పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/410

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుంటూరు జిల్లా

గుల 6 అంగుళములు, గోడలమందము సుమారు 4 అడుగులుండును. దీని పునాదులు మిక్కిలి బలిష్ఠములుగా నున్నవి. దీనిపైన కోళ్ళగూడువంటి కప్పుగూడ నున్నది. దీనిలోపలను, మధ్యభాగమునను ఎత్తైన ఒక ఇటుక దిమ్మయు, దానిపైన బుద్ధ విగ్రహము నున్నవి. ఈ విగ్రహము అమరావతి మహాచైత్యములోని మూడవ దశకు చెందిన బుద్ధవిగ్రహమును పోలియుండుటచే ఈ చైత్యాలయము క్రీ. శ. ఒకటవ శతాబ్దపు మధ్యభాగములో నిర్మింపబడి యుండునని ఊహింపబడుచున్నది.

(3) మంటపము : ఇది చైత్యగృహమునకు తూర్పువైపున నున్నది. దీని పొడవు 56 అడుగులు; వెడల్పు 34 అడుగులు. ఇది ఒక సమావేశ స్థలమని పెద్దలూహించుచున్నారు. దీనిలో పెక్కుమంది కూర్చుండుటకు తగునట్లుగా వసతియున్నది. ఈ మంటపములో బౌద్ధ భిక్షువులు కూర్చుండి బౌద్ధ ధర్మములను గూర్చి చర్చించుచుండెడి వారట.

(4) ఇతర స్తూపములు : ఈ మంటపమునకు సమీపముననే ఇతర స్తూపములు అనేకములు కలవు. ఇవి అనేక పరిమాణములలోనుండి, అనేక విధములుగా నిర్మింపబడి యున్నవి. ఈస్తూపముల నిర్మాణ విధానమందు ఎంతయో వైవిధ్యము గోచరించును. ఈ స్తూపములలో ఒకదాని యందు ఒక అవశేష (Relic) పాత్ర లభించినది. అందుచే ఇవన్నియు భిక్షువుల సమాధు లని పెద్దలు తలంచు చున్నారు. ఈ ప్రదేశములో ఇట్టి చిన్న స్తూపములు 35 కన్పడుచున్నవి. ఈ స్తూపము లన్నింటిలోను పెద్దదగు స్తూపముయొక్క వేదికకుగల మెట్ల పైభాగమునందు, సుయజ్ఞనాథుని శిష్యురాలైన 'సానాదా' యను నామె ఆ మెట్లను కట్టించినట్లు తెలుపు శాసనములు గానిపించు చున్నవి. అందుచే ఈ స్తూపములు క్రీ. శ. రెండవ శతాబ్దమునకు సంబంధించినవని పురాతత్త్వ శాస్త్రజ్ఞులు నిర్ణయించుచున్నారు.

(5) శిలా చైత్యము : ఇది ఒక రాతి అరుగుమీద నిర్మింపబడినది. దీని వెలుపలి భాగమంతయు చిన్న చిన్న రాళ్ళతో నిండియుండి చిందరవందరగా నున్నది. ఈశిలా చైత్యమునందు ఒక అవశేషపాత్ర లభించినది. దీనిలో ఒక రాతిబరణి, ఒక స్ఫటికపుపూస, ఒక బంగారపు భిక్షా పాత్ర లభించినవి. ఈ శిలాచైత్యము క్రీ. పూ. రెండవ శతాబ్దమునాటి 'భీల్సా' చైత్యములతో అన్ని విధములను పోలియుండి ఒక ప్రత్యేక విలక్షణతతో నొప్పారుచున్నది.

విశ్వ విఖ్యాతిగాంచిన ఈ పురాతన బౌద్ధ సంఘారామములను సందర్శింపనెంచిన ప్రజలు ఏలూరునుండి కామవరపుకోట వరకు బస్సులపై ప్రయాణముచేసి, అక్కడినుండి గుంటుపల్లికి నడచికాని, బండ్లపై నెక్కిగాని వెళ్ళుదురు. ప్రతిసంవత్సరము దేశపు నలుమూలలనుండి యాత్రికులు అనేకులువచ్చి ఈ పవిత్ర బౌద్ధ క్షేత్రమును సందర్శించి పోవుచుందురు.

పు. వేం.

గుంటూరు జిల్లా:

ఉనికి : ఆంధ్రదేశములో సముద్రతీరమందున్న జిల్లాలలో గుంటూరుజిల్లా యొకటి. ఈ జిల్లా 15° 18'-16° 50' ఉత్తర అక్షాంశముల మధ్యను, 79°10′- 80°55′ తూర్పు తులాంశముల మధ్యను ఉన్నది. ఈ జిల్లా రూపము చూచుటకు ఒక గొడుగు ఆకారములో నుండును. దాని పిడికఱ్ఱ దక్షిణమును చూపుచుండును. దీనికి ఉత్తరమున కృష్ణానదియు, దాని వెంబడి తెలంగాణములోని నల్లగొండ జిల్లాయు, తూర్పున కృష్ణాజిల్లాయు, బంగాళాఖాతమును, దక్షిణమున నెల్లూరుజిల్లాయు, పశ్చిమమున నెల్లూరు, కర్నూలు, మహబూబునగరు జిల్లాలును సరిహద్దులుగా నున్నవి.

ఈ జిల్లా విస్తీర్ణము 5,771 చ. మై. ఇందలి గ్రామముల సంఖ్య 727. పురములు 25. జనాభా 1951 లెక్కల ప్రకారము 25,49,996. ఇందు పురుషుల సంఖ్య 12,91,745, స్త్రీల సంఖ్య 12.58, 251. జనసాంద్రత 442. పట్టణవాసులు 5,01,921. గ్రామీణులు 20,48,075, గృహముల సంఖ్య 4,91,670. 1961 జనాభా లెక్కల ప్రకారము జనాభా 30,09,997.

ఈ జిల్లాలో 9 తాలూకాలు కలవు.

1. నర్సారావు పేట తాలూకా :

విస్తీర్ణము చ. మై. 716
గ్రామములు 106
పురములు (నర్సారావుపేట, చిలకలూరి పేట) 2

361