పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/402

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గిడుగు వేంకట రామమూర్తి

గ్రంథములు రచింపవలెనన్న అభిలాష రామమూర్తిగారికి మెండయ్యెను. వారు సవర, ఒరియా, తెలుగు భాషలు తెలిసిన ఒక పైడిజాతి వానిని గురువుగా పెట్టుకొని సవరభాష నభ్యసించిరి. కాని అది స్వచ్ఛమైన సవరభాష కాక, ఒరియా తెలుగు పదములతో కలసియుండెను. అందుచే గురువు అలవరచిన పరిజ్ఞానముతో వీరు వేసవి సెలవులలో సవరలు మెండుగానుండు గుణుపురము మొదలగు ప్రదేశములలో తిరిగి, స్వచ్ఛమైన సవరభాష నభ్యసించిరి; వారి ఆచార వ్యవహారములు, సంప్రదాయములు తెలిసికొనిరి. ఆ సమయములో రామమూర్తిగారు మాళువా (మన్య) జ్వరముతో బాధ పడుచు, తన్నివారణార్థము మిక్కుటముగా 'క్వినైన్' మ్రింగిన ఫలితముగా క్రమముగా వారికి చెవుడు సంక్రమించినది.

ఈ వ్యాసంగముతో పాటు, మరొక కార్యములోగూడ వీరు నిమగ్నులైరి. 1890 లో రామమూర్తిగారు ముఖలింగమునకు వెళ్ళి అచ్చటి అచ్చటి దేవాలయము లందలి శాసనములలో గల ప్రాచీనకాలపు లిపిని అలవరచుకొన ప్రారంభించిరి. ఆ కాలము వరకును ఆ లిపిని నేర్చినవారెవరును ఆ ప్రాంతమందు లేరు. రామమూర్తిగారికి పర్లాకిమిడి రాజావారి కనిష్ఠ సోదరునితో చెలిమి కలిగినది. ఆతని కొక గ్రంథాలయ ముండెను. ప్రాచీనలిపి స్వరూపము తెలియజేయు 'బర్నెల్ ' విరచిత గ్రంథము తన కుపకరింపగలదని రామమూర్తిగారు మనవి చేయగా, ఆ రాజకుమారుడు ఆగ్రంథమును తెప్పించి గ్రంథాలయమం దుంచెను. ఆ గ్రంథసహాయమున ముఖలింగమందలి శిలాశాసనములను స్వయంకృషితో చదువ గల శక్తిని వారు అలవరచుకొనిరి.

1894 లో దీర్ఘాసి శాసనమందలి సీసపద్యమును చదివి, 'ఎపిగ్రాఫియా ఇండికా' అను పత్రికకు వ్యాసము పంపిరి. ఆ సంవత్సరమే ముఖలింగమునకు సంబంధించిన ప్రాచీన చారిత్రకవిషయములనుగూర్చి వ్రాసినవ్యాసము 1895లో మద్రాసు లిటరరీ సొసైటీ పత్రికలో ముద్రితమైనది.

చిత్రము - 101

గిడుగు వేంకట రామమూర్తి

సవరలనుగురించి వీరు వ్రాసిన మరొక గ్రంథము ననుసరించి 'థర్‌స్టన్' రచించిన “దక్షిణ భారతములోని కులములు, తెగలు" (Castes and Tribes of Southern India) అను గ్రంథసంపుటిలో 'సవరలు' అను శీర్షికక్రింద పెక్కు విషయములు ప్రకటితములైనవి. వజ్రహస్తుని తామ్ర శాసనము మొదలైన తూర్పు గాంగవంశరాజుల దాన శాసనముల కొన్నిటిని వీరు ప్రకటించిరి. ఈ రాజుల రాజధాని ముఖలింగనగరమేకాని కళింగ పట్టణము కాదనియు, ముఖలింగనగరమునకు ప్రక్కనున్న నగరికటకము చతురంగబలములకు నిలయమనియు, కళింగపట్టణము రాజులకు రేవు పట్టణమనియు వీరు రుజువు చేసిరి. 'నగరం' మను పేరు రాజధానికిని, 'పట్టణ' మను పేరు రేవుస్థలమునకును పెట్టుట ప్రాచీన సంప్రదాయమని గూడ వీరు తెలియజేసినారు.

1895 లో పర్లాకిమిడి ఉన్నతపాఠశాల సెకండ్‌గ్రేడ్ కళాశాలగా మారగా, మరుసంవత్సరము రామమూర్తిగారు అందులో చారిత్రకోపాధ్యాయులుగా నియమింపబడిరి. వారు ఆచార్యత్వమును విరమించునంతవరకు

353