పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/423

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుజరాతీ భాషాసాహిత్యములు

సంగ్రహ ఆంధ్ర

లోని తొలి గ్రంథములలో ఒకటి యగు "ముగ్దావబోధ మౌక్తికము" క్రీ. శ. 1394 నాటిదై యున్నది. అది గుజరాతీ భాషలో రచింపబడిన సంస్కృత వ్యాకరణము. మరి యేబది ఏండ్ల తరువాత నరసింహమెహతా భక్తిగీతములతో గుజరాతీ కాల్పనిక సాహిత్య మవతరించెను. గుజరాతీ భాషకు పశ్చిమ హిందీ, రాజస్థానీ భాషలతో అత్యంత సన్నిహిత సంబంధము కలదు. అది మన దేశమునందేగాక ఆసియా, ఆఫ్రికా ఖండములలోని మరి కొన్ని ప్రాంతములలోకూడ వాడుకలో నున్నది.

సాహిత్యము : గుజరాతీ భాషలో మొదట శృంగార గేయములును, వీరరసప్రధానమైన జాతీయ గాథలును, రాస, నృత్యగీతములును, ప్రశ్నోత్తర రూపమున ప్రకృతిలోని వింతలను, విశేషములను చమత్కారముగ వర్ణించు పొడుపుకథలును, పల్లెపట్టుల యందు మౌఖిక ప్రచారము నందుచుండెను. ఈ జానపద సాహిత్యము అచ్చటి గ్రామీణ జీవన మాధుర్యమును మనోహరముగ ప్రతి ఫలింప జేయుచున్నది. మొదట శిష్ట సాహిత్యమునకు రూపురేఖలు దిద్దినవారు జైనభిక్షువులు. వారు తర్క వ్యాకరణాది శాస్త్రములను, ధార్మిక - ఆధ్యాత్మిక గ్రంథములను, నీతి కావ్యములను పెక్కింటిని రచించిరి. క్రీ. శ. 15 వ శతాబ్దమున గుజరాతీ సాహిత్యరంగమున జైనపండితుల ప్రాముఖ్యము అంతరించెను.

అది దేశము కృష్ణకథా సుధారస తరంగములలో ఓలలాడుచుండిన కాలము. నాడు ఏ వంక జూచినను కవులు గోకులమునందలి గోగోపికాగణమును, యమునా తటమున విరియబూచిన కదంబవృక్ష పంక్తులను, బృందావనమున శారద రాత్రులలో రాధికా శ్యామ సుందరుల మహారాసోత్సవమును కోరికోరి వర్ణించుచుండిరి. అప్పుడే మహాభక్తురాలైన మీరాబాయి ' గిరిధర' గోపాలునిపై తన అనురాగాతిశయమును వెల్లడించు ప్రేమభక్తి గీతములను రచించెను. మీరాబాయి రాజపుత్ర స్థానమునందలి చిత్తోడులో నివసించెను. ఆమె గీతములు గౌర్జరీ అపభ్రంశములో రచింపబడినవి. గౌర్జరీ అపభ్రంశము నుండి గుజరాతీ, మేవాడీ, మార్వాడీ బాష లేర్పడినవి. మీరాబాయి గోపికా భావముతో కృష్ణమందిరములో నాట్యముచేయుచు అప్రయత్నముగ ఆలపించిన గీతము లవి. ఆమె కవిత మధురభక్తికి నిధానము. మీరాబాయి భజన గీతములు ఉత్తర హిందూస్థానమున మిక్కిలి ప్రచారములో నున్నవి.

నాటి భక్త కవులలో అగ్రగణ్యుడు నర్సీ (నరసింహ) మెహతా అనునాతడు. అతడు సౌరాష్ట్రములోని జునాగడ్ లో వసించెను. అతడు భక్తిపూరితములైన పద్యములను, గీతములను పెక్కింటిని రచించెను. పరుల బాధను తెలిసికొనగలవానినే వైష్ణవుడందురనుఅర్థముగల" వైష్ణవ జనతో తేనే కహియే జో పీడ పరాయా జాణేరే" అను సుప్రసిద్ధ భజనగీతము గాంధీమహాత్మునకు అత్యంత ప్రియమైనది. ఇది నర్సీ మెహతా రచించినదే. అతని గీతములు అక్షర రమ్యతకును, మధురభావనకును మిక్కిలి ప్రశస్తి గాంచినవి. నర్సీ మెహతా వర్ణ విభేదములను పాటింపక 'అస్పృశ్యుల' తో చేరి దైవము నారాధించుచున్నాడని సాటివారు అతనిని కులమునుండి వెలివేసిరి. కాని ఆ మహనీయుడు అందులకు చలింపక తాను చిత్తశుద్ధితో నమ్మిన విశ్వాసములను జనులకు బోధించుటకు కవిత్వము నొక సాధనముగ జేసికొనెను.

గుణాఢ్యుని బృహత్కథలోని కథలవంటి శృంగార వీరరస సమంచితములయిన కల్పనాకథలు గుజరాతు రాష్ట్రములో చాల కాలముగ ప్రచారములో నుండెను. వాటిలో ప్రణయపథమున తటస్థించు చిక్కులును, కథానాయకు లొనర్చు వివిధ వీరోచిత సాహస కృత్యములును, నాయికా నాయకుల చతుర సరసా లాపములును మనోరంజకముగా వర్ణింపబడినవి. సామల్ భట్టు అను కవి 17 వ శతాబ్దములో ఇట్టి కథలను ఒక్కచో జేర్చి వాటికి కావ్యరూపమును కల్పించెను. చదువు, చక్కదనము, జాణతనము, సంస్కారముగలిగి, జీవితయాత్రలో ఎదురగు చిక్కులను అతిక్రమించుటలో నాయకులను మించిన లోకజ్ఞానమును ప్రదర్శించు కథానాయికలను ఆతడు తన కావ్యములో వర్ణించెను.

నాటి కవులలో ప్రేమానంద్ అను కవి ముఖ్యుడు. అతడు రామాయణ భారతములందలి సన్నివేశములతో గూడిన రసవంతమైన ఆఖ్యానములను, ప్రసిద్ధ భక్తుడైన నర్సీ మెహతా జీవిత విశేషములను చిత్రించు ఒక కావ్యమును రచించెను. కథన శిల్పమునం దతడు

374