పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/404

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గిడుగు వేంకట రామమూర్తి

మాసపత్రికను నెలకొల్పి అందులో వ్యావహారిక భాషావాదమునకు అనుకూలములైన వ్యాసములను, 'పండిత భిషక్కుల భాషా భేషజము' అను వ్యాసమును, "బాలకవి శరణ్య" మనుపేర కవి ప్రయోగములను ప్రదర్శించుచు కొన్ని వ్యాసములను ప్రకటించిరి. 1921 సం. వచ్చుసరికి వారి వాదమును అంగీకరించిన వారు తెలుగుదేశ మంతటను వ్యాపించి యుండిరి. 1925 లో తణుకులో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిష ద్వార్షికోత్సవ సందర్భములో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు కవి పండిత దిగ్గజముల సమక్షములో రామమూర్తిగారు వ్యావహారిక భాషా వాదమును సమర్థించుచు మహోపన్యాసము గావించిరి. వారి వాదమును ఎదిరించుచు ఎవరును సభాముఖమున ప్రసంగింపలేదు. ఈ వాదమునకు అనుకూలమైన తీర్మానము గూడ సభాసమ్మతమైనది.

దేశమందు దినదిన ప్రవర్థమానముగా వ్యాపించు చుండిన వ్యావహారిక భాషోద్యమమును గ్రాంథిక వాదులు అరికట్టలేకపోయిరి. వందల కొలదిగా గ్రంథములు వాడుక భాషలో రచితములగుచుండెను. వ్యావహారిక భాషను ఆమోదించి, అందులో గ్రంథరచన సాగించుటకై ఏర్పడిన సాహిత్య సమాజము, నవ్యసాహిత్య పరిషత్తు వర్ధిల్లి, వాడుకభాషలో గ్రంథములను తగిన వారిచే రచియింపించినవి.

రామమూర్తిగారు అస్వస్థులై చికిత్సకొరకు మద్రాసు చేరి 1940 జనవరి 20 వ తేదీన స్వర్గస్థులైరి. తన జీవితకాలములో తమ భాషా వాదమును ప్రభుత్వమువారు, విశ్వవిద్యాలయములవారు అంగీకరింపకపోయినను, ప్రజా బాహుళ్య మామోదించినందులకును, రచయితలు, పత్రికాధిపతులు దానిని శిరసావహించి ఆచరణయందు పెట్టు చున్నందులకును రామమూర్తిగారు ఆనందమును ప్రకటించిరి.

రామమూర్తిగారు 1910-12 లో సవరభాషకు సంబంధించిన గ్రంథములను తెలుగు లిపిలో రచించిరి. వీటిని మద్రాసు ప్రభుత్వమువారు ప్రకటించి రామమూర్తిగారికి ' రావుసాహెబ్' బిరుదము నొసంగిరి. అనంతరము 1929-31 లో రామమూర్తిగారు ఇంగ్లీషు-సవర, సవర-ఇంగ్లీషు నిఘంటువులను 'సవరమాన్యుయల్ 'ను ఇంగ్లీషు భాషలో రచింపగా, వాటినిగూడ మద్రాసు దొరతనమువారే ప్రకటించి, రామమూర్తి గారికి 'కైజర్-ఇ-హింద్' బంగారు పతకమును 1934 లో ఇచ్చి గౌరవించిరి.

1934 లో రామమూర్తిగారి సప్తతితమ మహోత్సవము రాజమహేంద్రవరములో నవ్య సాహిత్య పరిషత్తువారు జేగీయమానముగా జరిపినారు. ఆ ఉత్సవము నాటికి నవ్య సాహిత్య పరిషత్తువారు ఈ క్రింది అయిదు గ్రంథములు ప్రకటించి రామమూర్తిగారికి కానుకగా సమర్పించినారు.

1. “వ్యాససంగ్రహము” ఇందులో ఇతరులు రచించిన వ్యాసములుక లవు.

2. రామమూర్తిగారు రచించిన వ్యాసములు-కొన్ని ఇంగ్లీషులో నున్నవి. కొన్ని తెలుగులో నున్నవి. అన్నియు భాషకు సంబంధించినవే.

3. “పండితభిషక్కుల భాషాభేషజము"- రామమూర్తి కృతము.

4. "బాలకవి శరణ్యము"-రామమూ ర్తికృతము.

5. “గద్యచింతామణి" - రామమూర్తిగారు సంప్రతించినది. ఇందులో చిన్నయసూరికి ముందుకాలము నుండియు వాడుక భాషలో రచితములయిన గ్రంథముల నుండి రామమూర్తిగారు ఎత్తిచూపించిన తునుకలుగలవు.

రామమూర్తి గారు ఉదార స్వభావులు. హరిజనోద్యమము పుట్టక పూర్వమే చాలకాలము క్రిందట హరిజనుల వలెనే అంటరానివారుగా ఉండిన సవరల పిల్లలను నలుగురిని వారు తన యింట నుంచుకొని, వారికి విద్య నేర్పించిరి. విధవా వివాహములను, స్త్రీలకు ఉచిత విద్యాలయములను ప్రోత్సహించిరి. యువతీ వివాహములను ప్రోత్సహించు 'శారదా చట్టము'నకు అనుకూలముగ పనిచేసిరి. వీరి శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు ఈనా డాంధ్రదేశమందు పెక్కురు గలరు. వీరికి నలుగురు కొడుకులు - సీతాపతి (ఈ వ్యాస రచయిత) వీర రాజు, రామదాసు, సూర్యనారాయణ అనువారలు కలిగిరి.

గి. వేం. సీ.

355