పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/420

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుండ్లకమ్మ

గను, తరువాత పురపాలకసంఘ పాఠశాలగను, అనంతరము కమిటీ పాఠశాలగను మారి, ఇపుడు హిందూ కళాశాలగ ఆరు అనుబంధ పాఠశాలలతో మిక్కిలి అభివృద్ధి యం దున్నది.

1951 లో ప్రభుత్వము ప్రచురించిన జనాభా లెక్కలను బట్టి. ఇతర వివరములను బట్టి గుంటూరు నగరమునకు సంబంధించిన ఈ క్రింది కొన్ని అంశములు లభ్యమగు చున్నవి:

నగర వైశాల్యము చ. మై. 5.25
పేటల సంఖ్య 28
జన సంఖ్య 1,25,255
పురుషులు 63,028
స్త్రీలు 62,227
కళాశాలలు 2
బాలుర ఉన్నత పాఠశాలలు 4
బాలికల ఉన్నత పాఠశాలలు 2
బాలుర ట్రెయినింగు పాఠశాల 1
బాలికల ట్రెయినింగు పాఠశాలలు 3
పారిశ్రామిక సంస్థలు 604
హిందువుల సంఖ్య 85,724
పురుషులు 43,600
స్త్రీలు 42,124
ముస్లిముల సంఖ్య 26,190
క్రైస్తవుల సంఖ్య 13,123
జైనులు 213
సిక్కులు 2
జొరాస్ట్రియనులు 3
తెలుగు మాతృభాషగా గలవారు 100,725
ఉర్దు మాతృభాషగా గలవారు 22,130
తక్కిన 18 భాషలవారు వివిధ ప్రాంతీయ ప్రజలు 2,400

1951 వ సంవత్సరము నుండియు గుంటూరుపట్టణము సర్వతోముఖముగా అభివృద్ధిచెందుచున్నది. విస్తీర్ణము అధికముగా పెరిగినది. జనసంఖ్య గూడ బహుళముగా ఎక్కువైనది. అనేక ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ట్రెయినింగు కళాశాలలు, వైద్యకళాశాలలు, ఇంజనీరింగుకళాశాలలు మున్నగునవి స్థాపింపబడినవి. ఇచ్చట నూతనముగా పెద్ద ప్రభుత్వ గ్రంథాలయము, కేంద్ర గ్రంథాలయము నెలకొల్పబడినవి. ఇచ్చట బ్రహ్మాండమైన ప్రభుత్వ వైద్యశాల నిర్మాణము ఇటీవలనే పూర్తియైనది. రెండవ ప్రపంచ యుద్ధకాలమున వాల్తేరులో నున్న ఆంధ్ర విశ్వవిద్యాలయము తాత్కాలికముగా ఈ నగరమునకు తరలించుటయు, 1953 లో ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు హైకోర్టు ఇచ్చట స్థాపింపబడుటయు ఈ నగర ప్రాధాన్యమునకు, విశిష్టతకును ప్రబల దృష్టాంతములు.

వి. సూ.

గుండ్లకమ్మ :

కృష్ణా, గోదావరీ, పెన్నా నదుల తరువాత, ఆంధ్ర దేశమందున్న ముఖ్యమైన నదులలో గుండ్లకమ్మ అనునది ఒకటియై యున్నది. ఈ నది కర్నూలు జిల్లాలోని నల్లమల కొండలలో జన్మించి, కంబము తాలూకాలో తూర్పు వైపుగా ప్రవహించి, మార్కాపురము తాలూకాలో ప్రవేశించి, ఆ తాలూకాలోని తూర్పు భాగములో ఈశాన్యదిశగా నడక సాగించి, 'కందిలేరు', 'దువ్వలేరు' అను రెండు ఉపనదులను తనలో కలుపుకొని, గుంటూరు జిల్లా యందలి వినుకొండ తాలూకాలో ముమ్మడివరము వద్ద ప్రవేశించుచున్నది. గుండ్లకమ్మ, వినుకొండ తాలూకాలోను, ఒంగోలు తాలూకాలోను దక్షిణ భాగము గుండ ప్రవహించి, పెదదేవరంపాడు అను గ్రామమువద్ద బంగాళాఖాతములో కలియుచున్నది. దీని మొత్తము పొడవు 145 మైళ్ళు.

ఈ నది వానకాలములో నిండుగా ప్రవహించుచుండును. అప్పుడు దీనిని దాటుట మిక్కిలి భయంకరమును, ప్రమాదకరమునై యుండును. అందువల్లనే. మన తెలుగుదేశములో “నిండి దరిజేయనీయదు గుండ్లకమ్మ” అను సామెత ఏర్పడియున్నది. దీనికి తరచుగా వరదలు వచ్చి, చుట్టుపట్టులనున్న గ్రామములకును, ప్రజలకును, జంతువులకును, పంటభూములకును నష్టము కలుగు చుండును.

ఈ నదీ ప్రవాహముయొక్క వేగమునకు పెక్కు గులకరాళ్ళును, పెద్ద పెద్ద గుండ్లును కొట్టుకొని వచ్చు

371