పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/399

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాల్టను ఫ్రాన్సిస్

సంగ్రహ ఆంధ్ర

వారు దానికి “నైటాను (Niton)" అను పేరు బెట్టిరి. గాలిలో దీని ఉనికి వలనను, ఋణవిద్యుత్ పూరకము గావింపబడిన తీగపై ఏర్పడు "రేడియో ఏక్టివ్ పొర (Radio active layer) వలనను, రేడియము లవణములను నీట కరగించినపుడు వెలువడు వాయువులలో ఇది ఉండుట వలనను, రేడియం పరమాణువు ఒక ఆల్ఫాకణమును (L-Particle) కోల్పోవుటచే ఇది లభించుట వలనను, దీనికి రేడాను అను పేరు వచ్చెను.

గాలి-దాని ఉపయోగములు : గాలి వివిధ వాయువుల మిశ్రమము ఐనందున దాని ఉపయోగములు దాని వివిధ ఘటకములపై ఆధారపడి యుండును.

వస్తువులు మండుటకొరకును, ప్రాణికోటియొక్క శ్వాసక్రియలకొరకును, గాలియందు ఆక్సిజను మిక్కిలి అవసర మగుచున్నది. కనుకనే ఆక్సిజనును ప్రాణవాయు వని పిలిచిరి. గాలియందలి ఆక్సిజను యొక్క గాఢతను తగ్గించి అగ్నిప్రమాదములకు లోనుగాకుండునట్లు చేయుటకును, వృక్షములకు నైట్రేటులను తయారుచేయుటకును, నత్రజని ఉపయోగకారిగానున్నది. గాలిలోని కర్బన ద్వ్యమ్లజనిదమును ఆధారముగ చేసికొని వృక్షములు కిరణజన్య సంయోగక్రియ (Photo synthesis) ద్వారా పిండిపదార్థములను (Carbo hydrates) తయారుచేసి కొనుచున్నవి.

ఆర్గానును ఎక్కువ కాంతివంతమైన దీపములలో (incandescent lamps) ఉపయోగింతురు. ఆర్గాను, పాదరసపు టావిరుల మిశ్రమముతో దీపముల నింపినపుడు చక్కని నీలికాంతిని వెలువరించును. హీలియము గాలి ఓడలను నింపుటకు ఉపయోగపడును. హీలియము, నియానుల మిశ్రమముతోనింపిన విద్యుద్దీపములు బంగారు వన్నె వెలుతురు నిచ్చును. నియాను గుర్తులు గాలి ఓడల ప్రయాణమునకు పొగమంచుగల వాతావరణములో మిక్కిలి సహాయకారులుగా నున్నవి. రేడాను సామాన్యమైన గాజునకు ఊదా రంగును కల్పించును.

డి. శి.


గాల్టను ఫ్రాన్సిస్ :

సర్ ఫ్రాన్సిస్ గాల్టను పందొమ్మిదవ శతాబ్దమునకు చెందిన బ్రిటిష్ శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు. గాల్టను యొక్క బహుముఖప్రజ్ఞ ఇతడు గావించిన అనేకములైన పరిశోధనములలో ప్రస్ఫుటముగ కనిపించుచున్నది. శాస్త్రదృష్టితో సంకలితమయిన గాల్టనుయొక్క అభిరుచుల ప్రభావము మనస్తత్త్వ శాస్త్రమునందలి పెక్కు నంశములపై ప్రసరించెను. ఆతనియొక్క విజ్ఞానప్రభావము బ్రిటిషు, అమెరికను దేశములందలి మనస్తత్త్వ శాస్త్ర పరిశోధనలపై విశేషముగ అభివ్యక్తమయినది.

గాల్టను 1822 వ సం. ఫిబ్రవరి 16 వ తేదీన బర్మింగుహామునందు జన్మించెను. విద్యాభ్యాసానంతరము ఇతడు ఆఫ్రికాఖండమునందు 1845-55 సం.ల మధ్య కాలమున మానవశాస్త్రము (Anthropology) నందు పరిశోధనము కావించెను. 1853 వ సం. లో “దక్షిణాఫ్రికా పరిశోధనలు" (An Explorer in Tropical South Africa), అను గ్రంథమును, 1855 వ సం. లో "కళా విహారము" (Art Travel) అను గ్రంథమును రచించెను.

పిదప గాల్టను వాతావరణశాస్త్రము (Meteorology) నందు పరిశోధన మొనర్పగడగెను. వాతావరణ పటములను శాస్త్రపద్ధతి ననుసరించి నిర్మించుటయందు గాల్టను మొట్టమొదటివాడని చెప్ప వచ్చును. 'ప్రతిచక్రవాత' (Anticyclones) సిద్ధాంతమును మొదట స్థిరీకరించినవాడు గాల్టనే.

ఈ కాలమున తన బంధువగు డార్విన్ వ్రాసిన 'జీవరాసుల పుట్టుక' (Origin of Species), అను గ్రంథ (1859) పఠనముచే ఉత్తేజితుడై గాల్టను మానవశాస్త్ర (Anthropology) పఠనమునందు నిమగ్నుడయ్యెను.

గాల్టను తన జీవితమునందలి విశేష భాగమును మనస్తత్త్వ శాస్త్రమునందలి వివిధ విషయములలో పరిశోధన మొనర్చుటయందే గడిపెను. వ్యక్తి భేదములను (Individual Differences) గూర్చి సంఖ్యాశాస్త్ర (Statistics) సహాయమున పరిశోధనము చేయదొడగెను. మానవలక్షణముల (Human traits) పై సంఖ్యాశాస్త్ర ప్రయోగమును గావించి పరిశోధనములను కొనసాగించినట్టి ఖ్యాతి మొట్టమొదట గాల్టనునకే దక్కినది. జీవాభివృద్ధి శాస్త్రము (Eugenics) నకు గాల్టను జనకుడుగా పరిగణింపబడు చున్నాడు.

గాల్టను, వంశపారంపర్యముగా సంక్రమించు మానవ

350