పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/397

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాలి - జడవాయువులు

సంగ్రహ ఆంధ్ర

పోవుచున్నాను. విదేశీయులతో పోరాటము సాగింపగోరువారు నావెంటరండు. నేను జీతబత్తెములను ఇయ్యజాలను. నానుండి మీకు లభించునవి ఆకలి, దప్పిక, యుద్ధములు, మరణము మాత్రమే."

గారిబాల్డి చేసిన యిట్టి గంభీర వాక్యార్థములను గ్రహించి, అతని శంఖారావమును విని, నాలుగువేల మంది ఆతనితో బయలుదేరిరి. వారితోబాటు గారిబాల్డి సతియు నుండెను. ఈ దండు సాగిపోవుచు, దారి పొడుగునను ఎన్నో కష్టములు పడవలసివచ్చెను; కొందరు చనిపోయిరి ; మిగిలినవారు గమ్యస్థానము చేరగలిగిరి. కాని త్రోవలో గారిబాల్డి భార్య జబ్బు పడెను. ఒక బెస్తవాని గుడిసెలో ఆమె మరణించెను. వెనుకనుండి శత్రుసేనలు తరుముకొని వచ్చుచుండుటచే, భార్యశవమును బెస్తవానికి నొప్పజెప్పి గారిబాల్డి ముందు ప్రయాణము సాగింపవలసివచ్చెను.

కొంతకాలమువరకు ఏమియు జరుగలేదు. గారిబాల్డి 'కాప్రెరా' ద్వీపములో శాంతముగ జీవితము గడపు చుండెను. తరువాత వేయిమంది సైన్యముతో ఓడ ప్రయాణముచేసి సిసిలీ ద్వీపముపై దాడిసలిపెను. ఎంతో కష్టముమీద భూమిపై దిగిరి. ఆ యుద్ధములో గారిబాల్డి నేపుల్సు రాజును ఓడించెను. ఇప్పుడు గారిబాల్డి యొద్ద ఇరువదివేల సైన్యముండెను. ఈ సైన్యముతో గారిబాల్డి ఇటలీ నడిగడ్డపై నడుగిడెను. గారిబాల్డిని ఎదుర్కొని యుద్ధము చేయుటకు ఎవరును సాహసింపరైరి. అచ్చటి సైన్యమంతయు నతనికి లొంగిపోయెను. ప్రజలు జయధ్వానములు చేయుచు గారిబాల్డికి స్వాగత మిచ్చిరి. గారిబాల్డిని తమ ముక్తిదాతగా ప్రజలు కీర్తించిరి. ఇటలీ యందలి వివిధ ప్రాంతములు కలుపబడి ఒక్క ప్రభుత్వము క్రిందికి తేబడెను. ప్రజల యభిప్రాయము ప్రకారము విక్టరు ఎమ్మాన్యుయల్ ఇటలీ దేశమునకు రాజుగా ఎన్నుకోబడెను.

తనదేశము అఖండమై వృద్ధినొందుచుండుట చూచుచు గారిబాల్డి చాల కాలము జీవించెను. గారిబాల్డి చేసిన ఆలోచనలకు, సన్నాహములకు ఫలితము ఇదియే.

ఇప్పటికిని ఇటలీ ప్రజలు గారిబాల్డిని భక్తిభావముతో స్మరించెదరు. నిష్కాపట్యము, నిస్వార్థత, గారిబాల్డి యొక్క ప్రత్యేక గుణములు. ఆతని దేశభక్తి స్వార్థరహితమైనట్టిది. గారిబాల్డి అందరకు ఆదర్శపురుషుడు.

ఆ. వీ.

గాలి - జడవాయువులు :

భూమిని చుట్టియున్న వాతావరణమును గాలి యందురు. ఇది కంటికి కనిపించక పోయినను ఇది వీచుట వలనను, వస్తువులలో కలుగు చలనము వలనను, స్పర్శ వలనను దీని ఉనికిని గుర్తించనగును. వాన్ గెరిక్ (Von Guerike) మున్నగు శాస్త్రవేత్తలు తమ పరిశోధనముల మూలమున, గాలి తన బరువు వలన భూమిపై కొంత ఒత్తిడిని కలిగించునని నిర్ణయించి, ప్రమాణ వైశాల్యముపై గల ఈ ఒత్తిడికి వాయుపీడనమని పేరు పెట్టిరి. ప్రాచీనకాలమున గాలి సహజశక్తిగా పరిగణింపబడెను. నౌకా యానమునకును, పిండిమరలు మొదలగు యంత్రములను నడుపుటకును, గాలి ఉపయోగింపబడెను. హీసోయిడ్ (Hesoid) అను శాస్త్రజ్ఞుడు గాలిలో కలుగు చలనమునకు కారణము సూర్యుని వేడిమియై యుండునని ఊహించెను.

ఈ గాలి అనాది నుండియు మూల పదార్థములలో నొకటిగా భావింపబడుచు వచ్చెను. టెసిబియసు (ctesibius), హీరో (Hero) మున్నగు శాస్త్రవేత్తలు గాలియొక్క ధర్మములను తెల్పు న్యూమేటిక్సు (Pneumatics) అను శాస్త్ర భాగమును కనుగొనిరి. ఈ శాస్ర సహాయమున, గాలి అంతకుముందు భావింపబడినట్లు ఒకే మూల పదార్థము కాదనియు, అది వేరు వేరు వాయువుల కలయికచే ఏర్పడి యుండుననియు గుర్తించిరి. 17, 18 శతాబ్దములలో దహనక్రియను (Combustion) గూర్చిన పరిశోధనల మూలమున ముఖ్యముగా ప్రాణవాయువు (Oxygen ), నత్రజని (Nitrogen), అను వాయువులను గాలి కలిగి యున్నదను విషయము రూఢమైనది. కేవన్‌డిష్ (Cavendish), ప్రీ స్ట్లే (Priestley), లెవోజి (Lavoisier), మొదలగు శాస్త్రజ్ఞులు ఈ విషయము పైననే పరిశోధనలు జరిపి గాలియందు ప్రాణవాయువు నూటికి 20.833 భాగములును, నత్రజని 79.167 భాగములును కలవని నిర్ణయించిరి.

కొన్ని ప్రయోగముల ఫలితముగా గాలియందు వస్తువులు మండుటకు సహాయపడు భాగము ప్రాణవాయువు

348