పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/396

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గారిబాల్డి

ప్రదర్శన లిచ్చువారు ఆ ప్రదర్శనలోని మూల రహస్యమును ఎవరికిని తెలియకుండ కాపాడుకొనుట పైననే ప్రదర్శనయొక్క జయము ఆధారపడి యున్నది. కనుకనే సాధారణముగ గారడీ విద్యాప్రవీణుల మాయలు మిగిలినవారికి తెలియుట కష్టము. ఐనను 19 వ శతాబ్దము నుండి ప్రపంచములోని గారడి విద్యాప్రవీణు లందరు సాధ్యమైనంతవరకు ఒకరిని గురించి మరియొకరు తెలిసి కొనుటయు, వారివారి విద్యలను పోల్చుకొని అన్యోన్యముగ అందలి మర్మములను తెలిసికొని సహకారము నెరపుకొని తమ విద్యను అభివృద్ధి చేసికొనుటయు జరుగుచున్నది. దీనికై 'అంతర్జాతీయ ఐంద్రజాలికుల సంఘము (International Magicians Circle) అను సంస్థయు కూడ నెలకొల్పబడినది.

హెచ్. పి. సుర.


గారిబాల్డి :

సుమారు నూరు సంవత్సరముల క్రిందట ఇటలీదేశము ఒక్క రాజ్యముగా నుండి యుండలేదు. ఆ దేశముయక్క వేర్వేరు భాగములను వేర్వేరు రాజులు పరిపాలించు చుండిరి. ఇట్లు పెక్కు ప్రభుత్వముల మధ్య పడి యుండుటచే, ఏకీభావము లేక మానసికముగ, సాంఘికముగ, రాజకీయముగ ప్రజలు ఎన్నో బాధలు పడుచుండిరి. ఈ దుస్థితిని తొలగించి ఇటలీ ప్రజలు ఒక్క ప్రభుత్వము క్రింద నుండి కష్టసుఖములు సమానముగా ననుభవించునట్లు ప్రయత్నించ కొందరు దేశభక్తులు బయలుదేరిరి. ఇట్టి దేశభక్తులలో "గారిబాల్డి" ఎన్నదగినవాడు.

జోసెఫ్ గారిబాల్డి 1807 వ సంవత్సరములో నైస్ అను పట్టణములో జన్మించెను. ఇతడు చిన్నతనములో తండ్రితో సముద్ర యానము చేయుచుండగా, సముద్రతీరము లందు కొందరిని చూచుట తటస్థించెను. వారందరు ఇటలీ దేశీయులే. వారు తమ మాతృదేశపు విముక్తికై ప్రయత్నించిన కారణమున, దేశద్రోహులుగా పరిగణింపబడి వెళ్లగొట్ట బడినవారు. వీరితో యువకుడగు గారిబాల్డియు చేరెను. వారందరు ఒక కూటమిగా చేరి వివిధ రాజరికములను మట్టుబెట్ట సంకల్పించిరి. వీరు ధైర్యము కలవారే కాని అంతగా వివేకము కలవారు కారు. కావున మొట్టమొదట ఇటలీ ప్రజలను కూడగట్టుకొన వలయునను జ్ఞానము లేక ప్రభుత్వము పయి తిరుగుబాటుచేసి విఫలులయినట్టి వారు. నాయకు లెందరో వధింప బడిరి. గారిబాల్డి ఎట్లో తప్పించుకొని దక్షిణ అమెరికాకు పారిపోయెను.

మాతృభూమినివీడి గారిబాల్డి పదునాలుగు సంవత్సరములు ప్రవాసములో నుండెను. అతడు దక్షిణ అమెరికాలో వర్తకము చేయుచు, అచ్చటి యుద్ధములలో పాల్గొనుచు దినములు గడుపుచున్నను, దేశవిముక్తి కొరకు సన్నాహములు చేయుచునే యుండెను.

దక్షిణ అమెరికాలో నున్నప్పుడే గారిబాల్డి యొక కన్యను వివాహమాడెను. గాలిబాల్డి వలెనే ఆమెయు ధీరురాలు. అచ్చటజరిగిన యొక యుద్ధములో ఆమె శత్రువులచేతిలో పడెను. ఏలాగయినను తప్పించుకొనిపోయి భర్తను కలియుటకు ఆమె నిశ్చయించుకొనెను. ఆమె యొకనాడు రక్షకభటుల కండ్లలో దుమ్ముకొట్టి, చురుకైన గుఱ్ఱమునెక్కి దౌడుతీసి శిబిరమునుండి బయటపడెను. నాలుగు దినములుగా గుఱ్ఱముమీదనే స్వారిచేయుచు, బయళ్లను గడచి, అరణ్యములనుదాటి, మహానదులనీది, గుట్టలెక్కి పోయిపోయి చివరకు భర్తను గలిసెను. ఆమె తనభర్తయెడ చూపిన గాఢవిశ్వాసము, పతిభక్తి గారిబాల్డికి ఎంతో ప్రోత్సాహమును, ఆనందమును కలిగించెను.

ఇటలీలో స్వాతంత్ర్య భావములు ప్రబలుచుండెను. ఇటలీ ప్రజలు గారిబాల్డిని మాతృదేశమునకు ఆహ్వానించిరి. అవసరమయిన సన్నాహములు జరుగుచుండెను. కనుక, గారిబాల్డి 1848 లో మరియొకసారి మాతృభూమికి వచ్చెను.

స్వదేశమునకు రాగానే గారిబాల్డి ఏమియు చేయలేదు. కాని, పోపురాజ్యము రిపబ్లికు (ప్రజాప్రభుత్వము) కాగానే ఇతడు క్రొత్త ప్రభుత్వము పక్షమున నిలిచెను. ప్రజలకిప్పుడు గారిబాల్డివంటి నాయకమణి కావలసి యుండెను. నేపుల్సు, ఫ్రాన్సు ప్రభుత్వముల వారు రిపబ్లికుపయి దండయాత్రచేసిరి. యుద్ధములో రిపబ్లికు ఓడిపోయెను. అయినను గారిబాల్డి నిరుత్సాహపడక ప్రజలతో ఇట్లనెను.

“ఏ భాగ్యదేవత నేడు మనలను వంచించినదో. ఆమె రేపు మనలను ప్రేమించును. నేను రోము నగరమునకు

347