పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/390

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గానశాస్త్ర చరిత్ర

పద వర్ణములు, తాన వర్ణములు, జతి స్వరములు, తిల్లానాలు, జావళ్ళు మున్నగువాటిని నాట్యానుకూలముగ చెప్పిరి. మాతృభూతయ్య, వేంకట్రామయ్య, వీణ పెరుమాళ్ళయ్య మొదలగువారు కొందరు కీర్తనాదులను చెప్పి పాడిరి.

19 వ శతాబ్దమున మరికొందరు శొంఠి వేంకటసుబ్బయ్య, రామస్వామి దీక్షితులు, ముద్దుస్వామి దీక్షితులు, పైడాల గురుమూర్తి శాస్త్రి, శ్యామశాస్త్రి, త్యాగరాజు, వడివేలు, స్వాతి తిరునాళ్ళు మహారాజు మొదలగువారు 72 ప్రస్తార మేళరాగములను పురస్కరించుకొని గేయవాఙ్మయము రచించిరి. రామస్వామి దీక్షితులు పెక్కు రాగమాలికలు నూతన పద్ధతిలో రచించెను. వేంకటమఖి 72 ప్రస్తార మేళరాగములలో, 108 తాళములలో కొన్నిటిని చేర్చి రాగమాలిక పాడెను. గురుమూర్తి శాస్త్రి లక్షణ గీతముల రచించెను. శ్యామశాస్త్రి కదళీపాకమున కామాక్షిప్రార్థనారూపమున కీర్తనలను జెప్పెను. విశేషముగ ఆనందభైరవి రాగమును, చాపుతాళము (మిశ్రగతి) ను వినియోగించెను. ముద్దుస్వామి దీక్షితులు నారికేళపాక రాగవిన్యాసమున 72 మేళ కర్తలందును, వీటి జన్యములందును సంస్కృతపాండిత్య యుతముగ కీర్తనలను జెప్పెను. మధ్యమకాలావృతములు, చిట్టస్వరములు కూడ వీరి కీర్తనలందు గలవు. సూళాది సప్తతాళములందు నవావరణకీర్తనలు, నవగ్రహ కీర్తనలు, షోడశ గణపతులనుగూర్చియు, సుబ్రహ్మణ్యుని గూర్చియు వందలాదిగా కీర్తనలను ఇతడు రచించెను.

త్యాగరాజు : ఇతడు రామభక్తుడై ద్రాక్షాపాకయుత రాగశైలితో పెక్కు కీర్తనలు భావమునకు తగిన రాగములతో పాడెను. ఊటలూరు భక్తిభావములతో సంకలిత మగునట్లు తన దైనందిన చర్యలు, తన కష్టములు, తన యిష్టదైవ మగు రామునకు నివేదించుకొనుచు ఇతడు పాడినపాటలు కడుంగడు శ్లాఘ్యములు, శ్రావ్యములు . వాటిలో కొన్ని భావ ప్రకటీకృత రాగ విధానమునకు తార్కాణములై ఆతని అనన్య సామాన్య ప్రతిభను ప్రకటించుచున్నవి.

వడివేలు అటతాళమున, పదవర్ణములను కాంభోజి, శంకరాభరణ రాగములందు చెప్పెను. స్వాతి తిరునాళ్లు మళయాళమున, సంస్కృతమున, తెనుగున, తమిళమున పెక్కు కీర్తనలు రచించెను. పెక్కు గాయకులను పోషించెను. గోవింద మారారీ కూడ యితని ఆస్థాన విద్వాంసుడే. పల్లవి గోపాలయ్య ఘన, నయ రాగములలో కీర్తనలను రచించెను. తోడి సీతారామయ్య తోడిరాగమును, శంకరాభరణం నరసయ్య శంకరాభరణ రాగమును దినములకొలది పునరుక్తి రహితముగ అలాపనము చేయగలిగిరట.

ఇక 20వ శతాబ్దియందు మహారాజపురం వైద్యనాథ అయ్యరు "కనకాంగ్యా "ది నామములు గల 72 మేళకర్తలను రాగమాలికగా పాడెను. ప్రజాదరణమును చూరగొను సంగీతకచేరి పద్ధతిని ప్రవేశ పెట్టి పండితాళి మెచ్చు పల్లవులు, పాటలు కచేరీలందు ఇతడు పాడుచుండెను. స్వరకల్పనలు కీర్తనలందుగూడ చేయుచుండెను. పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు, తచ్చూరి సింగరాచార్యులు, కోనేరి వైద్యనాథయ్యరు, రామనాథపురం (పూచ్చి) శ్రీనివాసయ్యంగారు, మధుర పుష్పవనం, మున్నగువారు ఘన, నయ రాగములందు కీర్తనలు పాడిరి.

ఫిడేలునందు తిరుక్కోడికావల్ కృష్ణయ్యరు, గోవిందస్వామిపిళ్లె మున్నగువారు నిపుణులైరి. అప్పటి నుండి ఫిడేలు గాత్రమునకు సహకార వాద్యముగ ఇట నెలకొన్నది.

తుమురాడ సంగమేశ్వరశాస్త్రి, వీణ వేంకటరమణ దాసు, ఈమని అచ్యుతరామశాస్త్రి, వీణధనం, కరైక్కుడి సాంబశివయ్యర్ ప్రభృతులు వీణాగానమునందు అసమానమైన పాండిత్యమును సంపాదించిరి. మైసూర్ నారాయణ అయ్యంగారు గోటువాద్యమున పాండిత్యమును సంపాదించిరి.

పొన్నూరు రామసుబ్బయ్య, ప్రయాగ తిరుమలయ్య, పాపట్ల కాంతయ్య, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, రాజనాల వేంకటప్పయ్య, దుడ్డు సీతారామయ్య, నారుమంచి చినసీతారామయ్య, గద్వాల ఆస్థాన విద్వాంసుడగు అనంతశాస్త్రి, బలిజేపల్లి సీతారామశాస్త్రి, తాడిగడప శేషయ్య, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, పిరాట్ల శివరామయ్య, ముక్త్యాల ఆస్థానవిద్వాంసు డగు పిరాట్ల శంకరశాస్త్రి, పురాణం కనకయ్యశాస్త్రి, టైగర్ వరదా

341