పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/415

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు జిల్లా

సంగ్రహ ఆంధ్ర

నారింజ, బత్తాయి, నిమ్మతోటల పెంపకము విరివిగా సాగుచున్నది. మెట్ట తాలూకాలలో పశువుల పెంపకము, గొఱ్ఱెల పెంపకము ఉపవృత్తులై యున్నవి.

యాత్రాస్థలములు : గుంటూరుకు ఉత్తరముగా 20 మైళ్ళ దూరమున కృష్ణానదీతీరమున ఉన్న అమరావతి గొప్ప శైవక్షేత్రము. ఇది పంచారామములని ప్రసిద్ధిచెందిన అయిదు శైవక్షేత్రములలో అమరేశ్వరక్షేత్రమై యున్నది. ఇంద్రప్రతిష్ఠితమని ప్రసిద్ధిగాంచిన ఇచటి శివలింగము సుమారు 10 గజములయెత్తు ఉండును. ఇంతే గాక ఈ అమరావతి జగద్విఖ్యాతమైన బౌద్ధ క్షేత్రము. ఇచట నొక గొప్ప బౌద్ధస్తూపము కలదు. ఇచట త్రవ్వకముల వలన అనేక బౌద్ధ శిథిలములు బయల్పడినవి. దీనికి సమీపములోనున్న ధరణికోట ఒకప్పుడు ఆంధ్ర సామ్రాజ్యమునకు ప్రధానపట్టణమై వెలసినది. దీనినే ధాన్యకటకమని చెప్పుదురు.

మంగళగిరిలో ఫాల్గున పౌర్ణమికి గొప్ప రథోత్సవము జరుగును. ఇది నృసింహ క్షేత్రము. ఇచట కొండమీద నున్న పానకాలస్వామిని గూర్చి అనేక విచిత్రగాథలు కలవు. నర్సారావుపేట తాలూకాలోని కోటప్పకొండలో శివరాత్రి మహోత్సవము, చిలుకలూరిపేటలో రథోత్సవము ఎన్నతగినవి. తెనాలిలో శ్రీరామనవమికి గొప్ప ఉత్సవము జరుగును. తెనాలి తాలూకాలోని సంగం జాగర్లమూడి, చుండూరు, వేజెండ్ల అను గ్రామములు కూడ యాత్రాస్థలములు. ఇవిగాక వెల్లటూరు, కామరాజుగడ్డ, అరవపల్లి, బాపట్ల, చిన్నగంజాం. భట్టిప్రోలు, చెరుకుపల్లి, పొన్నూరు, కారెంపూడి (పల్నాటి వీరులకు చెందినది), చిలువూరు మున్నగునవి కూడ స్థానికముగా యాత్రాస్థలములై యున్నవి. గుత్తికొండబిలము, చేజెర్లలోని కపోతేశ్వరాలయములు కూడ హైందవ క్షేత్రములు. పల్నాడు తాలూకాలో 'ఎత్తిపోతలు' అను పేరితో ఒక జలపాతము కలదు.

భాషలు: ఈజిల్లాలో తెలుగు ప్రధానభాష. మొత్తము 27 మాతృభాషలు మాటాడువారు కలరు. (1951)

తెలుగు మాతృభాషగా కలవారు 2,359,100
ఉర్దు 1,64,474
లంబాడి 7,510
తమిళము 6,145
హిందీ 3,804
ఎరుకల 2,829
హిందూస్థానీ 1,852
మళయాళము 1,664
ఇతర భాషలు (19) 2,618
మొత్తము జనాభా 25,49.996

ఆంధ్రేతర భాషలు మాతృభాషలుగా కలవారిలో 1,26,361 మంది తెలుగు వచ్చినవారుగా నున్నారు.

మతములు - వారి సంఖ్యలు :

హిందువులు 19,84,375
మహమ్మదీయులు 2,09,276
క్రైస్తవులు 3,56,039
జైనులు 273
ఇతరులు 33
మొత్తము 25,49,996

ముఖ్యపట్టణములు :

1. గుంటూరు: ఇది జిల్లా కేంద్ర పట్టణము. ఇది 1,25, 255 మంది జనాభా గల మునిసిపలు పట్టణము. దీనికి పూర్వము గర్తపురి యను నామాంతరము కలదందురు. ఇది యొక రైల్వే కూడలి. తెనాలి నుండి ఒక బ్రాడ్‌గేజి లైను, విజయవాడ, మాచెర్ల, గుంతకల్లుల నుండి మీటరుగేజి లైన్లు వచ్చి యిచట కలియును. ఇచట పొగాకు వ్యాపారము విరివిగా సాగును. మిర్చి, వేరుసెనగ, చేనేత వస్త్రములు కూడ ఇచ్చటి నుండి ఎగుమతి యగు చుండును.

2. తెనాలి : ఇది 58,116 జనాభా కల మునిసిపాలిటీ. ఇది మద్రాసు - కలకత్తా రైలుమార్గముమీద నున్నది. రేపల్లె - గుంటూరు రైలు మార్గముకూడ ఈ పట్టణము గుండా పోవును. కృష్ణకాలువలు కొన్ని ఈ నగరము గుండా పోవును. ఇచట ఒక కళాశాల కలదు.

3. చీరాల : ఇది 37,729 మంది జనాభాకుల మునిసిపాలిటీ. ఇది బాపట్ల తాలూకాలో సముద్ర తీరమందున్నది. ఇచట చేనేతపరిశ్రమ విరివిగా జరుగును. రెండవది పొగాకు పరిశ్రమ. ఈ నగరము బ్రాడ్‌గేజి రైలు మార్గముమీద నున్నది.

366