పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/392

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గానశాహిత్యము


వాంఛతిధీరపిమే గానవైఖర్యా
మహిమానం తవ గాతుం
కృష్ణాతటవాసిన్ కదళీవనమందిరజయరే.

ఈ గీతము కృష్ణాతీరమందు కృష్ణా జిల్లా దివి తాలూకాలోని పెదకళ్ళేపల్లి అను అగ్రహారములోని నాగేశ్వరస్వామిపై చెప్పబడినది. ఇట్టివి వందలకొలది గీతములను వ్రాసియున్నాడు. వాటియందు సంస్కృతసాహిత్యములోని సొగసు లన్నియు చేర్చబడి యున్నవి. వర్ణముల సాహిత్యములలో అచ్చటచ్చట పటిష్ఠమైన తెనుగు సాహిత్యములు గలవు.

శంకరాభరణ రాగమున ఆటతాళ వర్ణములో-


పాపము ! అపార మధుపాళుల ఎడ కృ
పారహితమై సపా యనుచు పాటలను
పాడు, చెలి పాలిటి కపాయ
మగు పాటిగను (పా)

స్వరజతులయందు గూడ

(1) కుందముకుళ రద, సురబృందవినుత పద, భువిలో వర
దాయకి గద, నామొఱలు చెవులను వినవా గిరిసుత.

(2) నీపవననిలయా, సురసముదయాకర, విధృత కువ
లయ, మదదనుజవారణ మృగేంద్రార్చిత, కలుష
దహన, ఘనాపరిమిత వైభవము గల నీ స్మరణ
మదిలో దలచిన జనాదులకు బహుసంపదల నిచ్చే
విభుడు మా కభయ మియ్యవే.

ఈపైవి శ్రీ శ్యామశాస్త్రిగారి స్వరజతులలోని రచనలు. ఇవియు శబ్దార్థాలం కారయుతములు .

ఇక కీర్తన రచనా విశేషములు, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో శ్రీ ముత్తుస్వామిదీక్షితులవారు తమ గేయముల నన్నిటిని సంస్కృతభాషయందే రచించిరి. “సహితానాం భావః సాహిత్యం" అను సంస్కృతో క్తి ననుసరించి సర్వశాస్త్ర భావములతో గూడినదియే సాహిత్య మనబడును. ఈ నానుడి ననుసరించినవి శ్రీ దీక్షితులవారి కీర్తనముల సాహిత్యములు. వేదాంతశాస్త్ర, మంత్రశాస్త్ర, జ్యోతిశ్శాస్త్ర, అలంకారశాస్త్ర సంప్రదాయములతో నిండియున్నవి.


"శ్రీ వరలక్ష్మీ" అను శ్రీరాగ కీర్తనమున :

"శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదేపదే" అను ప్రయోగమును ; “మా యేత్వం" అను తరంగిణి రాగ కీర్తనలో “సారసకాయే, రసకాయే, సకాయే" అను నదియు; "త్యాగరాజ యోగవైభవం" అను కీర్తనలో "త్యాగరాజ యోగవైభవం, అగరాజ యోగవైభవం, రాజయోగ వైభవం, యోగవైభవం, వైభవం, భవం, వం" అను ప్రయోగమును; "శం. ప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వస్వరూప ప్రకాశం సకల తత్త్వస్వరూప ప్రకాశం" అను ప్రయోగమును శబ్దాలంకార విలసితములై భాషా చమత్కృతిని దెల్పుచున్నవి. వీరి కీర్తనములలో ఇట్టి ప్రయోగములు అసంఖ్యాకములు గలవు. నవావరణ కీర్తనములు మంత్రశాస్త్ర సంప్రదాయములతో నిండి యున్నవి. నవగ్రహ కీర్తనములు, జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయములతో నిండియున్నవి. అనేక శాస్త్ర సంప్రదాయముల నెరిగినవారు కాని వీరి కీర్తనముల అర్థమును గ్రహింపజాలరు.

శ్రీ శ్యామశాస్త్రులవారి కీర్తనములు ప్రౌఢసాహిత్య శోభితములు; సంస్కృత సమాస భూయిష్ఠములు ; శబ్దాలంకార విలసితములు; ప్రశస్త భావపూరితములు.

సావేరి కీ ర్తనలో :

“ధారాధర వినీల కచలసితా - సరస కవితా నిచితాసార ఘనసార సిత - దరహసితా వారిరుహ వారి వదనో చిత వాగీశ వినుత భృతనత నారాయణి శ్యామకృష్ణ నుత నా-మనవిని విను గిరిసుత దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢశరీరినిగ సల్పు నను" వీరి కీ ర్తనములలో పలుతావుల ఇట్టి ప్రౌఢభాషా పరిశోభితములును, రసవంతములు నగు వాక్యములు గలవు. ఈ రచనలు మనుచరిత్ర రచనా తుల్యములని తెల్ప సందియము లేదు.

శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు ఆంధ్రభాషా సాహిత్యము యొక్క ఉత్తమ లక్షణములతో అలరారుచున్నవి. మరియు ఆంధ్రభాషలోని రసవంతములైన సామెతలతోను జాతీయములతోను తులదూగుచున్నవి. శ్రీ త్యాగరాజ స్వామియు, వారి పూర్వులును చిరకాలము నుండి తమిళదేశవాసు లగుటచే, ఆ భాషలోని జాతీయములనుగూడ శ్రీ స్వామివారు తమకీర్తనములలో ప్రయోగించిరి. వీరి కీర్తనములందలి సుందరభాషా ప్రయోగములకు ఉదాహరణములు :

343