విజ్ఞానకోశము - 3
గుంటూరు నగరము
బడినవి రెండగ్రహారములు. అవి శ్యామలదాసు అగ్రహారము, కృష్ణారావు అగ్రహారము అనునవి. శ్యామలదాసు 1760 వ సంవత్సరములో హైదరాబాదు నుండి గుంటూరు వచ్చిన గుజరాతి వర్తకుడు. ఇతడు వాసిరెడ్డి వెంకటాద్రిగారి తండ్రియగు జగ్గన్నరాజాగారి అనుమతిపై ఇరువదినాలు గిండ్లు కట్టించి, వాటిని ఇరువదినల్గురు బీద బ్రాహ్మణులకు ఉచితముగ నొసగెను. ఈ అగ్రహారమునే శ్యామలదాసు అగ్రహార మనిరి. 'జిన్నాటవరు' నుండి పాతగుంటూరు పోయెడి రోడ్డునకు ఉత్తర భాగమునను, క్రొత్తపేట రోడ్డునకు పడమటిదిశ యందును ఈ అగ్రహార మున్నది. వాసిరెడ్డి రాజుల వద్ద మంత్రిగ నుండిన పొత్తూరి కృష్ణారావుగారి పేర పాతగుంటూరు రోడ్డునకు ఉత్తరమునను, క్రొత్తపేట రోడ్డునకు తూర్పునను అగ్రహార మొకటి ఏర్పాటు చేయబడెను. ఇదియే కృష్ణారావు అగ్రహారము. దీనినానుకొని ఉత్తరదిశయందు వాసిరెడ్డివారు తమ కార్యాలయము నిమిత్తమై పెద్ద బంగళా నొక దానిని నిర్మించుకొనిరి. ఇదియే ఇప్పటి పెద్ద పోస్టాఫీసు బంగళా అయి ఉన్నది. కొంతకాలము జరిగిన పిమ్మట 'పట్మన్' అను నొక పాశ్చాత్య కంట్రాక్టరుచే ఈ బంగళా విక్రయించుకో బడెను. ఇప్పటికిని ఈ బంగళా యందు పోస్టాఫీసు ఉన్నది గాని, దీనిచుట్టు నున్న స్థలమంతయు కంట్రాక్టరు యొక్క వారసులచే విక్రయింపబడినది. ఈ బంగళాను ఆనుకొని ఉత్తరదిశనున్న స్థలమంతయు 'మన్నె సుల్తాన్ పేట' యని పిలువబడెడిది. పైని పేర్కొనబడిన శ్యామలదాసు, కృష్ణారావు అనువారి అగ్రహారములును, బావాజీ మఠస్థలమును మన్నె సుల్తాన్ పేటయును కలిసి క్రొత్తపేట అనుపేర బరుగు చున్నవి.
ఆ సమయముననే బావాజి, శ్యామలదాసు అగ్రహారమునకు ఉత్తరభాగమున దరఖాస్తుపై కొంతస్థలమును సంపాదించి ఆ చోట ఒక మఠమును, ఒక దేవాలయమును కట్టించెను. వానితోపాటు ఆచోటనే చెరువునుగూడ నొక దానిని త్రవ్వించెనని తెలియుచున్నది. ఇప్పటికిని ఆ దేవాలయము మాత్ర మచ్చటనేయున్నది. కాని మఠముకాని, చెరువుకాని నామమాత్రమునకైనను కనబడుటలేదు. పూర్వ మిచటనున్న చెరువు నేడు పూడిపోయినది. ఇపుడా చెరువుస్థలము క్రైస్తవ కళాశాలాధికారులచే క్రయమునకు దీసికొనబడి, విద్యార్థుల ఆటస్థలముగ ఉపయోగపడు చున్నది. బావాజీ వంశ్యు లిప్పటికిని ధర్మకర్తలుగనే ఉన్నారు. కాని దేవాలయ పరిపాలనము మాత్రము ప్రభుత్వము వారిచే నియమింపబడిన ఎక్జిక్యూటివ్ ఆఫీసరు స్వాధీనమునం దున్నది.
1766 వ సంవత్సరములో ఇంగ్లీషువారికి కొండపల్లి పరగణాతో సహా ఉత్తర సర్కారు లీయబడెను. అప్పటికి గుంటూరు మాత్రము బసాలతుజంగు క్రిందనే యుండెను. ఫ్రెంచివారు తమ సైన్యమును కొండవీడు నుండి గుంటూరునకు తరలించి, 1752 లో ప్రాత గుంటూరునందు కోట కట్టించిరి. ప్రస్తుతము హిందూ కళాశాల యున్న స్థలమును తమ సైన్యమునకు విడిదిగా నుంచుకొనిరి. 1779 వ సంవత్సరాంతమున ఈ సైన్యములు హైదరాబాదునకు తరలించబడెను. తరువాత ఏడెనిమిది సంవత్సరముల వరకు గుంటూరు నగరము సైఫుజంగ్ అను ఫౌజుదారుయొక్క ఆధీనమున నుండెను. చివరకు 1788 వ సంవత్సరమున ఇది ఇంగ్లీషువారికి స్వాధీనము చేయబడెను. తదాదిగ గుంటూరు నందు ఇంగ్లీషువారి పరిపాలన ప్రారంభమైనది.
ఇంగ్లీషువారి పరిపాలన ప్రారంభమైన కొలదికాలమునకే ఇచట ముఖ్యములైన కచేరీలకు వసతు లేర్పాటు చేయబడినవి. కలెక్టరు కచేరియు, బంగళాయు, జిల్లా కోర్టును, జడ్జి బంగళాయు, తహశ్శీలుదారు కచేరియు, పోలీసు స్టేషను, కొత్వాలు చావడియు, చెరసాలయు ఏర్పరుపబడెను.
దైవభక్తుడును, పవిత్ర వర్తనుడును, మహమ్మదీయ పురోహితుడును అయిన మొహిద్దీను పాదుషా అను నాతడు 1810 వ సంవత్సరమున కాలధర్మము నొందెను. నరసారావుపేట జమీందారగు మల్రాజు వేంకటగుండారావు ఈ మహమ్మదీయ పురోహితునిపేర, గుంటూరు నుండి చిలకలూరుపేటకుపోవు ట్రంకురోడ్డు ప్రక్కన ఒక 'దరగా'ను కట్టించెను. అచట పూజలకొరకు సంవత్సరమునకు ఆకాలమున రెండువందల రూపాయల ఆదాయముగల నూట ఎనుబది యెకరముల భూమిని ధర్మముగ ఆతడిచ్చెను. ఇప్పుడా భూములవలన మూడు
369