ్య లక్ష్యముగా జేసికొని దల్పత్ రామ్ పెక్కు లఘు కావ్యములను రచించెను. గుజరాతీ కవితారచనకు అతడు సంస్కృత వృత్తములను ఉపయోగించి, ఛందో వైవిధ్యమును ప్రదర్శించెను. అతని కావ్యములలో అడుగడుగునను సరసహాస్యము తొంగిచూచుచుండును. దల్పత్ రామ్ గుజరాతీ వచన వాఙ్మయ వికాసమునకు గూడ ప్రశంసనీయమైన సేవ చేసెను. క్లిష్టాన్వయమును, శబ్ద కాఠిన్యమును లేని సరళమైన వచనశైలిని అతడు రూపొందించి ఇతరులకు మార్గ దర్శకుడయ్యెను.

నర్మదాశంకర్ స్వాతంత్ర్యసిద్ధిని అభిలషించు జాతీయ గీతములను, ప్రణయమును, ప్రకృతి సౌందర్యమును వర్ణించు భావగీతములను వ్రాసెను. పాశ్చాత్య సభ్యతలో మానవుని వ్యక్తిత్వమున కొసగబడు ప్రాధాన్యము అతనిని విశేషముగా ఆకర్షించెను. అతని రచనలలో నవ చైతన్యముతో నిండిన వచన గ్రంథములు ముఖ్యముగా ఎన్నదగినవి. ఇతరుల తోడ్పాటులేక యే గుజరాతీభాషకు అతడు తొలి నిఘంటువును గూర్చెను. నర్మదాశంకర్ గుజరాతీ సాహిత్యమునందు ఒక యుగకర్తగా పరిగణింప

375